కూటమి చర్చలు..!

0

భువనేశ్వర్‌:

ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి లక్ష్యంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు కేసీఆర్‌. ఫ్రంట్‌ ఏర్పాటుకు సంబంధించి మలి విడత చర్చలకు తొలి అడుగు వేశారు. ఫ్రంట్‌ చర్చల్లో భాగంగా ఆదివారం కేసీఆర్‌ భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయాలతో పాటూ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై ఇద్దరు నేతలు చర్చించారు. నవీన్‌ పట్నాయక్‌తో భేటీ తర్వాత మాట్లాడిన కేసీఆర్‌.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి వెళ్లడానికి నిర్ణయించామని తెలిపారు. ఆ దిశగా తమ చర్చలు ప్రారంభమయ్యాయని.. ఇకపై కొనసాగుతాయని చెప్పారు. పట్నాయక్‌ను త్వరలో మరో సారి కలిసి.. చర్చిస్తానన్నారు. టీఆర్‌ఎస్‌ బీజేపీకి బీ టీమ్‌ అంటూ రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని.. మా టీమ్‌ ఏంటో త్వరలోనే చూడబోతున్నారంటూ సెటైర్‌ వేశారు. ఇది ఆరంభం మాత్రమేనని.. ఎన్నో అంశాలపై మాట్లాడాల్సి ఉందన్నారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ నిజాయితీ గల నాయకుడని ప్రశంసించారు కేసీఆర్‌. దేశంలోని రాజకీయ నేతల్లో పట్నాయక్‌ కూడా చాలా సీనియర్‌ అని గుర్తు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఒడిశాలో వ్యవసాయ రంగ అభివృద్ధికి.. సంక్షేమ కార్యక్రమాల అమలుకు సీఎం ఎంతో కృషి చేశారని కొనియాడారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ల అంశంపై కూడా ఇద్దరూ చర్చించినట్లు చెప్పారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుతో పాటూ దేశ రాజకీయాలపై చర్చించామన్నారు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌. భావసారూప్య పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు చాలా బాగున్నాయని.. వాటిపైనా చర్చ జరిగిందన్నారు. రైతు సంక్షేమానికి అమలవుతున్న పథకాల ప్రస్తావన వచ్చిందన్నారు. లోక్‌సభ ఎన్నికల గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేమన్నారు పట్నాయక్‌. మరోవైపు సీఎం కేసీఆర్‌ ఆదివారం రాత్రి ఒడిశా సీఎం అధికార నివాసంలో బస చేయనున్నారు. సోమవారం ఉదయం కోణార్క్‌ దేవాలయం, జగన్నాథ దేవాలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు పయనమవుతారు. సాయంత్రం 4 గంటలకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్‌ సమావేశం అవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here