Featuredరాజకీయ వార్తలు

కోదండరాం పార్టీకి ఇచ్చే సీట్లన్నీ ఓడిపోయే వేనా? – రామగుండం లో కోదండరాం గెలిచేనా!

కోదండరాం తెలంగాణ జన సమితి కి పొత్తుల్లో భాగంగా దక్కే సీట్లని ఓడిపోయే వి అని ప్రచారం జరుగుతోంది. ఎలాగో ఓడిపోయే సీట్లు కదా కోదండరాం పార్టీ ఇస్తే పోలే అనే ధోరణిలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి కోదండరాం పార్టీకి ఇవ్వాలనుకున్న సీట్లను పరిశీలిస్తే ఈ గుసగుసలో ఎంతో కొంత నిజం ఉంది అనిపిస్తుంది. రామగుండం, వరంగల్ ఈస్ట్ ,మల్కాజిగిరి ,చాంద్రాయణగుట్ట ,సిద్దిపేట, మెదక్ ,దుబ్బాక నియోజక వర్గాలను తెలంగాణ జన సమితి కి కేటాయించడం దాదాపు ఖరారైనట్లే. ఇందులో రామగుండం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం బరిలో ఉండటం ఖాయమే
మల్కాజిగిరి నుంచి ఆ పార్టీ సీనియర్ నేత కపిలవాయి దిలీప్ కుమార్ ,వరంగల్ east నుంచి గాదె ఇన్నయ్య, మెదక్ నుంచి జనార్ధన్ రెడ్డి, మిగతా నియోజకవర్గాల్లో ఆ పార్టీ సీనియర్ నేతలు బరిలో ఉండే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాల్లో కోదండరాం పార్టీకి ఓటు బ్యాంకు ఎంత ?కేడర్ ఏపాటిది ?అని ఒకసారి బేరీజు వేసుకోవాలి. ప్రత్యర్థి పార్టీకి ఉన్న బలం ఎంత అని ఓ సారి అంచనా వేయాలి. ఓసారి ఈ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల బలాబలాలను పరిశీలిస్తే… సిద్ధిపేట హరీష్ రావు పోటీచేసే నియోజకవర్గం. ఇక్కడ మరో పార్టీ దరిదాపుల్లో కూడా ఉండదు. ఇక చాంద్రాయణగుట్ట లో మజ్లిస్ పార్టీదే హవా. వరంగల్ ఈస్ట్ లో ఇప్పటికైతే గులాబీ పార్టీదే బలం. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ కి టికెట్ కేటాయిస్తే పరిస్థితిలో మార్పు ఉండే అవకాశం ఉంది .కానీ సరి అయిన కేడర్ ఓటు బ్యాంకు లేని టీజేఎస్ కేటాయిస్తే ప్రతికూల పరిస్థితులే ఉంటాయని ఇక్కడి క్షేత్రస్థాయి పరిశీలన చెబుతోంది. ఇక దుబ్బాకలో అటు అధికార పార్టీ నుంచి సోలిపేట రామలింగారెడ్డి, బిజెపి నుంచి రఘునందన్ రావు నడుమ ఆసక్తికర పోటీ ఉంది. ఈ పోటీలో రఘునందనరావు కే స్వల్ప ఆదిక్యత ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ కోదండరాం పార్టీ ప్రయత్నం ఏమేర ఫలిస్తుందో చూడాలి. ఇక ఇక మెదక్ నుంచి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ పార్టీ నేత జనార్దన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గం కూడా జన సమితి కి అంత తేలికైన వ్యవహారం కాదు.

రామగుండము లో కోదండరాం గెలిచేనా?

పార్టీ అధ్యక్షుడు కోదండరాం పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంలో ఎంతో కొంత నిజం లేకపోలేదు. తాను పోటీ చేస్తే పక్క నియోజకవర్గాలైన మంచిర్యాల ,పెద్దపల్లి, మంథని మీద ఆ ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు కోదండరాం కి నచ్చ చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే రామగుండం రాష్ట్రంలోనే ప్రత్యేక నియోజకవర్గం .ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతానికి ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ మూడో సారీ గెలవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే విధంగా టిఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా కోరు కంటి చందర్ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. వీరిద్దరి నడుమ మూడో పార్టీకి అవకాశమే లేకుండా పోయింది. ఇక్కడ కోదండరాం నిల్చున్న మరొకరు నిల్చున్న ఫలితం మాత్రం ఇరువురి నడుమ ఉండే అవకాశం ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పటికే కోరు కంటి, సోమవారపు విడత ప్రచారం చుట్టేశారు .కాంగ్రెస్ టిక్కెట్ కోసం ఆశలు పెట్టుకున్న మక్కాన్సింగ్ కి ఇక్కడ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు టికెట్ దక్కితే కాంగ్రెస్ పార్టీకి ఊపు వస్తుంది. టికెట్ మీద ఆశ పెట్టుకున్న మక్కాన్సింగ్ టికెట్ రాని పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ క్యాడర్ అంతా ఆయన వెంట నడిచే అవకాశం లేకపోలేదు .ఈ పరిస్థితుల్లో పార్టీ నిర్మాణం లేని సరైన ఓటు బ్యాంకు లేని కోదండరాం కి ఓట్ల బదలాయింపు జరగడం అనుమానమే .అందుకే కోదండరాం రామగుండం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం పెద్ద రాజకీయ తప్పిదంగా పలువురు అంటున్నారు. పార్టీ అధ్యక్షుడు మూడో స్థానానికి పడిపోతే ఆ ప్రభావం రానున్న రోజుల్లో ఆయన రాజకీయ జీవితం పై పడే అవకాశం మెండుగా ఉంది.
ముఖ్య నేతలు పోటీ చేస్తే మిగతావారి సంగతి ఏంటిది?
కోదండరాం ,దిలీప్,ఇన్నయ్య ,జనార్దన్ రెడ్డి వంటి ముఖ్య నేతలు పోటీ చేయడం ఖాయం. పార్టీ స్థాపన నాటి నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వివిధ నియోజకవర్గాల్లో కొందరు అభ్యర్థులు పని చేస్తున్నారు. ఈ మహాకూటమిలో జన సమితి చేరడంతో వారందరికీ నిరాశే ఎదురవుతుంది. దీనిపై పార్టీలో తీవ్ర అసంతృప్తితో కొందరు నేతలు ఉన్నారు. టికెట్ల ప్రకటన తరువాత చాలామంది నేతలు పార్టీ మారతారని సంకేతాలు ఉన్నాయి. ఆ దిశగా ద్వితీయ శ్రేణి నేతలు, పోటీ పై ఆశలు పెట్టుకున్న నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ పరిణామం కోదండరాం పార్టీకి మేలు చేయని అంశంగా పలువురు విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి కోదండరాం జన సమితి కోరుతున్న లేకపోతే మహాకూటమి ఇవ్వజూపుతున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ కేమి సానుకూల పరిస్థితులు లేవు. పైగా ఆ పార్టీకి సొంత కేడర్, సరైన ఓటుబ్యాంకు లేవు. ఈ పరిస్థితులన్నిటినీ బేరీజు వేస్తే పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో గెలుపు.. కోదండరామ పార్టీకి కొండను తవ్వి పక్కకు పెట్టడం వంటిదే. చూడాలి చివరాఖరకు పరిస్థితులు ఎలా ఉంటాయో!

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close