తన విజయానికి ..వారణాసి ప్రజలంతా ఆశీస్సులివ్వాలి

0

  • ఎవరైనా ఒక్కసారికాశీకి వచ్చినా ఆ నగరంతో మమేకమవుతారు
  • ఐదేళ్లుగా అనుక్షణం నేను అలాంటి అనుభూతినే పొందా
  • వారణాసి వాసులకు ప్రధాని భావోద్వేగ వీడియో రిలీజ్‌

న్యూఢిల్లీ : వారణాసి నుంచి మరోసారి బరిలో నిలిచానని, తన విజయానికి వారణాసి ప్రజలంతా ఆశీస్సులివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. వారణాసితో తనకున్న వ్యక్తిగత, భావోద్వేగ సాన్నిహిత్యాన్ని వివరిస్తూ తన వెబ్‌సైట్‌ ద్వారా మంగళవారం ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఎవరైనా సరే ఒక్కసారి కాశీకి వచ్చినా ఆ నగరంతో మమేకమవుతారని మోదీ పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా అనుక్షణం నేను అలాంటి అనుభూతినే పొందానని, నన్ను నేను మలుచుకునే విషయంలోనూ, రాజకీయ, ఆథ్యాత్మిక మార్గాన్ని నిర్దేశించుకోవడంలోనూ కాశీప్రభావం నాపై ఎంతైనా ఉందని మోదీ అన్నారు. కాశీ కేవలం తన ప్రపంచం మాత్రమే కాదని, మతపరంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికపరంగా తనకు స్ఫూర్తి అని, కాశీవాసులు తనకు ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించారని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో కాశీ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం చూసి తాను గర్విస్తున్నానని, దేశానికే కాశీ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తన హయాంలో కాశీలో చేసిన వివిధ అభివృద్ధి పనులను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ‘ఇళ్లు కావచ్చు, టాయ్‌లెట్లు కావచ్చు, ఉచిత ఎల్పీజీ, విద్యుత్‌ కనెక్షన్లు కావచ్చు, అన్ని రంగాల్లో అభివృద్ధికి నిజమైన ఉదాహరణగా కాశీ నిలిచిందన్నారు. హస్తకళాకారులు దీన్‌దయాల్‌ హస్తకళా సంకుల్‌ ద్వారా తమ ఉత్పత్తులకు అంతర్జాతీయ ఖ్యాతి గడించారన్నారు. రెండు కొత్త కేన్సర్‌ ఆసుపత్రుల నిర్మాణం వారణాసి ప్రజలకు మాత్రమే కాక, చుట్టుపక్కల ప్రాంతాల వారికి సైతం ఎంతో ఉపయుక్తంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. కాశీలోని రైతులు, వర్తకులు, వ్యాపారవేత్తలు, యువకులు, మత్స్సకారుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకున్నామని, కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ నిర్మాణం ప్రశంసలు అందుకుంటోందన్నారు. ఐదేళ్లుగా చాలా పనులే చేసినా ఇంకా.. ఇంకా చేయాల్సింది చాలానే ఉందని మోదీ ఆ వీడియోలో పేర్కొన్నారు. కలిసికట్టుగా మనం అందుకు కృషి చేద్దామని, వేగంగా జరుగుతున్న అభివృద్ధి ఆగకుండా మనం అంతా కలిసి ప్రతిజ్ఞ చేద్దామని ప్రధాని అన్నారు. మీటింగ్‌ ముందు రోజు నియోజవర్గంలో పర్యటించే అవకాశాలు లేవని మోదీ సంకేతాలు ఇస్తూ, కాశీ వాసులంతా తన విజయానికి కృషి చేస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. దేశమంతా కాశీవైపే చూస్తోందని, సంప్రదాయ దుస్తులు ధరించి ఓ పండుగ మాదిరి ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనండని, ఓటింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించండని మోదీ పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here