Featuredస్టేట్ న్యూస్

అంతా మేకపోతు గాంభీర్యమే…

  • ఫలితాలపై టెన్షన్‌.. టెన్షన్‌…
  • బయటికి మాత్రమే ధీమా…

ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు నలభై రోజులు.. ఫలితాలపై మే చివరి వరకు ఆగాల్సిందే.. ఫలితాల ప్రభావం ఏలా ఉంటుందో తెలియదు. ఎవరూ గెలుస్తారో సరియైన అంచనా లేదు.. ఆశ ఉన్నవారందరికి నిరాశా కావచ్చు… అనుమానం ఉన్నవారు అవలీలగా గెలవనూవచ్చు.. ఇవన్నీ జరగాలంటే అన్నిరోజులు ఆగాల్సిందే.. బరిలో ఉన్న నాయకులకు ప్రతిరోజు టెన్షన్‌ టెన్షనే. ఓటరు తీర్పు ఎవరిని మహరాజును చేస్తుందో, ఎవరిని పరాజితున్ని చేస్తుందో అర్ధమే కావడం లేదు. చాలా ప్రాంతాల్లో ఎన్నికలు చప్పచప్పగానే జరిగాయి. అసెంబ్లీ కన్నా పార్లమెంట్‌ ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తక్కువ పోలింగ్‌ శాతంలో గెలుపు ఎవరిని వరిస్తుందనేది నేడు ప్రధాన చర్చానీయాంశంగా మారిపోయింది.. పోలింగ్‌ శాతం తక్కువైనా గెలుపు మాదేనంటూ అన్ని పార్టీలు పైకి మాత్రం ధీమాగా ఉన్నప్పటికి లోలోపల మాత్రం భయం భయంగానే కనబడుతున్నారు. ఎవరికి విజయమో, ఎవరికి పరాజయయో తెలుసుకోవాలంటే ఫలితాలు వచ్చేవరకు వీరికి నిత్యం పరీక్షనే…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

ఎవరి అంచనాలు వారికున్నాయి.. ఎవరి సర్వేలు వారు తీసుకున్నారు.. అందరికి అభ్యర్థులందరికి గెలుపుపైనే ప్రధాన నమ్మకాలు ఉన్నాయి.. తాము గెలుస్తామంటే తాము అంటూ అందరూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం అందరికి వణుకు మొదలయ్యింది. కారు, సారూ, పదహారు అంటూ టిఆర్‌ఎస్‌ పార్టీ మొదటినుంచి తెలంగాణ లోక్‌సభలో ఒక్కటి మినహా పదహారు సీట్లను క్లీన్‌స్విప్‌ చేయాలని అనుకుంటూ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని రద్దుచేసిన వెంటనే నూట ఐదు మంది ఎమ్మెల్యెలను ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు కెసిఆర్‌. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే ప్రకటించారని అందరూ ఆరోపణలు చేశారు. ఓటమి ఖాయమనుకున్న టిఆర్‌ఎస్‌కు ఎనభైఎనిమిది సీట్లతో అత్యధిక మెజారిటితో మళ్లీ అధికారంలోకి వచ్చారు. కాని లోక్‌సభ ఎన్నికలలో అభ్యర్థులను ప్రకటించే సమయంలో మాత్రం గులాబీ అధినేత చాలా తాత్సారం చేశారని అందరూ ఆరోపించారు. తెలంగాణలో అనుకున్న పదహారు సీట్లు సాధించాలంటే అభ్యర్థుల విషయంలో ఆచితూచి ఆడుగేయాలని భావించాని గులాబీ బాస్‌ నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన కూడా అభ్యర్థులను ప్రకటించనే లేదు. చివరి సమయంలో అభ్యర్థులను ప్రకటించి అవకాశం వస్తుందనుకునేవారిని దూరంగా పెట్టి కొత్త ముఖాల అవకాశం కల్పించారు. పదహారు లోక్‌సభ స్థానాలను గెలవడమే ప్రధానంగా వ్యూహాలు రచించిన కెసిఆర్‌ అందుకు తగ్గట్టుగానే ప్రచారం సభలు నిర్వహించారు. నిత్యం అభ్యర్థులను, మంత్రులను పర్యవేక్షిస్తూ గెలుపు ఏలా సాధ్యమవుతుందో అనే వివిధ అంశాలపై వారికి తగిన తర్పీదు ఇస్తూ నిత్యం నిఘా వేసినట్టు పార్టీ సన్నిహితులు చెపుతున్నారు. అభ్యర్థులను అర్థరాత్రి సైతం ప్రచారానికి ఊసిగొల్పిన అధినేత ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు.. తెలంగాణ అసెంబ్లీలో ప్రతి సీటు, ప్రతి ఓటు అవసరమైనట్టుగా విరోచితంగా ప్రచారంతో పాటు, ఓటర్లను ఆకర్షించారు. కాని పార్లమెంట్‌ ఎన్నికలకు వచ్చేవరకు మాత్రం ఓటర్లపై దృష్టి సారించలేదనే తెలుస్తోంది. అందుకే చాలా నియోజకవర్గాల్లో అతి తక్కువ శాతం పోలింగ్‌ నమోదయింది. ఈ తక్కువశాతం పోలింగ్‌ అధికార తెరాస పార్టీకి కలిసోస్తుందా, లేక ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందో అనేది తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

మనసంతా గుబులు గుబులే…

కారుకు పదహారు రాకపోతే పరిస్థితి ఏంటీ. నాలుగైదు తక్కువైనా ఓడిపోయిన సీట్లలో నిజామాబాద్‌ ఉంటే పార్టీ భవిష్యత్తు ఏంటనేది నేడు పార్టీలో జరుగుతున్న ప్రధాన చర్చ. ముఖ్యమంత్రి కూతురు ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ నియోజకవర్గంలో రైతుల సమస్యలకు పరిష్కారం చూపించలేదనే ఆరోపణలున్నాయి. అక్కడ రైతులు ఎంపీ చుట్టు తిరిగి తిరిగి విసిగి చెంది చివరకు రైతులే పోటిలో నిలిచారు. అందుకే అక్కడ ఎన్నికలు దేశవ్యాప్తంగా రికార్డులకెక్కాయి. నూట ఎనభై ఐదు మంది బరిలో ఉన్నా నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో కెసిఆర్‌ కూతురు గెలుపు అంతా సాధ్యంకాదనే తెలుస్తోంది. రైతులు ఉమ్మడిగా ప్రచారం చేయడం, మొదటి ఈవిఎం తప్ప దేనికైనా వేయమని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లడం వంటి అంశాలు అక్కడ బలంగా నాటుకుపోవడంతో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత గెలుపు కష్టమనే తెలుస్తోంది. ఇక్కడ కవిత ఓడిపోతే దేశాన్ని పాలిస్తానని, కేంద్రం మెడలోంచుతానని చెపుతున్నా కెసిఆర్‌ ముందు రాష్ట్ర ప్రజలకు ఏలాంటి సమాధానం చెపుతారో అర్థం కావడం లేదు. స్వంత కూతురుని గెలిపించుకోలేని నాయకుడు కేంద్రంపై ఏం చేస్తాడనేది ప్రతిపక్షాల నుంచి ప్రధానంగా వచ్చే ఆరోపణ ఇది. అన్ని స్థానాలకన్నా గులాబీ అధినేత కెసిఆర్‌ నిజామాబాద్‌ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐనా అక్కడ టిఆర్‌ఎస్‌ ఓడిపోతే పరిస్థితి ఏంటనేది విషయంపైననే ఆయన ప్రధానంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు గులాబీ అధినేతతో పాటు ఆయన సన్నిహితలు మనసంతా గుబులు గుబులుగానే ఉన్నట్లు పార్టీ నాయకులు చెపుతున్నారు.

గెలుపోటములపై జోరుగా బెట్టింగ్‌లు..

తెలంగాణతో పాటు, ఆంధ్రాలో కూడా గెలుపోటములపై బెట్టింగ్‌ల హావా జోరుగా కొనసాగుతోంది. ఫలానా స్థానంలో మా అభ్యర్థే గెలుస్తాడంటూ ఒకరూ, కాదు కాదు మా వాడికే అవకాశం ఉందంటూ మరొకరు లక్షల నుంచి కోట్ల వరకు హైదరాబాద్‌ కేంద్రంగా బెట్టింగ్‌లు సాగిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే అభ్యర్థులందరూ ఓట్ల సరళిపై లెక్కలు వేసుకుంటున్నారు. పోలింగ్‌ పూర్తవ్వడంతో ఇక ఫలితానికి నలభై రోజుల సమయం ఉంది. దీన్ని అవకాశం చేసుకోవడానికి బెట్టింగ్‌ రాయుళ్లు, రంగంలోకి దిగారు. కొంతమంది పరిచయం ఉన్నవాళ్లను ఫోన్లలో సంప్రదించుతుంటే, మరికొంతమంది వారు పనిచేసే కార్యాలయాలలో వారిని రంగంలోకి దింపుతున్నారు. వారి వారి ఏరియాలో జరిగిన పోలింగ్‌ సరళిపై ఆరాతీస్తూ అక్కడ ఎవరూ గెలుస్తారో, ఎవరికి ఏలా అవకాశం ఉందో తెలుసుకుంటూ రంగంలోకి దింపుతూ పందాలు కాస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు మెజారిటీ ఏలా ఉంది అనే పలు అంశాలపై బెట్టింగ్‌ రాయుళ్లు పందెం కాస్తున్నారు. ఏకంగా కొన్ని ప్రాంతాల్లో బుకీలు కూడా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇరవై ఐదు వేల నుంచి మొదలుకొని ఇరవై ఐదు లక్షల వరకు పందాలు కాస్తున్నారని, ఏపీలో కొన్ని ప్రాంతాల్లో కోట్ల వరకు పోతుందని చెపుతున్నారు. గెలుపోటములపై బరిలో ఉన్న నాయకుల టెన్షన్‌తో పాటు, పందాలు నిర్వహిస్తున్న పందెం రాయుళ్ల భవిషత్తు కూడా తెలియాలంటే మే చివరి వరకు ఆగాల్సిందే.. ఎవరూ పరాజితులో, ఎవరూ విజేతలే తెలిసిపోతుంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close