Featuredస్టేట్ న్యూస్

పోటీకి రైతులు సై!

  • వారణాసీ ఎన్నికల బరిలో రైతులు
  • కేంద్రం అలసత్వానికి నిరసనగా..
  • నేడు చలో వారణాసి

మనకు తెలుగులో ఒక సామెత ఉన్నది.. మనది ఉడుం పట్టు.. పట్టిందంటే తాడో పేడో తెల్వాలే.. అనుకుంటాం.. ఇక్కడ నిజామాబాద్‌ రైతులు కూడా అలానే అనుకుని ఉంటారు. వారు పట్టిన పట్టు విడువకుండా దేశంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర , పసుపు బోర్డు కల్పించాలని రెండు సంవత్సరాలుగా పోరాడుతున్న వారికి నిరాశే ఎదురవుతోంది. దీంతో ఆగ్రహించిన అన్నదాతలు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో మొన్న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌కు చెందిన 185 మంది ఎంపీ అభ్యర్ధులుగా నామినేషన్‌ వేశారు. అయితే అక్కడ స్వయంగా ముఖ్యమంత్రి కూతురు ఎన్నికల బరిలో ఉండడంతో కేసీఆర్‌ వారిని ఉపసంహరించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎక్కడా తగ్గకుండా మద్దతు దరే ముఖ్యమని చాటిచెప్పేందుకు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి పార్లమెంట్‌ నియోజక వర్గం నుండి తాము కూడా మోడీకి పోటీగా ఎన్నికల బరిలో నిస్తామని 50 మంది రైతులు చలో వారణాసి పేరుతో అక్కడికి బయలు దేరారు..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిజామాబాద్‌ పసుపు రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి షాక్‌ ఇచ్చేందుకు తెలంగాణ పసుపు రైతులు సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ బరిలో నిలిచిన వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని రైతులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్‌ గ్రామీణం ప్రాంతాలకు చెందిన 50 మంది రైతులు వారణాసికి వెళ్లి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు మద్దతు ధర విషయంలో కేంద్రం అలసత్వానికి నిరసనగానే తాము వారణాసిలో పోటీకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. వారణాసిలో పోటీ సందర్భంగా తాము ఎవరికీ వ్యతిరేకంగా ప్రచారం చేయబోమని రైతులు తెలిపారు. ఈ మేరకు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నాయకత్వంలో 50 మంది రైతులు ‘చలో వారణాసి’ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాలోని అర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి వారణాసి వెళ్తున్నామని రైతులు చెప్పారు. స్వతంత్ర అభ్యర్థులుగా వారణాసి ఎంపీ స్థానానికి నామినేషన్‌ వేస్తామన్నారు. పసుపు బోర్డుతోపాటు పంటకు మద్దతు ధర సాధించాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నామని, ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా తాము ప్రచారం నిర్వహించబోమని స్పష్టంచేశారు. నిజామాబాద్‌లో పోటీ వ్యవహారాన్ని భాజపా, కాంగ్రెస్‌లు రాజకీయంగా వాడుకున్నాయని ఆరోపించారు. నిజామాబాద్‌ ఎంపీ కవితే లక్ష్యంగా ప్రచారం చేయడం వల్ల అసలు లక్ష్యం పక్కదారి పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు సాధన కోసం ఐదేళ్లుగా ఆమె పోరాటం చేశారన్నారు. తమకు మద్దతుగా తమిళనాడు నుంచి కొందరు రైతులు వస్తున్నారని, ఇతర ప్రాంతాల నుంచి రైతులు తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 185 మంది రైతులు బరిలో నిలవడం సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

పసుపుబోర్డు, మద్దతుధర కోసం తాము చేసిన పోరాటాన్ని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు కోసం పోరాడారని వ్యాఖ్యానించారు. తమకు మద్దతుగా వారణాసికి తమిళనాడుకు చెందిన రైతులు కూడా వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా తమకు మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ నెల 11వ తేదీన నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 178 పసుపు రైతులు పోటీ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్న రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని నిజామాబాద్‌ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. తమ సమస్యలను దేశ ప్రజల దృష్టికి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుండి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. నిజామాబాద్‌కు చెందిన రైతులు ఛలో వారణాసికి మంగళవారం నాడు శ్రీకారం చుట్టారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ వారణాసి నుండి పోటీ చేశారు. ఈ దఫా కూడ ఆయన మరోసారి అదే స్థానం నుండి పోటీ చేయనున్నారు. ఈ ఏడాది మే 19వ తేదీన వారణాసి ఎంపీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close