వైద్యులంతా నిరుద్యోగులే..

0

వందల్లో ఉద్యోగాలు.. వేలల్లో దరఖాస్తులు…

ఎంబిబిఎస్‌కు తప్పని అవస్థలు…

లక్షలు పెట్టాలి… నిత్యం చదవాలి.. తీరికుండదు.. పుస్తకాల పురుగుల్లా ఐదు సంవత్సరాలు దానికే అంకితమవ్వాలి.ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని వివరంగా, విపులంగా పరిశోధించి సాధించాలి.. పేరు మాత్రం చాలా గొప్పది.. చదువు కూడా గొప్పదే.. చూసే వారు.. చెప్పుకునే వారు అందరూ గర్వంగా ఫీలవుతారు.. ఆయనకేంటయ్యా కొడుకు పెద్ద చదువు చదువుతున్నారని చెపుతారు.. కాని లక్షలు కుమ్మరించి సంవత్సరాలకు సంవత్సరాలు చదువుతున్న చదువుకు కనీస ఉపాధి కరువవుతోంది.. పట్టా చేతికొచ్చి బయటికొస్తే అంతా శూన్యమే కనబడుతోంది.. ఎందుకు చదివామో, ఎందుకు చదువుతున్నామో అర్థం కాని వారు వందల్లో కాదు వేలల్లో ఉన్నారు. ఐదు వందల ఉద్యోగుల కోసం యాభై వేల మంది దరఖాస్తు చేసారంటే వారిలో నిరుద్యోగం ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. రాత్రింబవళ్లు లక్షలు ఖర్చు పెట్టిన చదువుకు ఉపాధి లేక పై చదువులు చదివేవారు కొందరైతే, బతకడానికి ఏదో ఒక దారంటూ ప్రవేట్‌ దారి పెట్టే వారు అనేకులు ఉన్నారు.. మనమంతా చెప్పుకుంటున్నది ఏదో డిగ్రీ, పిజీ చదువులు చదివిన విద్యార్థుల గురించి కాదు.. ఎంబిబిఎస్‌ పూర్తి చేసిన రేపటి తరం వైద్యుల గురించి… ఉద్యోగం లేక నిరుద్యోగంతో తల్లడిల్లుతున్న ఎంబిబిఎస్‌ పూర్తి చేసిన వైద్యులపై ఆదాబ్‌ ప్రత్యేక కథనం…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

డాక్టర్‌ రవిందర్‌ 2016లో ఎంబిబిఎస్‌ పూర్తి చేశారు.. డాక్టర్‌ పట్టా చేతికొచ్చింది.. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నేడు దేశంలో గొప్పగా చెప్పుకునే వృత్తులలో వైద్యవృత్తి ప్రధానమైనది. అలాంటి డాక్టర్‌ పూర్తవ్వగానే కొన్ని రోజులు పల్లెల్లో పనిచేయాలని నిశ్చయించుకున్నాడు. నోటిపికేషన్‌ కోసం ఎదురుచూడసాగాడు.. సంవత్సరం గడిచింది. రెండు సంవత్సరాలు నడుస్తున్నాయి. కాని నోటిపికేషన్‌ జాడే లేదు.. ఏం చేయాలో తోచడం లేదు. వైద్యశాస్త్రం చదవడానికి ఇంచుమించుగా అరవై లక్షలు ఖర్చయ్యాయి. డబ్బులపై ఆలోచన రాకున్నా కనీసం పేదప్రజలకు సేవచేయాలనే ఆనందమైనా ఉంటే చాలనుకుంటే అదీ కూడా లేదు.. ఎండి చదవాలంటే దానికి బోలేడు ఖర్చు కావాలి.. ఇంకా చేసేదేమి లేక ఎదురుచూసి చూసి చివరకు ఒక కార్పోరేట్‌ ప్రవేట్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యాడు. అక్కడ ఆ వైద్యుడి జీతం ఇరవై వేలు మాత్రమే.. ఆ జీతంతో ఏం చెయ్యాలో, ఏలా బతకాలో అర్థంకాక సతమతమవుతున్నాడు డాక్టర్‌ రవిందర్‌…

డాక్టర్‌ సింధూర 2017లో వైద్యవిద్యను పూర్తి చేసి పట్టాను అందుకుంది. పేరుకు ముందు డాక్టర్‌ అనే చేరడంతో అమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కార్పోరేట్‌ విద్యపై దృష్టి పెట్టకుండా కొన్ని రోజులు అనుభవం కోసం ఆసుపత్రిలో జాయిన్‌ అయింది. అంతలోనే ప్రభుత్వం ఆసుపత్రులలో వైద్యులు కావాలని నోటిఫికేషన్‌ రావడంతో ఆనందంగా దరఖాస్తు చేసింది. నోటిఫికేషన్‌ వచ్చింది 300 ఉద్యోగాలకు, దరఖాస్తు చేసిన వారు 40000 వేల మంది.. ఆమెకంటే అంతమందే ఎక్కువ ఉండడంతో చేసేదేమి లేక పిజి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. రెండు సార్లు పిజి రాసినా రాలేదు. తాజాగా మళ్లీ ప్రిపరేషన్‌లో ఉంది. ఎంబిబిఎస్‌ డిగ్రీతో నగరంలోని ఒక ప్రవేట్‌ ఆసుపత్రిలో పనిచేస్తుంది. అక్కడ వచ్చే వేతనం 25000 వేలు మాత్రమే.. లక్షల రూపాయల ఫీజు బ్యాంకు రుణం తీసుకొని ప్రైవేట్‌లో పిజి చేసినా తర్వాత ఆ రుణం చెల్లించే స్ధాయిలో సరియైన వేతనం రాపోతే తర్వాత భవిష్యత్తు ఏమిటనేది అర్థం కాకుండా పోయింది. వైద్య వృత్తి చదివి కూడా ఉద్యోగం కోసం, చేసిన ఉద్యోగానికి సరియైన వేతనం లేక ఎదురుచూసే వారు వేలల్లో ఉన్నారు..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవకాశాలు లేవు..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు సహాయం అందిస్తామన్న అవకాశాలు లేవు. తెలంగాణలో 2017లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పిహెచ్‌సి) ఐదు వందల మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల కోసం ఐదువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అటు పిజి చదువుదామంటే అవకాశాలు లేవు. ఉద్యోగం చేద్దామంటే ఖాళీలు లేవు. ప్రవేట్‌ ఆసుపత్రుల్లో చేసే పనికి సరియైన వేతనం లేక నానా అవస్థలు పడుతున్నారు వైద్యులు. ప్రవేట్‌ ఆసుపత్రుల్లో ఇచ్చే ఇరవై, ఇరవై ఐదు వేలతో ఇంటి అద్దె, తిండికి కూడా సరిపోవడం లేదని బాధపడేవారు చాలామంది ఉన్నారు. ప్రభుత్వం మండలానికో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించింది కాని గ్రామానికి ఒక ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తే అటు పేద ప్రజలకు వైద్యం అందుతోంది. వైద్యులకు ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వం వైద్యం కోసం లక్షల, కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నాం, ప్రజల ఆరోగ్యమే మా ప్రధాన విధి అని చెప్పడమే సరిపోతుంది కాని ప్రతి గ్రామానికి వైద్యున్ని నియమించాలనే ఆలోచన ఎందుకు చేయడం లేదో అర్థమే కావడం లేదు. ప్రతి తండా, పల్లెలో సైతం అంగన్‌వాడీ కేంద్రం, పంచాయితీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాల ఉన్నట్టే ఆసుపత్రిని ఎందుకు నిర్మించడం లేదో అర్థమే కావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించుగా పదివేలకు పైగా గ్రామాలున్నాయి. అందులో కేవలం ఏడువందల పిహెచ్‌సీలు మాత్రమే ఉన్నాయి. అంటే పల్లెలో పనిచేయాలని ఆసక్తి ఉన్న వైద్యులకు అవకాశమే లేకుండా పోయింది. ఏడు వందల వైద్యులకు మాత్రమే ఉపాధి లభిస్తుంది. మిగతా వారికి ఆలోచన ఉన్నా అవకాశం లేకపోవడంతో చేసేదేమి లేక ప్రవేట్‌ ఆసుపత్రుల వెంట తిరుగుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మాత్రం ప్రతి వెయ్యి మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి ఒక వైద్యుడు నియమించాలని చెపుతున్నా పట్టించుకునే వారే లేరు. పిహెచ్‌సిలు పెంచి ప్రజలు ఆరోగ్యం బారినపడకుండా కాపాడి, వైద్యులకు అవకాశం ఇవ్వాలని నిబంధనలు చెప్పినా వాటిని మూలకు పడేస్తున్నారు. ప్రభుత్వమే తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తే ఇటు వైద్యుల బాధలు ఇంకెవరు పట్టించుకుంటారనేది నేడు ప్రధాన అంశంగా ఉంది.

చదివిన చదువుకు అవకాశాలు కల్పించాలి..

డాక్టర్‌ పిఎస్‌. విజయేందర్‌.. అధ్యక్షుడు టిఎస్‌ జూడా..

ఐదు సంవత్సరాలు చదివిన చదువుకు నేడు అవకాశాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎంబిబిఎస్‌ పూర్తి చేసి పల్లెల్లో పనిచేయాలనే ఆసక్తితో, ఆనందంతో బయటికి వచ్చేవారు ఉన్నా ప్రభుత్వం వారిని గుర్తించడం లేదు. ఒకప్పుడు వైద్యుడు అంటే దేవుడిలా కొలిచేవారు, నేడు చిన్న తప్పు జరిగిందో, లేదో దాడులు కూడా వెనుకాడటం లేదు. ఒక పక్క ఉపాధి అవకాశాలు లేవు. మరొ పక్క ఉన్న ఉద్యోగం చేయాలంటే భయం.. ప్రభుత్వమేమో తనకేమి పట్టింపులేనట్టే వ్యవహరిస్తోంది. ప్రవేట్‌ ఆసుపత్రుల్లో వేతనాలు చూస్తుంటే మరీ ఘోరంగా ఉన్నాయి. లక్షలు ఖర్చులు చేసి ప్రవేట్‌లో చదివినా నేడు ఉపయోగమే లేదు. ఆనారోగ్యంతో ఉన్న వారికి వైద్యం చేయాల్సిన వైద్యులే నేడు పరిస్థితులను చూసి కట్టిన ఫీజులకు వడ్డీలు రాక, బతకడానికి డబ్బులు లేక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి జీవనమే గగనంగా మారిపోయింది. ఒక పక్క గ్రామాల్లో అర్హత లేని వైద్యులు స్థానికంగా ఉంటూ వైద్యం చేస్తున్నారు. వారు ఏలాంటి వైద్యం అందిస్తున్నారో ప్రభుత్వం మాత్రం నియంత్రించడం లేదు. ఎంబిబిఎస్‌ చదివిన వారికి నిబంధనలు ఉన్నా అర్హత లేని వైద్యులకు మాత్రం ఏలాంటి నిబంధనలు లేవు. వీటిపై ప్రభుత్వమే స్పందించి కఠినచర్యలు తీసుకొని అర్హతగల వైద్యులకు అవకాశం కల్పించాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here