Featuredస్టేట్ న్యూస్

వనమంతా భక్తజనమే..

  • నేడే సారలమ్మ ఆగమనం..
  • మొదటి ఘట్టానికి అంతా సిద్దం.
  • అడుగడుగునా అధికారుల పర్యవేక్షణ..
  • నిఘా నీడలో మేడారం జాతర..

వనమంతా జనంతో నిండిపోయింది.. ప్రతి అడుగూ.. ప్రతి వాహనం జనజాతర వైపే కదులుతోంది.. ఒక్కటక్కటిగా… ఒక్కరొక్కరిగా ప్రారంభమైనా గిరిజన గుడారం, నేడు జనారణ్యంగా మారిపోయింది. రెండు సంవత్సరాలకొకసారి వనం నుంచి జనంలోకి వచ్చే ఆ తల్లుల ఆగమనమే ఒక మరపురాని అనుభూతి.. కోట్లాది భక్తులను తనివితీరా చూసేందుకు సమ్మక్క, సారలక్కలు జనంలోకి వస్తారు. తమ బిడ్డలను మనసారా చూసి, వారి కొరిన కోర్కెలను ఆలకించి మదినిండా దీవించే ఆ ఘడియలు మరిచిపోలేనివి. ఆ తల్లులను తరించి, దర్శించి, ఆలయ పరిసరాల్లో ఉంటేనే జన్మధన్యమనుకునే వారే లక్షల్లో ఉంటారు. అక్కడ భక్తులు గడిపే ప్రతి గడియ కూడా ఆ తల్లుల ఆలోచనలతోనే తన్మయత్వం చెందుతారు. మదినిండా భక్తితో పరవశించిపోతారు. ఎడారిగా ఉండే మేడారం నేడు లక్షలాది మంది భక్తుల గుడారాలతో ఇంచుమించుగా పదికిలోమీటర్ల మేరకు పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మేడారంలోని మొదటి ఘట్టం సారలమ్మను తీసుకొచ్చే కన్నెపల్లిని ఆదివాసీలంతా సిద్దం చేశారు. అధికారయంత్రాంగం కూడా సిద్దమైపోయింది. మేళతాళాలతో, భక్తుల జయజయరణధణ ధ్వనులతో వనంలో ఉన్న తల్లి సారలమ్మ ఆగమనంతో అతి పెద్ద గిరిజన జాతర మొదలవుతోంది.. భక్తులు పూనకాలతో భక్తి పారవశ్యంతో స్వాగతం పలుకుతారు. ఎదురుకోళ్లను బలి ఇస్తూ, శివసత్తులతో ఊగిపోతారు. జిల్లా ఇంచార్జ్‌ కలెక్టర్‌ కర్ణన్‌, ప్రత్యేక అధికారి గౌతమ జాతర పనులను పర్యవేక్షిస్తున్నారు. సారలమ్మ ఆగమనాన్ని లక్షలాది మంది భక్తులు మధ్య గద్దెపై కొలువు తీరనుంది. మార్గమధ్యంలో ఏలాంటి అటంకాలు కలుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జంపన్నవాగు అవతలి నుండి రానున్న సారలమ్మ లక్షలాది మంది భక్తుల మధ్య గద్దెల మీద కొలువుతీరనుంది.

మేడారం ఆదాబ్‌ హైదరాబాద్‌.. (రాజేందర్‌ పల్నాటి. ప్రత్యేక ప్రతినిధి మేడారం నుంచి)

గిరిజన గుడారం మేడారంలో ప్రధాన ఘట్టం ప్రారంభకానుంది. ఆదివాసీ పూజారులు ఉదయమే తమ ఆరాధ్యదైవానికి పూజలు చేసి కనకవనంతో కన్నెపల్లికి వస్తారు. అక్కడ భక్తి పారవశ్యంతో తల్లిని నిమగన్నం చేసుకొని జయజయ ద్వానాల మధ్య, భక్తుల హోరులతో, డప్పు చప్పుళ్లతో సారలమ్మ వనం నుంచి జనంలోకి బయలుదేరుతోంది. సారలమ్మ వచ్చే దారి అంతా భక్తుల గుడారాలతో నిండిపోవడంతో ఎవరికి ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. భక్తులందరికి అన్ని సౌకర్యాలు కల్పించామని, జనజాతరకు వచ్చే భక్తులంతా తల్లుల దర్శనం చేసుకొని ఆనందంగా వెనుతిరిగి వెళ్లోచ్చని అధికారులు ఇప్పటికే చెప్పారు.

బారులు తీరిన భక్తులు..

లక్షలాదిమంది భక్తులు గిరిజన గుడారం వైపు బారులు తీరారు. ఎడ్లబండ్లు, ప్రభుత్వ, ప్రయివేట్‌ వేలాది వాహనాలు బయలుదేరాయి. పోలీసులు ఎవ్వరికి ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా, ట్రాపిక్‌ అంతరాయం లేకుండా మొబైల్‌ బైక్‌లపై పర్యవేక్షిస్తున్నారు. ట్రాపిక్‌ కు చిన్న ఆటంకం కలిగిన ఎప్పటికప్పుడు క్లియర్‌ చేస్తూ పంపిస్తున్నారు. ఐనా ట్రాఫిక్‌ అంతరాయం కనబడుతూనే ఉంది. తెలంగాణలోని సుదూర గ్రామాల నుంచి వేలాది ఎడ్లబండ్లు దాదాపుగా అన్ని జాతరకు చేరుకున్నాయి. తెలంగాణ నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అడవి మార్గం ద్వారా మేడారం చేరుకునే ఆదివాసీల సంఖ్య పెరుగుతూనే ఉంది. మేడారంలో ఎటూ చూసినా, దారులన్నీ జనంతోనే నిండిపోయాయి.

అందుబాటలో వైద్య సేవలు..

వైద్యశాఖ ఈ సారి కొత్తగా మొబైల్‌ మోటర్‌ వైద్యసేవలు ప్రారంభించారు. మోటార్‌ వాహనాలపై జాతర మొత్తం తిరుగుతూ వైద్య సేవలందిస్తున్నారు. పరిసరాల ప్రాంతాలలో కలియతిరుగుతూ భక్తులకు మంచినీరు, ఆరోగ్యంపై అవగాహన కల్గిస్తున్నారు. ఆనారోగ్యం బారిన పడకుండా ఆపరిశుభ్రత పాటించాలని అధికారులు పదేపదే చెపుతున్నారు. భక్తులు ఉన్న ప్రతి ప్రాంతంలో వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు.

32 సెక్టార్లలో అధికారుల సేవలు..

మేడారం మహాజాతరకు జిల్లా యంత్రాంగం సిద్ధమయింది. బుధ, గురు, శుక్ర వారాలలో సుమారు కోటి 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినా ప్రభుత్వం ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ.75 కోట్లు కేటాయించగా 21 ప్రభుత్వ శాఖల తరుపున పనులు చేపట్టారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో సుమారు 8400 మరుగుదొడ్లు నిర్మించారు. గతంలో శాశ్వత ప్రతిపదికన నిర్మించిన 250 మరుగదొడ్లు అదనం. భక్తులకు శుద్ధమైన మంచి నీటిని అందించేందుకు మిషన్‌ భగీరథ తరుపున ఏర్పాటు చేశారు.

జాతరకు నాలుగువేల ఆర్టీసీ బస్సులు..

మేడారం జాతరకు నాలుగు వేల బస్సులు రాష్ట్ర నలుమూల నుంచి భక్తులను తరలించేందుకు ఆర్టీసీ బిజిబిజీగా మారిపోయింది. ఇప్పటికే పలు సర్వీసుల సేవలు కొనసాగుతున్నాయి. వరంగల్‌ మీదుగా వచ్చే ఆర్టీసీ బస్సులను తాడ్వాయి మీదుగా జాతరకు అనుమతిస్తున్నారు. ప్రైవేటు వాహనాలను పస్రా మీదుగా జాతరకు అనుమతిస్తారు. తిరుగు ప్రయాణంలో నార్లాపూర్‌, దూదేకులపల్లి, కమలాపూర్‌ క్రాస్‌, భూపాలపల్లి మీదుగా వన్‌వే ఉంటుంది. చింతల్‌ క్రాస్‌ వద్ద పార్కింగ్‌ ప్రాంతాలు, హోల్డింగ్‌ ప్రాంతాలలో విడిది తీసుకున్న భక్తులను ఆర్టీసీ మిని బస్సుల ద్వారా అమ్మవార్ల దర్శనానికి కొంగలమడుగు వరకు తరలిస్తారు.

జాతరలో పదివేల మంది పోలీసులతో బందోబస్తు

10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పోలీసు అధికారులను, సిబ్బందిని తరలించారు. వేల మంది పోలీసులు భద్రతా చర్యలకోసం విధులు నిర్వహిస్తున్నారు. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధి నుంచి మేడారం వరకు ప్రతి నాలుగు కిలో మీటర్లకు పోలీస్‌ అవుట్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. సుమారు 15వేల ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు. కమీషనరేట్‌ నుంచి ములుగు మండలం మహ్మద్‌ గౌస్‌పల్లి వరకు కమీషనర్‌ రవిందర్‌, ఏఎస్పీ సాయిచైతన్య ట్రాఫిక్‌ భాద్యతలు నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారి వెంబడి 200 కెమెరాలను ఏర్పాటు చేశారు. జాతరలో గల ప్రాగణంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారి గద్దెల ప్రవేశ మార్గం వద్ద రామగుండం సిపి సత్యనారాయణ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. తాడ్వాయి నుంచి వచ్చే విఐపిలకు శివరాసాగర్‌ వద్ద, వివిఐపీలకు సమ్మక్క ఆలయ సమీపంలో పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విఐపిలకు, వివిఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్యర్వంలో జంపన్నవాగు అమ్మవారి గద్దెలు, రెడ్డిగూడెం, ఊరట్టం ప్రాంతాలలో తప్పిపోయినవారి కోసం హెడెలు ఏర్పాటు చేశారు. మొత్తం 38 సెక్టారులో అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ఇన్‌చార్జీ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, నోడల్‌ అధికారి విపి గౌతమ్‌, ఎస్పీ సంగ్రాం సింగ్‌ పాటిల్‌ పర్యవేక్షిస్తున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close