ఐనా తీరు మారలేదు…

0

ఓటమి నుంచి గుణపాఠం నేర్వని టిఆర్‌ఎస్‌…

పార్టీని పటిష్టపరచడంలో విఫలమైన కాంగ్రెస్‌…

కాంగ్రెస్‌ విలీనమే టిఆర్‌ఎస్‌ పంతం…

ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి… ప్రజల ఆలోచన విధానాన్ని బట్టి పాలన ముందుకు సాగాలి.. కాని ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ మారడం లేదు.. ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ నాయకుల ఆలోచన మారడం లేదు.. ప్రజల కోసం నిజంగా పనిచేయాలనే ఆలోచన ఉన్నవారికి ఎక్కడున్నా పనిచేస్తూనే ఉంటారు. కాని ఇక్కడ ప్రజల అభివృద్ది కన్నా, వారి సమస్యలను పరిష్కరించడం కన్నా నాయకులు వారి స్వంత ఆలోచనకే, వారి అభివృద్దికే ప్రాధాన్యతమిస్తున్నారు.. రెండవ సారి అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనభై ఎనిమిది సీట్లు సాధించి అఖండ విజయాన్ని సాధించింది. ప్రజల తీర్పును శిరసావహిస్తూ పాలనపై తమ మార్కు చూపాల్సిన ప్రభుత్వం ఆ మాటే మరిచిపోయింది. ఉన్నవారు సరిపోరనుకుంటున్నారో ఏమో తెలియదు కాని ఆపరేషన్‌ వలసల పేరుతోనే ఇప్పటివరకు సమయాన్ని అంతా వృధా చేస్తూనే ఉంది.. కెసిఆర్‌ ఆలోచనలకు ఆకర్షితులైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యెలు కారు ఎ్కడానికి, గులాబీ కండువా కప్పుకోవడానికి అంతా అతృత చూపుతూ క్యూ కడుతూనే ఉన్నారు.. ఇప్పటికే ఒక ఇండిపెండెంట్‌తో సహా పదకొండు మందీ చేరిపోయారు. ఉన్నవాళ్లతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తూ రాష్ట్రాన్ని జనరంజకంగా మారుద్దామనే ఆలోచనను పక్కన పెట్టేసీ ఇతర పార్టీల విలీనంపై దృష్టి సారించారు. ఉన్నపార్టీలో ఉంటూ బలమైన ప్రతిపక్షంగా మారుతూ ప్రజల సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నేతలు అన్ని వదిలి వలసబాట పడుతున్నారు.. వద్దంటే వస్తున్న నాయకులను చూసి అధికారపక్షం విలీనానికి సిద్దమవుతోంది. ఉన్నవాళ్లనే కాపాడుకోలేని కాంగ్రస్‌ అందరూ వెళ్లాక ఆందోళనలు చేస్తే జరిగేది శూన్యమనే విషయాన్ని మరిచిపోతుందీ.. రెండు పార్టీల నడుమ రాష్ట్రంలో ఎక్కడిసమస్యలు అక్కడే పాతుకుపోయి సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నా పట్టించుకునే వారు మాత్రం కరువయ్యారు…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

ఉన్నవారు సరిపోరని, వచ్చేవారిని వద్దనేదీ లేదని అధికారపక్షం అనడం లేదు.. ఇక్కడ కంటే అక్కడ ఉంటేనే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చనీ ఎమ్మెల్యేలు పార్టీ వంకన చేరిపోతున్నారు.. ఎందుకొస్తారో రాజకీయాలకు తెలియదు కాని గెలవకముందు ఒకమాట గెలిచాక మరోమాట మాట్లాడుతూ ప్రజా సేవనే విస్మరిస్తూ స్వార్థాన్ని చూసుకునే నాయకులే ఎక్కువైపోతున్నారు.. నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలు ఆశలను, ఆడియాశలు చేస్తూ వారికి నచ్చినట్టు పార్టీలు మారడమే రాజకీయంగా ప్రవర్తిస్తున్న నేటి తరం నాయకులను చూసి సిగ్గుతో తలవంచుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలు ఏంటీ, చేస్తున్న పనులేంటీ ఇప్పుడు నడుస్తున్న రాజకీయమేంటనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ప్రజలకు మంచిచేయాలన్నా తమకు కావాల్సిన మెజారిటీ స్ధానాలు వస్తే చాలనుకుంటుంది. గెలిచాక కొత్తగా వచ్చేవారితో పెద్దగా తలనొప్పులు ఉంటాయనే విషయాన్ని గ్రహించిన వాటిని మాత్రం పట్టించుకోదనే ఆరోపణలున్నాయి. తీరా నెత్తిమీదికొచ్చేసరికి ఎంత ఆలోచించినా జరిగేదీ ఎలాగూ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడుత తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు కొన్ని ఓటములు ఇంకా గుణపాఠాలు నేర్పినట్టు లేదు..

ఓటమి వచ్చినా తీరుమారని టిఆర్‌ఎస్‌..

తెలంగాణలో ఎదురనేది లేదంటూ చెప్పినా కెసిఆర్‌కు రెండవ సారి అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఐదారు నెలలకే తెలంగాణ ప్రజలు తగినంత గుణపాఠం చెప్పారు. మేము ఓటు వేసిందీ రాష్ట్రాన్ని అభివృద్ది చేయమని, ప్రజల సమస్యలపై దృష్టి సారించి వారికి అందాల్సిన పథకాలలో జాప్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారం చేతుల్లో పెడితే ప్రజల విషయాన్ని మరిచిపోయి, ఇతర విషయాలపై దృష్టి పెడుతున్నారని ఉద్యోగులు మొదట ఎమ్మెల్సీ ఎన్నికలలో తిరస్కరించగా, ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఘోర పరాజయాన్ని బహుమానంగా ఇచ్చారు. ప్రజలే తీర్పే శిరోధార్యమని భావించని టిఆర్‌ఎస్‌ ఓటమి నుంచి మాత్రం పాఠాలు నేర్చుకోలేదనే తెలుస్తోంది. టిఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న మెజారిటీ స్థానాలు సరిపోవట్లేదని ప్రతిపక్షమనేదే లేకుండా చేస్తున్నందుకు ముఖ్యమంత్రి స్వంత కూతురుతో పాటు, కెసిఆర్‌కు కంచుకోటైనా కరీంనగర్‌లో కాషాయం జెండా పాతారు. ప్రజలు తిరస్కరణ ప్రారంభమైన దశలో వారిని ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోకుండా మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ విలీన బాట పట్టారు. ఉన్నవారందరిని చేర్చుకొని సాధించేదేమన్న ఉందా అంటే అదీ లేదు.. పదకొండు మంది ఎమ్మెల్యెలతో స్పీకర్‌కు వినతిపత్రం ఇప్పించి మరో ముందడుగు వేశారు. అన్ని విషయాలను ఓటేసిన ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మన పాలకులు విస్మరించడం వారి పతనానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు..

కాంగ్రెస్‌లో ఎందుకు మార్పు రావడం లేదో…

తెలంగాణ కాంగ్రెస్‌లో మారుతున్న పరిణామాలను బట్టి ఎందుకు మార్పు రావడం లేదనేదీ ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. ఒక్కసారి ఒక్క ఎమ్మెల్యె పార్టీ మారితే అందుకు సంబంధించి కారణాలు తెలుసుకొని వలసలను ఆపే ప్రయత్నం చేయాలి. కాని ఇప్పటివరకు పదకొండు మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యెలు పార్టీ మారినా కాంగ్రెస్‌ అధిష్టానంలో మాత్రం ఇసుమంత కూడా మార్పు రావడం లేదని తెలుస్తోంది.. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత మరోసారి ఆపరేషన్‌ ఆకర్ష్‌ టిఆర్‌ఎస్‌ కొనసాగిస్తూనే ఉంది.. ఇప్పటికే 11 మంది కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కారెక్కేందుకు సిద్ధమయ్యారు. తాజాగా గురువారం మరో ఇద్దరు కూడా అదే బాటలో ప్రయాణం చేస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్నారు. ఇదివరకే టీఆర్‌ఎస్‌ నేతలతో చర్చలు జరిపిన రోహిత్‌రెడ్డి గురువారం ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైంది. ఏడాది క్రితం గులాబీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన అనంతరం కాంగ్రెస్‌లో చేరి తాండూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అందులో ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ చేరారు. తాజాగా రోహిత్‌రెడ్డి చేరికతో ఆ సంఖ్య 12కు పెరిగింది. నల్లగొండ ఎంపీగా గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంఖ్య 6కు చేరనుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన భద్రాచలం ఎమ్మెల్యే కూడా తెరాసలో చేరనున్నట్లు ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మహేశ్వరం నుంచి సబితాఇంద్రారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి జాజుల సురేందర్‌, పినపాక నుంచి రేగ కాంతారావు, పాలేరు నుంచి కందాల ఉపేందర్‌ రెడ్డి, ఇల్లందు నుంచి హరిప్రియ, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వర రావు, నకిరేకల్‌ నుంచి చిరుమర్తి లింగయ్య, ఎల్బీనగర్‌ నుంచి దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి, ఆసిఫాబాద్‌ నుంచి ఆత్రం సక్కు, కొల్లాపూర్‌ నుంచి బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి చేరిపోగా.. ఇప్పుడు తాండూరు నుంచి రోహిత్‌ రెడ్డి, భద్రాచలం నుంచి వీరయ్య చేరికతో ఆ సంఖ్య 13కు చేరుతుంది. అయితే కాంగ్రెస్‌ బలంలో మూడింట రెండొంతులవుతుంది. ఇక కాంగ్రెస్‌ పార్టీలో మిగిలేది సీఎల్పీ నేత మల్లు భట్టి విక్కమార్క, శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క మాత్రమే మిగులుతారా అనే చర్చ సాగుతోంది. వీరిలో కూడా ఇక టీఆర్‌ఎస్‌తో ఎవరైనా టచ్‌లో ఉన్నారా? అనే అనుమానాలు లేకపోలేదు.

విలీనం దిశగానే అడుగులు..

తెరాసలో సీఎల్పీ విలీనం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 11మంది కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు తెరాసలో చేరగా.. తాజాగా తాండూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. దీంతో రోహిత్‌రెడ్డి తెరాసలో చేరడం ఖాయమైంది. ఇదిలా ఉంటే రోహిత్‌శెట్టితో తెరాసలోకి వచ్చిన మిగిలిన 11మంది ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీలో మొత్తం 12మంది కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గన్నారు. 12మంది ఎమ్మెల్యేలు కేటీఆర్‌ సమక్షంలోనే సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు సంతకాలు చేశారు. సంతకాలతో కూడిన తీర్మాన కాపీని నేరుగా మినిస్టర్‌ క్వార్టర్స్‌కు వెళ్లి స్పీకర్‌ శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా తామంతా కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెరాసలోకి వచ్చామని, మెజార్టీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలం తెరాసలోకి రావడం వల్ల సీఎల్పీని రద్దుచేసి తెరాసలో విలీనం చేయాలని ఆలేఖలో కోరారు. ఇదిలా ఉంటే విలీనానికి అవసరమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖ ఇవ్వటంతో ఏ క్షణంలోనైనా విలీన ప్రక్రియపై స్పీకర్‌ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here