Featuredస్టేట్ న్యూస్

ఐనా బుద్ధి మారట్లేదు…

పెరుగుతూనే ఉన్న అవినీతి అధికారులు…

పట్టుబడుతున్నా భయమే లేదు…

దోచుకోవడమే అనవాయితీ…

ప్రక్షాళన దిశగా ఆలోచించని ప్రభుత్వం…

లంచాల వేధింపులకు సామాన్యులు బలి

బంగారు తెలంగాణ కాదు… దోచుకునే తెలంగాణగా మారిపోయింది… ప్రజలకు సేవచేయాల్సిన అధికారులు ప్రతి పనికి లంచాల కోసం జలగల్లా పీక్కుతింటున్నారు.. ఒక వైపు అధికారులు పట్టుబడుతూనే ఉన్నా, మరొక వైపు లంచాల కోసం వేధించడం మాత్రం మానుకోవడమే లేదు.. పైపైకి నీతివాక్యాలు వల్లబోస్తూనే బల్లకింద చేయి తడపాల్సిందేన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.. పైసలిస్తేనే పైల్‌ ముందుకు కదులుతోంది.. లేదంటే లేదని ఖరాఖండిగా చెప్పే అధికారులకు మన రాష్ట్రంలో కొదువేలేదు.. వందలు, వేలు, లక్షలు, కోట్లు సంపాదిస్తూ, ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న అవినీతి అధికారులపై ఇప్పటికి ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుందామనే ఆలోచనే చేయడం లేదు.. ఒక విఆర్‌ఏ దగ్గర లక్షల రూపాయలు.. ఒక తహశీల్దార్‌ దగ్గర కోట్ల రూపాయల నగదు.. ఒక అటెండర్‌ దగ్గర ఊహించని సొమ్ము, ఒక మండల పోలీస్‌ అధికారి దగ్గర పెద్ద ఎత్తున పట్టుబడుతున్న లంచాల డబ్బు.. ఇంతగా నిత్యం ప్రజలను, ప్రతిక్షణం పీడించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది.. రాష్ట్రంలోని లక్షలాది మందికి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ప్రభుత్వ కార్యాలయాలలోని ప్రభుత్వ అధికారులతో పనిబడుతూనే ఉంటుంది.. నూటికి తొంభై శాతం మంది ఏదో ఒక రూపకంగా లంచాల బారిన పడుతున్నవారే.. వేలు, వందల మందిలో ఎవరో ఒకరు ధైర్యం చేసి ముందడుగు వేస్తూ అవినీతి నిర్మూలన శాఖను సంప్రదిస్తున్నారు.. రోజురోజుకు అవినీతి అధికారులు ఎసిబికి చిక్కుతున్నా ఒక్కరంటే ఒక్కరిలో కూడా కనీస మార్పు రావడం లేదు.. అవినీతిని నిర్మూలిస్తూ ప్రజలను చైతన్యం చేయాల్సిన అవినీతి నిర్మూలన శాఖ అసలెక్కడుందో దాని విధులు, బాధ్యతలెంటో మాత్రం ఇప్పటికి చాలా మందికి తెలియనే తెలియదు.. క్షేత్రస్థాయిలో వెళ్లి అవినీతి నిర్మూలనపై ప్రజలకు, యువతకు అవగాహన కల్పించాల్సిన అనిశా అధికారులు తమకేమి పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. బాధితులు ఎవరన్నా వచ్చి ఫిర్యాదు చేస్తేనే దానిపై స్పందిస్తారు కాని లేకుంటే ఆ శాఖ స్వతహాగా చేసిన కేసులు చెప్పుకొదగ్గ స్థాయిలో ఉండనే ఉండవు.. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవచేయాల్సిన అధికారులు నిత్యం ఏదో ఒక రూపంలో పీక్కుతింటున్నా ప్రభుత్వంలో మాత్రం కనీస స్పందన లేదు.. అవినీతి ప్రక్షాళనకు నడుం బిగిస్తామని మాటలు చెప్పి మరిచిపోవడం మన పాలకులకు వెన్నతో పెట్టిన విద్యననే విషయం అందరికి తెలిసిందే.. అందుకే ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత మన యంత్రాంగానికి అతికినట్టు సరిపోతుంది..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

తెలంగాణలో మామూళ్లు మామూలై పోయిన రాష్ట్రంగా గొప్పగా చెప్పుకోవచ్చు.. ఎందుకంటే కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి పనికి అక్కడ ఒక రేటు నిర్ణయిస్తారు.. వేలకు వేల జీతాలు, ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తున్నా కూడా ప్రజలకోసం నిజాయితీగా పనిచేయాలనే ఆలోచన ఏ కొంతమందికి తప్పించి మిగతా వారంతా అవినీతి నావలో ప్రయాణం చేసేవారని తెలిసిన విషయమే.. నిజంగా నిజాయితీగా పనిచేసేవారికి ప్రజల కోసం పరితపించే అధికారులను పనికిమాలిన శాఖలకు కేటాయించడం మన ప్రభుత్వం చేస్తున్న అతిగొప్ప విషయం.. ప్రజలకోసం పనిచేసే పోస్టింగ్‌ కావాలంటే ఎంతోకొంత ముట్టజెప్పాల్సిందే, లేదంటే అంతా పనిలేని ఉద్యోగాలు చేయాల్సిందే.. నాలుగు పైసలు పెట్టుకొని మంచి ఆదాయం ఉన్న పోస్టింగ్‌ తెచ్చుకో, ఆ తర్వాత నీకు నచ్చినంత పీడించుకో అన్నచందంగా మారిపోయింది మన యంత్రాంగం.. అందుకే ప్రతి పనికి, ఇంచుమించుగా ప్రతి కార్యాలయంలో చేయి తడపందే ఫైల్‌ కదలడం లేదు.. బల్ల కింద బరువు పెడితే తప్ప పని కావడం లేదు.. ఇక్కడ ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా దళారులను ప్రసన్నం చేసుకోవలసిందే. మనకు కావాలిసిన న్యాయమైన పనికి కూడా జేబులు తడపాల్సిందే.. లేదంటే వారానికి కావాల్సిన పనిని సంవత్సరాల వెంట తిప్పుతూనే ఉంటారు.. పదో, పరకో తీసుకునే కాలం ఎప్పుడో పోయింది.. వేల నుంచి లంచం ఇప్పుడు లక్షల్లోకి మారిపోయింది.. తగినంత ముట్టజెప్పుతేనే పని జరుగుతోంది.. క్షణాల్లో ఫైలు కదులుతోంది.. లేదంటే నెలలు, సంవత్సరాల తరబడి మన పైళ్లు చెదలు బట్టి పోవాల్సిందే.. ప్రజలకు మరింత పారదర్శకమైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ధరణి రిజిస్ట్రేషన్‌ సేవలతో పాటు రెవెన్యూ శాఖలో మాత్రం ఇసుమంత కూడా మార్పు రావడం లేదంటే అందులో అధికారులు ఎంతగా మామూళ్లకు అలవాటు పడ్డారో తెలియడమే లేదు.. లంచాల సొమ్ము చేతుల పడుతేనే అధికారుల మనసు ఆనందంగా ఉంటుందని పైసా అవినీతి సొమ్ము లేకుండా ఒక్కరోజు కూడా ఇంటికి పోలేరని వాదనలు తెలంగాణ రాష్ట్రంలో వినపడుతున్నాయి.. నిబంధనల ప్రకారం చేయాల్సిన ప్రతి పనిని ఏదో ఒక రూపంగా వాయిదాలు వేస్తూ చివరకు విసిగి చెందుతున్న ప్రజలు ఏదో ఒక రూపంగా ఏంతో కొంత ముట్టజెప్పి పనులు చేసుకుంటున్నవారు కొంతమందైతే, డబ్బులు లేక పనిని అలాగే, అక్కడే వదిలేసిన వారు లక్షల్లో ఉన్నారు. అవినీతి ఇప్పుడు తెలంగాణలో ప్రతి శాఖలో పాతుకుపోయింది.. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వంలో మాత్రం కఠిన నియమావళిని సిద్దం చేద్దామని ఆలోచనే రావడం లేదు..

అవినీతి అనకొండలు పెరుగుతూనే ఉన్నాయి..

తెలంగాణలో అవినీతి అనకొండలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.. ఒక మండల రెవెన్యూ మహిళా అధికారి ప్రతి పనికి రైతులను వేధిస్తూ లంచాలే పరమాన్నంగా బోంచేస్తూ కోట్లాది రూపాయలతో దోచుకుంటున్న వైనం తెలంగాణ రాష్ట్రాన్ని నివ్వెరపరిచింది. ఆ అధికారి ఇంట్లో నగదు రూపాయలే తొంభై లక్షలకు పైగా ఉన్నాయంటే బినామీల పేరుతో ఇంకెంత సంపాదించిందో తలుచుకుంటేనే భయం పుడుతుంది. బయటపడ్డ ఒక్క అధికారి దగ్గర అంత సొమ్ము ఉంటే అలాంటి అధికారులు వేలాది మంది ఉన్నారు తెలంగాణలో ఇంకొంత మంది దగ్గర ఎన్నివేల కోట్లు ఉన్నాయో తెలియని సమాచారం. గ్రామాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పాస్‌బుక్‌ల పథకమే ఇంతలా అవినీతి పెరగడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం ఉచితం అని చెప్పింది కాని అధికారులు మాత్రం ఉచితానికి వేలల్లో వెలకట్టి వసూలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల అవినీతి మాత్రం వర్ణించడానికి వీలు లేనిదిగానే ఉంది. రెవెన్యూ శాఖ మొత్తం అవినీతిమయంగా మారిపోయిందంటే పోలీసుశాఖలో కూడా అందినంత దండుకునే పనిలో పలువురు అధికారులు ఉన్నారు. సామాన్యులకు రక్షణగా ఉండాల్సిన వారే భక్షులవుతున్నారు. లంచాలకు మరిగి న్యాయాన్ని అన్యాయంగా మార్చుతున్నారు.. సిద్దిపేట జిల్లాలో ఓ ఎస్సై అవినీతి వ్యవహారం వెలుగు చూసింది.. భారీగా లంచం డిమాండ్‌ చేసిన బెజ్జంకి ఎస్సై.. లంచం తీసుకుని అడ్డంగా బుక్కయ్యాడు.. ఎస్సై అవినీతి, అరాచకాలపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. బాధితుడి దగ్గర్నుంచి ఎస్సై లంచం డిమాండ్‌ చేసిన దానికి సంబంధించిన ఫోన్‌ సంభాషణలు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన బోయిని కృష్ణారావు రాజీవ్‌ రహదారి పక్కనే బ్రిక్స్‌ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు.. గత నెల 3న సిమెంటు బస్తాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో కృష్ణారావును ఎస్సై అభిలాష్‌, కానిస్టేబుల్‌ నాగరాజు పీఎస్‌కు తీసుకెళ్లారు.. దొంగతనం చేసిన సిమెంట్‌ను కొన్నావంటూ కృష్ణారావుపై బెదిరింపులకు దిగారు. కేసు పెట్టకుండా ఉండాలంటే మొత్తాన్ని చెల్లించాలని సూచించారు.. ఎస్సై సూచించినట్లుగానే 3.43 లక్షల రూపాయలు కానిస్టేబుల్‌ నాగరాజుకు చెల్లించాడు కృష్ణారావు.. ఆ తర్వాత కేసు సెటిల్‌ చేసినందుకు మరో లక్ష రూపాయలు ఇవ్వాలని ఎస్సై అభిలాష్‌ డిమాండ్‌ చేయగా.. ఆ మొత్తాన్ని కానిస్టేబుల్‌కు చెల్లించినట్లు కృష్ణారావుచెబుతున్నాడు.. ఈ వ్యవహారం జరిగిన తర్వాత కూడా కృష్ణారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వంద సిమెంటు బస్తాలు రికవరీ చేసినట్లుగా చూపించారు. అడిగినంత ఇచ్చిన తర్వాత కూడా కేసు పెట్టడంతో కృష్ణారావు సిద్దిపేట సీపీని ఆశ్రయించాడు.. ఎస్సై లంచం డిమాండ్‌ చేసిన ఆడియో క్లిప్‌పులను కూడా ఉన్నతాధికారులకు అందజేశాడు.ఘటనపై విచారణ చేపట్టిన సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌.. ఇద్దరిపైనా బదిలీ వేటు వేశారు.. విచారణ జరిపి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలా ప్రతిశాఖలో అవినీతి విలయతాండవం చేస్తూ సామాన్యులను పీల్చుకుతింటోంది.. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు తిండిలేని కూలీల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటే మన తెలంగాణ సమాజం ఎటు పయనిస్తుందో అర్థమే కావడం లేదు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close