దూకుడు పెంచిన తెరాస

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో తెరాస దూకుడు పెంచింది. తెలంగాణలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో 16 స్థానాల్లో పాగావేసేలా తెరాస దృష్టిసారించింది.. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించారు. ఇప్పటికే ఆయా పార్లమెంట్‌ స్థానాల వారిగా సవిూక్షలు నిర్వహించిన కేసీఆర్‌ అబ్యర్థులపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండుమూడు రోజుల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.. కాగా ఇప్పటికే తెరాస ఎన్నికల ప్రచారాన్నిసైతం ప్రారంభించింది. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. మరోవైపు ఖచ్చితంగా తెరాస అభ్యర్థులను గెలిపించేలా ప్రతీ కార్యకర్త కృషిచేయాలని, 16 స్థానాల్లో గెలిస్తే ఢిల్లీలో మనం నిర్ణయించిన ప్రభుత్వమే వస్తుందని పేర్కొంటూ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. తాజాగా పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం విడుదల చేసింది. ఏప్రిల్‌ 11న తెలంగాణలోని 17పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 17న కరీంనగర్‌, 19వ తేదీన నిజామాబాద్‌లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ పోటీ చేసే 16 లోక్‌సభ స్థానాలు.. ఎంఐఎం పోటీ చేసే హైదరాబాద్‌లో కూడా కేసీఆర్‌ ప్రచార సభలు నిర్వహించనున్నారు. బుధవారం టీఆర్‌ఎస్‌ 16 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను సీఎం ప్రకటించనున్నారు. సిట్టింగ్‌ల్లో ఒకటి లేదా రెండు సీట్లలో అభ్యర్థుల మార్పు ఉంటుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here