మళ్లీ ఓట్ల పండుగ

0
  • ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌
  • మే 14వరకు నామినేషన్‌ల స్వీకరణ
  • మే31న ఎన్నికలు, జూన్‌3న ఫలితాలు
  • పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఓటింగ్‌

తెలంగాణ శాసన మండలిలో వివిధ కారణాలతో స్థానిక సంస్థల కోటాలో 3 ఖాళీలు ఏర్పడ్డాయి. నల్లొండ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక రంగారెడ్డి నుంచి గెలుపొందిన టీఆర్‌ఎస్‌ నేత పట్నం నరేందర్‌ రెడ్డి కూడా శాసన సభ్యుడయ్యారు. ఇక వరంగల్‌ నుంచి విజయం సాధించిన కొండా మురళి టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరుతూ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ మూడు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి.

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రజత్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల అయినట్లు తెలిపారు. రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 31న పోలింగ్‌ జరుగుతుందని, మే 14 లోపు నామినేషన్లు దాఖలు చేయాలని, జూన్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. కాగా, రంగారెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్‌ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్సీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచినందున తమ పదవులకు రాజీనామా చేశారు. వరంగల్‌ ఎమ్మెల్సీగా ఉన్న కొండా మురళీధర్‌ రావు గతంలోనే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఓటింగ్‌ జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న సభ్యుల పదవీకాలం జులై 5తో ముగుస్తుందన్నారు. ఎలాంటి కోర్టు కేసులు లేని స్థానాలకు నోటిఫికేషన్‌ ఇచ్చామని చెప్పారు. త్వరలో మిగతా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడనుందన్నారు. సభ్యులపై కోర్టు కేసులు ఉన్నా ఓటింగ్‌కు అర్హులేనని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు.

అయితే ఈ ఎన్నికలు కొంత వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. మే 6న మొదటి విడత ఎన్నికలు జరిగాయి. మే 10న రెండో విడత, మే 14న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎన్నుకుంటారు. ప్రస్తుతమున్న 2 వేల 500 మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. వీరి పదవీకాలం జూన్‌ 5 తో ముగియనుంది. పదవీకాలం ముగిసే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు మాత్రమే ఎన్నికల్లో పాల్గొంటున్నారు. జూన్‌ 5 తర్వాత కొత్తగా బాధ్యతలు స్వీకరించే ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు. ప్రస్తుతమున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఓటు హక్కు ఉండటం, కొత్తగా ఎన్నికయ్యే వారికి లేకపోవడంపై కాంగ్రెస్‌, టీడీపీ, ప్రజాకూటమిలోని జన సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పదవీకాలం ముగిసే వారు లోకల్‌ బాడీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎన్నుకోవడమేంటీ? కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించేవారు మాత్రమే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని వివిధ పార్టీలు ఈసీని కలిసి వినతి పత్రం సమర్పించాయి. కొత్తగా ఎన్నికయ్యే ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఓటు హక్కు కల్పించాలని విపక్షాలు కోరుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here