ఒడిషాలో ఏరియల్‌ సర్వే

0

  • అన్ని విధాలా ఆదుకుంటాం
  • పునరావాసాలకు గాను మరో వేయికోట్లు
  • సహాయ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం మద్దతు
  • నష్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోడీ

భువనేశ్వర్‌ : ఫొని తుఫాను సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన ఒడిశాను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ హావిూ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.381 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించామని, సహాయ పునరావాస కార్యక్రమాల నిమిత్తం మరో రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హావిూ ఇచ్చారు. పెను విపత్తు సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలకు ఒడిశా ప్రజలు స్పందించిన తీరును ఆయన అభినందించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పనిచేశాయన్నారు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పర్యటించారు. ఈ మేరకు ఉదయం భువనేశ్వర్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ఆయనకు ఒడిశా గవర్నర్‌ గణెశీ లాల్‌, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్వాగతం పలికారు. అనంతరం ఆయన గవర్నర్‌, సీఎం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో కలిసి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. వరద నష్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే గాయపడ్డ వారికి రూ.50వేలు అందజేస్తామన్నారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం నవీన్‌ పట్నాయక్‌ చేపట్టిన కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. సహాయ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని హావిూ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటామని తెలిపారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ తరఫున నిపుణుల బృందం రాష్ట్రంలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సమగ్ర కార్యాచరణను రూపొందిస్తామన్నారు. మరోవైపు ఈ తుపాను ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 34కి చేరింది. ఫొని తుపాను ధాటికి ఒడిశాలోని పూరీ, ఖుర్దా, నయాగఢ్‌, కేంద్రపడ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. కటక్‌, గంజాం, జగత్సింగ్‌పూర్‌, బాలేశ్వర్‌, భద్రక్‌ జిల్లాల్లో పాక్షిక ప్రభావం కనిపించింది. ఈ తుపాను ధాటికి పూరీ జిల్లాలో విద్యుత్తు, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించించిపోయాయి. అలాగే తీర ప్రాంత జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. ఒడిశాలోని పలు జిల్లాల్లో ఆరు లక్షల హెక్టార్లల్లో వరి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. భారీగా ఆస్తినష్టం.. పలు ప్రాంతాల్లో ప్రాణనష్టం కూడా వాటిల్లింది. అయితే ఆస్తి నష్టం వాటిల్లిందనేది ఇంత వరకూ అధికారులు అంచనా వేయలేక పోతున్నారు. 5 వేల గ్రామాలు, 50 పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని జాతీయ విూడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ తుపాను థాటికి కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలకు తోడు… గంటకు 200 కిలోవిూటర్ల వేగంతో వీచిన పెనుగాలులతో వేల చెట్లు, కరెంటు స్తంభాలూ, సెల్‌ఫోన్‌ టవర్లు కుప్పకూలాయి. దీంతో ఒడిషా నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రధానికి అధికారులు తుపాను నష్టం గురించి నిశితంగా వివరించారు. ఏరియల్‌ సర్వే అనంతరం విూడియాతో మాట్లాడిన మోదీ.. ఒడిషాను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఒడిషాకు ఇప్పటికే రూ. 381 కోట్లు సాయం అందిస్తున్నట్లు ప్రకటించామని.. తక్షణసాయంగా మరో వెయ్యి కోట్లిస్తామని మోదీ తెలిపారు. ‘ఫణి’ తుపాన్‌ను ఒడిషా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. తుపాను బాధితులకు గాను ఏపీ ప్రభుత్వం రూ. 15కోట్లు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. విపత్తుల వల్ల కలిగే నష్ట తీవ్రత అపారమని బాధితులను ఆదుకోవడం మానవతా ధర్మంగా ఒడిషా ప్రభుత్వానికి అన్నివిధాలా సాయం అందిస్తామని చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here