తమాషా చేసే నేతలకు బడుగుల దామాషా కనబడుతుందా..?

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దేశంలో సంపదను సృష్టించే బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ కులాలకు తాయిలాలు వేస్తూ, తాము విందు భోజనాలారగిస్తూ అగ్రవర్ణ ఆధిపత్య కులాలు అధికారాన్ని అనుభవిస్తూ స్వాతంత్య్రానంతరం నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పబ్బం గడుపుకుంటున్నాయని ప్రజా స్వరాజ్‌ పార్టీ అంబర్‌పేట నియోజకవర్గ అభ్యర్థి కట్టెల సుభాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అంబర్‌పేటలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సంద ర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగ స్పూర్తిని బ్రష్టుపట్టించి అట్టడుగు కులాలను అధికారంలోకి రాకుండా నెట్టివేస్తూ ఇప్పటికే తీరని అన్యాయం చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. గత 72 ఏళ్ల స్వాతంత్య్రానుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక ఈఆదిపత్య వర్గాలు రాజ్యాధికారంలో జనాభా దామాషా పద్దతిన అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తారనేది భ్రమ అని తేలిపోయిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీ ఉభయ కమ్యూనిస్టుల రూపంలో వేరుగా కనిపించిన సారాంశంలో ఒక్కటేననీ, ఈపార్టీలన్నీ బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు అరకొరగా వరాలిస్తూ మోసం చేస్తున్నాయని,దీనిని గుర్తించి మన కోసం మనమే పోరాడాల్సివుందని సుభాష్‌ పిలుపునిచ్చారు. నిజానికి మనం సంపద సృష్టికర్తలం. అనుభవిస్తున్నది పెత్తందారీ పోకడలు గల ఆధిపత్యకులాలు. 93 శాతం జనాభాగల మనం 7శాతం గల ఉన్నత వర్గాలకు తలవంచడం మన చేతగాని తనం. దీని ప్రతిఘటించాలి. వివక్షలో ఉందనే దానికి ఆయా పార్టీ టికెట్లు ఎవరెవరికి ఇచ్చారన్నది చూస్తే స్పష్టమవుతుంది. అంటూ తేటతెల్లం చేశారు. ప్రజా సంక్షేమం మరిచి పదవీలాలసతో కాలక్షేపం చేసే ఈపార్టీల నిజస్వరూపం గ్రహించి ఈపరిస్థితిని నిలువరించాలనే ఉద్దేశంతో ప్రజా స్వరాజ్‌పార్టీ రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. ఒక ప్రభుత్వ అధికారిగా 39 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి టీఎన్‌జీవో టీజిఓ యూనియన్‌లకు నాయకత్వం వహించి పలు సమస్యలపై పోరాటం చేసి అనేక విజయాలు సాధించిన న్యూనల్లకుంటలో పుట్టిపెరిగిన వ్యక్తిగా, ప్రజలు తమ కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తారని అంబర్‌పేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నానని కట్టెల సుభాష్‌ పేర్కొన్నారు. అంబర్‌పేట ప్రజా స్వరాజ్‌పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర జాతీయ పార్టీ అద్యక్షుడు కస్తూరి గోపాలక్రిష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యులు విజయ్‌కుమార్‌, చక్రి, శ్రీనివాస్‌, పశుపతినాథ్‌, మోహన్‌రావు, శ్రీరాములు, బాబు, లక్ష్మణ్‌, సురేష్‌, గోపాల్‌, నరేందర్‌, ఈశ్వర్‌, తిరుమలేష్‌, మోహిద్‌తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here