Featuredస్టేట్ న్యూస్

శత్రుత్వమంతా పైపైననే

ఎప్పటికైనా అంతా ఒక్కటే

కోపతాపాలన్నీ ఆశాశ్వతమే

అవసరాన్ని మారనున్న రాజకీయం

రాజకీయాల్లో నామమాత్రపు శత్రువులే

రాజకీయం అంటేనే అవసరాలకు తగ్గట్టుగా మారే ఒక నాటకం. ప్రజల ముందు ఒకలా ఉంటారు. ప్రజలు వెళ్లాక మరోలా ఉంటారు. ఎన్నికలలో మాటల తూటాలతో బద్ద శత్రువుల్లా పోట్లాడుకొవడం, ఎవరో ఒకరు అధికారంలోకి రాగానే తెరవెనుకాల ఎవరి పనులు వారు చేయించుకోవడం మామూలే అన్న సంగతి చాలామందికి తెలిసిందే. కాని శత్రుత్వాన్ని నాయకుల అవకాశం కోసం మిత్రుత్వంగా మార్చుకుంటారు. గత అసెంబ్లీ నుంచి తెలంగాణలో టిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీలు ఒకరిపై మరొకరు అంచనాలకు మించి మాటల తూటాలతో విరుచుకుపడేవారు. దాదాపుగా గత సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి మాటలే కరువయ్యాయి. తొమ్మిది, పది నెలల నుంచి ఇరు పార్టీలు ఎడమోహం, పెడమోహంగా ఉంటూ వచ్చాయి. ఒకరినొకరు కలుసుకోవడం, కేంద్రంలో జరిగే రాష్ట్రాల సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్లకపోవడం ఢిల్లీ నుంచి బిజెపి అగ్రనాయకత్వం తెలంగాణకు వస్తే ఆరోపణలతో విరుచుకుపడటం జరిగేది. ఇరు పార్టీల అధినేతల మధ్య ఏమైందో తెలియదు కాని ఇన్నాళ్లకు బద్ద శత్రువులుగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌, భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారిపోయింది. స్నేహపూర్వకమైనా భేటీనో, మరేదో తెలియదు కాని ఇరువురీ భేటీ తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకొంది.

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌:

తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యామ్నాయం లేదని అనుకుంటున్న తరుణంలో బిజెపి అసెంబ్లీలో ఘోరంగా బోల్తాకొట్టిన పార్లమెంట్‌ లో ఏకంగా నాలుగు పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకొంది. అనుకోకుండా, హఠాత్తుగా నాలుగు సీట్లు రావడంతో గులాబీ పార్టీ అగ్రనాయకత్వానికి దిమ్మతిరిగిపోయింది. తెలంగాణలో ఏ పార్టీకి ఉనికే లేదు ఇంకా పది సంవత్సరాలు గులాబీ పార్టీదే అధికారం అనుకుంటున్న తరుణంలో బిజెపి పార్టీకి అనుకోకుండా నాలుగు సీట్లు ఏలా వచ్చాయనేది ఎవ్వరికి అర్థం కాకుండా పోయింది. తెలంగాణలో బిజెపికి ఆశలున్నాయని అగ్రనాయకులకు అర్థమై పావులు కదపడం మొదలెట్టారు. బిజెపి ఆరంగేట్రాన్ని కెసిఆర్‌ తట్టుకోలేకపోయాడు. అందుకే ఇరువురు ఒకరిపై ఒకరు మాటల తూటాలతో బద్ద శత్రువులుగా మారిపోయారు. ప్రధాని అపాయిట్‌ మెంట్‌ కెసిఆర్‌ కు దొరకడమే కష్టమైపోయింది. దేశంలోనే గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవానికి సైతం ప్రధాని మోడీ హజరు కాలేదు. తెలంగాణ బిజెపి నేత కేంద్ర ¬ంశాఖ సహయమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణకు వచ్చినా అతనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస సాదర స్వాగతం లభించలేదు. ఇరు పార్టీలు పూర్తిగా బద్ద శత్రువులుగా పూర్తి బద్ద శత్రువులుగా మారిపోయాయి.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు.

టిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీ నేతలు తొమ్మిది నెలల నుంచి మాట్లాడుకోకుండా ఎడమొహం.. పెడమొహంగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ – సీఎం కేసీఆర్‌ లు ఎట్టకేలకు భేటి కాబోతున్నారు. ఎజెండా గోదావరి-కృష్ణ అనుసంధానం అయినా అంతకుమించిన వేరే ఆలోచనలు ఉన్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. రాజకీయ ప్రత్యర్థులను ఓడించడం, వారిని జైలుకు పంపడం చేసే మోడీ, షాలు మన ఏపీ సీఎం చంద్రబాబును మాత్రం వదిలేశారని రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మోడీని గద్దెనెక్కకుండా చంద్రబాబు, కాంగ్రెస్‌, మమతా బెనర్జీ, జేడీఎస్‌ తో కలిసి ఎన్నికల ముందర చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మోడీ గెలిస్తే చంద్రబాబు జైలుకే అన్నంత ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబును మోడీ, షాలు ఇద్దరూ వదిలేశారని తెలుస్తోంది. ఇప్పుడు కేసీఆర్‌ తో ఇక మాటల్లేవ్‌ అనుకుంటున్న తరుణంలో సడన్‌ గా మోడీ నుంచి పిలుపురావడం, రేపు భేటి కావడం, బీజేపీ భవిష్యత్‌ రాజకీయ వ్యూహాల్లో భాగంగానే తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో చెలిమికి అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 1999లో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వంలో చంద్రబాబు ప్రధానపాత్ర పోషించిన విషయం తెలిసిందే. నాటి కృతజ్ఞతతో పాటు బీజేపీ నేతలతో సంబంధాల నేపథ్యంలోనే చంద్రబాబు తనపై మోడీ, షాల ఫోకస్‌ లేకుండా జాగ్రత్త పడ్డారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్‌ ను కూడా బీజేపీ చేరదీయడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి.

రాజ్యసభలో బిల్లుకు టిఆర్‌ఎస్‌ మద్దతు

కశ్మీర్‌ విభజన బిల్లు విషయంలో అమిత్‌ షా కెసిఆర్‌ కు ఫోన్‌ చేయడం, కేసీఆర్‌ ను మద్దతు కోరడం, ఆయన వెంటనే హైదరాబాద్‌ లో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎంపీలను ప్రత్యేక విమానాల్లో వెళ్లి రాజ్యసభలో ఓటింగ్‌ లో పాల్గొన్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌ వంటి మిత్రుల విషయంలో దూరం మంచిది కాదని భావించే మళ్లీ చెలిమి దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. మరీ తెలంగాణలో టిఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయం మేమే అంటున్న బిజెపి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తుందా, లేకుంటే టిఆర్‌ఎస్‌ తో స్నేహపూర్వకంగా కలిసి పోటీచేస్తుందా అనేదీ ముందు ముందు ఎన్నికలను బట్టి రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close