Featuredజాతీయ వార్తలురాజకీయ వార్తలు

ముదిరిన రాజకీయ సంక్షోభం

  • రెబల్స్‌ రాజీనామాతో మరింత తీవ్రం
  • గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే నగేశ్‌
  • అసమ్మతిని చల్చార్చడానికి రంగంలోకి దిగిన నేతలు
  • కర్ణాటక కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య

బెంగళూరు : కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాతో కర్ణాటక ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర మంత్రి, ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే నగేశ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నానని, ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానిస్తే ఆ పార్టీకి మద్దతిస్తానని గవర్నర్‌కు రాసిన లేఖలో నగేశ్‌ పేర్కొన్నారు. రాజీనామా చేసిన ఆయన ఇప్పటికే ముంబయి చేరుకుని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిశారు. అలాగే మరో మంత్రి, బీదర్‌ నార్త్‌ ఎమ్మెల్యే రహీమ్‌ ఖాన్‌ కూడా రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే అధిష్ఠానానికి సమాచారమిచ్చానని ఆయన తెలిపారు. కాగా, అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అసంతృప్తులను మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. రెబల్‌ ఎమ్మెల్యేల కోసం తమ పార్టీ మంత్రులు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేశ్‌వెల్లడించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక బీజేపీ జాతీయ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. రాష్టాల్ల్రో ఎక్కడైనా బీజేపీ కాకుండా వేరే పార్టీ అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తుంటారని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని సురేశ్‌ దుయ్యబట్టారు. మరోవైపు కర్ణాటకలో క్షణంక్షణం రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటక సీఎం కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వరతో భేటీ అయ్యారు. ఇద్దరూ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.

21మంది మంత్రులు రాజీనామా చేశారు – కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య

అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు 21మంది కాంగ్రెస్‌ మంత్రులు రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నేత సిద్ధరామయ్య తెలిపారు. బుజ్జగింపు ప్రయత్నాలు కొనసాగుతున్నాయనీ.. మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించాలన్న వారి కోరిక నెరవేరబోతోందని తెలిపారు. కాంగ్రెస్‌ను అస్థిరపరిచేందుకు భాజపా కుట్రపన్నుతోందని ఆయన ఆరోపించారు. రాజ్యసభలో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తోందన్నారు. ముంబయిలో ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి వచ్చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. మరోవైపు దీనిపై కాంగ్రెస్‌ నేత వేణుగోపాల్‌ సైతం 

మాట్లాడారు. అసంతృప్తులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌ మంత్రులు రాజీనామా చేశారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను భాజపా డబ్బుతో కొనాలని చూస్తోందని ఆరోపించారు. అసమ్మతి నేతలందరూ తిరిగి వచ్చేస్తారనీ.. మంగళవారం జరగబోయే సీఎల్పీ సమావేశంలో అందరూ పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమి ప్రభుత్వం కచ్చితంగా కొనసాగి తీరుతుందని ధీమావ్యక్తం చేశారు.

బీజేపీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం – శోభా కరంద్లాజే

బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని జేపీ నేత శోభా కరంద్లాజే స్పందించారు. ఎవరైనా తమ పార్టీలోకి వస్తామంటే స్వాగతిస్తామని అన్నారు. అలాగే రాజీనామా చేసిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని, వీళ్లంతా వారి వారి పార్టీలతోనే ఉన్నారని శోభా పేర్కొన్నారు. కుమారస్వామి మెజార్టీ కోల్పోయారని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారని, మరో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. మెజారిటీ కోల్పోయినందున ఆయనకు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టారని తెలిపారు. మరో ప్రభుత్వం ఏర్పాటు కోసం కుమార స్వామి దారివ్వాలన్నారు.

కర్ణాటక సంక్షోభం.. మాకు సంబంధం లేదు – కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌

కర్ణాటక సంక్షోభానికి తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. లోక్‌సభలో జీరో అవర్‌ సందర్భంగా కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ అధిర్‌ రంజన్‌.. కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ప్రశ్న లేవనెత్తారు. కర్ణాటక సంక్షోభానికి భారతీయ జనతాపార్టీనే కారణమని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌ స్పందిస్తూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నామని తెలిపారు. రాజీనామాల పరంపర రాహుల్‌ గాంధీతోనే ప్రారంభమైందన్నారు. రాజీనామాలు చేయాలని రాహులే అందరినీ అడుగుతున్నారని, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close