మెట్రో స్టేషన్‌నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): హైదరాబాద్‌లోని అవిూర్‌పేట మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్‌.ఆర్‌.నగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే కారణాలపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. ఉదయం మెట్రోస్టేషన్‌ మొదటి అంతస్తుకు వెళ్లిన ఆ వ్యక్తి.. సారథి స్టూడియో ప్రహారీ గోడవైపు దూకేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, నగరంలో మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించడం ఈ వారంలో ఇది రెండో ఘటన. మంగళవారం కొత్తపేట విక్టోరియా మెమోరియల్‌ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే, అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. కుటుంబ కలహాల కారణంగా ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదమేవిూ లేదని, చేయి విరిగిందని వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటన మరువక ముందే మరో వ్యక్తి మెట్రో నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here