Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలువార్తలు

విజృంభిస్తున్న డెంగ్యూ..

పెరుగుతున్న మృతుల సంఖ్య

  • కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు

తెలంగాణలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. విషజ్వరాలు, డెంగ్యూ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూతో బాధపడుతున్న రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ కేసులతో కిక్కిరిసి పోతున్నాయి. చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. మంగళవారం ఒకేరోజు వేర్వేరు జిల్లాల్లో ఆరుగురు డెంగ్యూ, మరో ఇద్దరు విషజ్వరాలతో ప్రాణాలుకోల్పోయారు. యాదాద్రి జిల్లాలో జ్వరాలతో ఇద్దరు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. భువనగిరి పట్టణంలో హనుమాన్‌ వాడ చెందిన శివ అనే యువకుడు డెంగ్యూ వచ్చి మృతి చెందాడు. గత మూడు రోజుల క్రితం వలిగొండ మండలంలోని వెల్వర్తి గ్రామానికి చెందిన చర్చ్‌ పాదర్‌ స్వైన్‌ ఫ్లూ తో హైదరాబాద్‌ లో చికిత్స పొందుతూ మరణించాడు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం సీతంపేట మంగలితండాలో డెంగ్యూతో అశ్వంత్‌ (8) అనే చిన్నారి మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామ గుగులోతు లక్ష్మి ¬ంగార్డుగా విధులు నిర్వర్తిస్తోంది. జ్వరం రావడంతో కరీంనగర్‌ చల్మెడ ఆనందరావు ఆస్పత్రికి వెళ్లగా డెంగ్యూగా నిర్ధారించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించింది. జగిత్యాల జిల్లా రాయికల్‌ పట్టణంలో చెలువమద్ది రాజేందర్‌ (40) జ్వరం వచ్చిందని స్థానికంగా వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. కరీంనగర్‌ ఆస్పత్రిలో డెంగ్యూ నిర్ధారించగా పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం చనిపోయాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం యర్రబంజరలో వేల్పుల మరియమ్మ(52) జ్వరంతో ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరులోని ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేరింది. ఖమ్మంరాగా అప్పటికే పరిస్థితి విషమించిందని వైద్యులు తెలుపగా కొద్దిసేపటికే మరణించింది. నివేదిక పరిశీలించి డెంగ్యూగా నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రం పంబాల కౌశిక్‌(19) జ్వరంతో ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. సిద్దిపేట ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లగా అక్కడ్నుంచి హైదరాబాద్‌కు తరలించారు. డెంగ్యూగా నిర్ధారించగా పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మరణించాడు. సంగారెడ్డి జిల్లా అల్లీపూర్‌ మండలం మహ్మద్‌అన్వర్‌, సత్య బేగం ఏకైక కుమార్‌ ఉమర్‌ (10) హైదరాబాద్‌ మదినగూడలోని అంకుర ఆస్పత్రిలో డెంగ్యూతో మృతిచెందాడు. అలాగే రంగారెడ్డినగర్‌ డివిజన్‌ నందానగర్‌లోని ఇక్బాల్‌ కుమారుడు బిలాల్‌ డెంగ్యూ కారణంగా నిలోఫర్‌ ఆస్పత్రిలో పరిస్థితి విషమించి మరణించాడు. భద్రాద్రి జిల్లాలో చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామంలో విషజ్వరంతో గుర్రం సుమన్‌ (30) మృతి చెందాడు.

ఇప్పటికే 50 మంది మృతి..

రాష్ట్రంలో రోజురోజుకి డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. ఐదేళ్ల చిన్నారులు డెంగ్యూ బారిన పడి మరణించడం తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. డెంగ్యూ సోకి గతేడాది ఐదుగురు మరణించగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు సుమారు 50 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ మరణాల సంఖ్యను బయటకి వెళ్లడించకుండా అధికారులు దాచిపెడుతున్నట్లు సమాచారం.

డెంగీ జ్వరం రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..

రాష్ట్రవ్యాప్తంగా డెంగీ జ్వరాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ఏడాది దీనివల్ల ఇప్పటికే పదుల సంఖ్యలో మృతి చెందగా, వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. అసలు డెంగీ అనేది ఒక వైరస్‌. ‘ఈడిస్‌ ఈజిప్టై’ అనే ఒక రకం ఆడదోమ కుట్టడం ద్వారా ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. పగటిపూట ఈ దోమ కుడితే కొద్ది రోజుల్లోనే డెంగీ బారిన పడతాం. ఇది జ్వరంతో ప్రారంభమై ప్రాణాలు తీసే వరకు వెళ్తుంది. పరిసరాల పరిశుభ్రత, ముందు జాగ్రత్త చర్యలతో దీనికి చెక్‌ పెట్టవచ్చు. డెంగీ జ్వరం వస్తే శరీరంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గుతాయి. దాంతో రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. అలా శరీరమంతా అధిక నొప్పులు వచ్చి.. మంచాన పడే పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి మరణం సంభవించే ప్రమాదమూ ఉంది.

అందువల్ల ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలేంటంటే..

  • ఫ్లవర్‌ వాజ్‌, ఎయిర్‌ కూలర్‌ నీళ్లను మార్చుతూ ఉండాలి. కాలనీ, ఇళ్లలో నిల్వ ఉండే నీటి గుంతలను పూడ్చాలి.
  • ప్లాస్టిక్‌ బకెట్లు, ట్యూబ్‌, టైర్లు ఇళ్లలో ఉంచవద్దు. ఇంటిపై ఉండే నీళ్ల ట్యాంకులకు కచ్చితంగా మూతలు పెట్టాలి.
  • డబ్బాలు, కుండలు కుండీల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్త పడాలి.
  • డెంగీ దోమ పగటి పూట కుట్టే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. దోమలు రాకుండా దోమ తెరను ఏర్పాటు చేసుకోవాలి. మస్కిటో రిఫిలెంట్స్‌ వినియోగించాలి.
  • తలుపులు, కిటికీలు మస్కిటో స్క్రీన్‌తో కవర్‌ చేసుకోవాలి. అలా చేయడం వల్ల దోమల నుంచి రక్షణ పొంది రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close