Thursday, September 19, 2024
spot_img

ఘనంగా ఓయూ 83వ స్నాతకోత్సవం

తప్పక చదవండి
  • 1024 మందికి పీ.హెచ్‌.డీ పట్టాలు ప్రధానం
  • 58 మందికి బంగారు పథకాలు
  • ప్రతి సవాల్‌ను అధిగమించినప్పుడే అద్భుతాలు సృష్టించగలం : గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై

సికింద్రాబాద్‌ : ప్రతీ మనిషి జీవితం సవాళ్లతో కూడుకుందని, ప్రతి సవాల్‌ ను అధిగమించినప్పుడే అద్భుతాలు సృష్టించగలమని ఉస్మానియా యూనివర్సిటీ ఛాన్సలర్‌, రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పేర్కొన్నారు. విజయానికి ఎలాంటి దగ్గరి దారులు లేవని శ్రమ, పట్టుదల ద్వారానే విజయతీరాలకు చేరుకోవాలని ఆమె సూచించారు. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవం మంగళవారం యూనివర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఓయూ చరిత్రలో తొలిసారిగా ఒకే సారి 1024 మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాలు పొందారు. యూనివర్సిటీ పరిధిలో ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 58 మంది విద్యార్థులు గవర్నర్‌ చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల పూర్వ విద్యార్ది, ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల్లో ఒకటైన అడోబ్‌, అధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి శంతన్‌ నారాయణ్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. పీహెచ్డీ పూర్తి చేసిన 1024 మంది విద్యార్థులు శంతన్‌ నారాయణ్‌, ఓయూ వీసీ ప్రొఫెసర్‌ దండెబోయిన రవిందర్‌ యాదవ్‌ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలకు అధ్యాపకులు దిక్సూచిగా నిలుస్తారని పేర్కొన్నారు. ఎలాంటి సందర్బంలోనైనా అత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ప్రతి సందర్భంలోనూ ధైర్యంతో, సంతోషంతో ముందుకు సాగాలని చెప్పారు. ప్రతి విభాగంలోనూ బంగారు పతకాలు అందించేందుకు దాతలు, పారిశ్రామికవేత్తలు, పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ స్వతహాగా ప్రేరణ పొందుతూ, ఎదగాలని అన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన శంతన్‌ నారాయణ్‌ మాట్లాడుతూ ఇక్కడ చదువుకుని ప్రపంచ అగ్రగామి సంస్థకు నాయకత్వం వహించటం ఆనందం గా ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ ఉన్నత స్థాయికి ఎదిగే సామర్ధ్యం ఉంటుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు అడోబ్‌ ఉత్పత్తుల్లో అడోబ్‌ ఫొటోషాప్‌ అత్యంత ప్రాచుర్యం పొందిందని గుర్తు చేశారు. వినూత్న ఆలోచలతో 42ఏళ్ల క్రితం అమెరికా వెళ్లానని, ఉస్మానియాలో చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు.వృత్తిపరమైన ప్రపంచంలో విజయాలు, ఆవిష్కరణలకు అంతులేని అవకాశాలున్నాయని గుర్తు చేశారు. మార్పును స్వీకరిస్తూ, ఉద్దేశాలకు కట్టుబడి స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.లక్ష్మినారాయణ, పాలకవర్గ సభ్యులు, పన్నెండు ఫ్యాకల్టీల డీన్లు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు