Monday, October 28, 2024
spot_img

కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం

తప్పక చదవండి
  • ఈ దాడి ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు
  • ప్రభాకర్‌పై దాడిని ఖండించిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
  • ఆస్పత్రి వద్ద ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి హరీష్ రావు

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు. ఈ దాడికి సంబంధించి విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభాకర్ రెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. కత్తి దాడిలో ఆయనకు బలమైన గాయమైందని వైద్యులు తెలిపారు. కడుపులో 3 ఇంచుల వరకు కత్తి దిగిందని వెల్లడించారు. అంతర్గతంగా రక్తస్రావం అయిందని తెలిపారు. ఆపరేషన్ థియేటర్‌లోకి తరలించి సర్జరీ నిర్వహిస్తున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి ఘటన గురించి తెలియగానే.. మంత్రి హరీష్ రావు పరుగు పరుగున ఆస్పత్రికి వచ్చారు. అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని, అధైర్యపడవద్దని హరీష్ రావు పిలుపునిచ్చారు. ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన అన్నారు. మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో దుబ్బాక స్థానం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండ‌లం సూరంప‌ల్లిలో ఎన్నికల ప్రచారంలో ఉండగా.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. దుండగుడిని గన్‌మెన్ అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. కడుపులో కత్తి దిగడంతో గాయపడిన కొత్త ప్రభాకర్ రెడ్డిని అనుచరులు హుటాహుటిన గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తి దాడిని మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.

నారాయణ్‌ఖేడ్ సభ నుంచి నేరుగా యశోదా ఆస్పత్రికి
‘ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి అత్యంత గర్హనీయం. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది’ అని హరీష్ రావు అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తీవ్రంగా ఖండించారు. నారాయణ్‌ఖేడ్ సభ నుంచి బయల్దేరి నేరుగా యశోదా ఆస్పత్రికి రానున్నారు. ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన నిందితుడిని మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు రాజు 10 రోజుల కిందటే బీజేపీ పార్టీలో చేరాడని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో అతడు కాషాయ కండువా కప్పుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని మరికొంత మంది పోస్టులు పెడుతున్నారు.

- Advertisement -

కాగా, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన దాడి ఘటనను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో కత్తితో దాడి జరగటం దారుణమని.. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని గవర్నర్ తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఎంపీపై జరిగిన హత్యాయత్నంపై డీజీపీ అంజనీ కుమార్‌ స్పందించాలని గవర్నర్‌ కోరారు. ఇక నుంచి సెక్యూరిటీ చర్యలపై మరింత దృష్టి సారించాలంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. భవిషత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి హింసకు తావులేదన్న గవర్నర్.. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే తీవ్ర ప్రమాదమని ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఈ దారుణాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇక నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల భద్రత మీద మరింత దృష్టి సారించాలని గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలంటే శాంతియుత, సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు పోలీసు భద్రత పటిష్టంగా ఉండాలని సూచించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వానికి తమిళిసై సూచించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు