- ఇంగ్లాండ్ మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా దూరం..
- తిరగబెట్టింది గాయం..
లక్నో: ప్రపంచకప్‌లో భాగంగా కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయంతో ఇప్పటికే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం గాయం తీవ్రత ఎక్కువగా లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హార్దిక్‌ను ఈ మ్యాచ్‌కు కూడా దూరంగా ఉంచుతున్నట్టు సదరు అధికారి చెప్పారని సమాచారం. కాగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో తన తొలి ఓవర్ మూడో బంతికే హార్దిక్ గాయపడ్డాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ నేరుగా కొట్టిన బంతిని ఆపే క్రమంలో హార్దిక్ కాలిని దూరంగా జరిపాడు. దీంతో బంతి అతని కాలికి బలంగా తాకింది. ఈ క్రమంలో హార్దిక్ చీలమండ భాగం మడత పడింది. దీంతో నొప్పితో విలవిలాడిన హార్దిక్ పాండ్యా వెంటనే మైదానాన్ని వీడాడు. అయితే మొదట హార్దిక్ పాండ్యాకు అయిన గాయం పెద్దదేమి కాదని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. కానీ తాజాగా వరుసగా మ్యాచ్‌లకు దూరం అవుతుండడం ఆందోళన కల్గిస్తోంది. ఇక ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచకప్‌లో భారత జట్టు తన తర్వాతి మ్యాచ్‌ను ఈ నెల 29న ఇంగ్లండ్‌తో ఆడనుంది.