Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeజాతీయంవరుసగా మంత్రుల రాజీనామాలు

వరుసగా మంత్రుల రాజీనామాలు

  • నేపాల్‌లో రాజకీయ సంక్షోభం
  • ఇప్పటికే ముగ్గురు మంత్రుల రాజీనామా
  • దేశం విడిచేందుకు ప్రధాని ఓలి సిద్దమైనట్లు వార్తలు

బంగ్లాదేశ్‌ తరవాత ఇప్పుడు నేపాల్‌ రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. హిమాలయ దేశం నేపాల్‌లో సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. వేలాది మంది జనరేషన్‌ జెడ్‌ ఆందోళనకారులు సోమవారం దేశ రాజధాని కాఠ్మాండులో చేపట్టిన ఉద్యమం రణరంగాన్ని తలపించింది. ఈ నిరసనల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. యువత హింసాత్మక నిరసనల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల నిషేధంపై నేపాల్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌తోసహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధింస్తూ ఈ నెల 4న తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ నిరసనలు చల్లారట్లేదు. మరోవైపు రాజధాని సహా పలు ప్రధాన నగరాల్లో సైన్యం మోహరించింది. ఆ దేశ ప్రధాని కేపీ ఓలి రాజకీయ సంక్షోభంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే పలువురు కేబినెట్‌ మంత్రులు రాజీనామా చేశారు. హోంమంత్రి రమేష్‌ లేఖక్‌ అధికారికంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేబినెట్‌ సమావేశంలో లేఖక్‌ తన రాజీనామాను ప్రధాని ఓలికి సమర్పించారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి రామ్‌నాథ్‌ అధికారి, ఆరోగ్య శాఖ మంత్రి ప్రదీప్‌ పౌడేల్‌ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.

దీంతో నేపాల్‌లో రాజకీయ సంక్షోభం నెలకొనే పరిస్థితి తలెత్తింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో నేపాల్‌ ప్రధాని కేపీ ఓలి దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన దుబాయ్‌ కి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. హిమాలయ ఎయిర్‌లైన్స్‌ అనే ప్రైవేట్‌ విమానయాన సంస్థకు చెందిన ఫ్లైట్‌లో ఆయన దుబాయ్‌ వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆయన ఇప్పటికే ఉప ప్రధాన మంత్రికి తాత్కాలిక బాధ్యతలు కూడా అప్పగించినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఓలి వైద్య చికిత్స నిమిత్తం దుబాయ్‌ వెళ్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌ 4వ తేదీన నేపాల్‌ ప్రభుత్వం సోషల్‌మీడియాపై నిషేధం విధించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా మద్దతుదారులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. వారి పిలుపుమేరకు యువత సోమవారం భారీ ఎత్తున నిరసనలు నిర్వహించారు. ఆ దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని నివాసాలను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో 19 మంది మృతి చెందారు. అయినప్పటికీ.. నేపాల్‌ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండోరోజు మంగళవారం కూడా పెద్దఎత్తున యువత వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచే పార్లమెంటు వెలుపల రోడ్లని ఆందోళనకారులు నిర్బంధించారు. కలంకి వంటి ప్రాంతాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళనకారులు రోడ్లను నిర్బంధించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మంగళవారం నేపాల్‌లోని భారత పౌరులకు కీలక సూచన జారీ చేసింది.

భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో నేపాల్‌లోని పరిస్థితిని గమనిస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు, నిబంధనలను పాటించాలని తెలిపింది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు సహనంతో వ్యవహరించి, సమస్యలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నామని వెల్లడిరచింది. దీంతోపాటు మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడిరచింది. అత్యవసర ప్రయాణాలు తప్పించి, నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. శాంతియుత వాతావరణం తిరిగి నెలకొనేంతవరకూ జాగ్రత్తలు తీసుకోవాలని విదేశాంగశాఖ కోరింది. నేపాల్‌లో ఉన్న భారతీయ పౌరుల భద్రతే ప్రధానం అన్న నమ్మకంతో ఈ అడ్వైజరీని జారీ చేసింది. మొదట్లో ఈ ప్రదర్శనలు శాంతియుతంగానే జరిగాయి. కానీ, కొందరు ఆందోళనకారులు పోలీసు బ్యారికేడ్‌లను దాటి నిషేధిత పార్లమెంట్‌ ప్రాంతాల్లోకి వెళ్లారు. అక్కడ కొంతమంది నీటి బాటిళ్లు, చెట్ల కొమ్మలు పోలీసుల మీదకు విసిరారు. దాంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌, రబ్బర్‌ బుల్లెట్లతో స్పందించారు. ఒక దశలో పోలీసులు తట్టుకోలేక పార్లమెంట్‌ కాంపౌండ్‌లోకి వెనక్కి వెళ్లిపోయారు. ఈ గొడవలో 19 మంది చనిపోయారు. దీంతో ప్రభుత్వం పార్లమెంట్‌, ముఖ్య కార్యాలయాలు, రాష్ట్రపతి భవనం చుట్టూ కర్ఫ్యూ విధించింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News