Friday, September 20, 2024
spot_img

మాది చేతల ప్రభుత్వం

తప్పక చదవండి

ఆచరణ సాధ్యం అయ్యే పథకాలతోనే మేనిఫెస్టో

  • మోసపూరిత మాటలు నమ్మొద్దు
  • తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాం
  • చేనేతల కోసమే బతుకమ్మ చీరలు తీసుకొచ్చాం
  • మళ్లీ తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీదే అధికారం
  • ఒకప్పుడు ఆత్మహత్యలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నా
  • సిరిసిల్లలో ఒకప్పుడు చేనేతల ఆత్మహత్యలు ఉండేవి
  • కేటీఆర్‌ ఎమ్మెల్యే కావడం ఇక్కడి వారి అదృష్టం
  • సిరిసిల్లలో ఎంతో అభివృద్ధి జరిగింది
  • సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

రాజన్న సిరిసిల్ల : రైతుల కోసమే ధరణిని తీసుకువచ్చాం.. సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం.. మోసపూరిత మాటలు నమ్మొద్దు అంటూ భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ టార్గెట్‌ గా నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. చేనేతల కోసమే బతుకమ్మ చీరలు ని.. కొందరు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఓట్ల అబద్దాలు చెప్పలేదని.. ఇచ్చిన హామీలను అమలు చేసి చూపుతున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. మళ్లీ తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీయే అధికారం చేపడుతుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. సిరిసిల్లలో ఒకప్పుడు ఆత్మహత్యలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

- Advertisement -

70 ఏళ్ల రాజకీయ చరిత్రలో సిరిసిల్లలో ఎన్నో సార్లు పర్యటించానని, సమైక్య పాలనలో నాశనం అయిపోయిందంటూ కేసీఆర్‌ పేర్కొన్నారు. అప్పర్‌ మానేరు ప్రాజెక్టుతో జలధార పరుగులు పెడుతున్నదంటూ పేర్కొన్నారు. నిండు కుండలా మారి మానేరు ప్రాజెక్టు సిరిసిల్లను సస్యాశ్యామలం చేసిందన్నారు. సిరిసిల్లలో ఎంతో అభివృద్ధి జరిగిందంటూ పేర్కొన్నిరు. సిరిసిల్లలో ఒకప్పుడు చేనేతల ఆత్మహత్యలు ఉండేవని.. చేనేతల అభివృద్ధి కోసం కేటీఆర్‌ ఎంతో చేశారంటూ అభినందించారు. 24 గంటల కరెంట్‌ విషయంపై మరోసారి కేసీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ మూడు గంటల కరెంట్‌ అంటూ చెప్పిందని.. మోసపూరిత హామీలను నమ్మొద్దంటూ కేసీఆర్‌ పేర్కొన్నారు. ఓట్ల కోసం మోసపూరిత హామీలతో వస్తారని.. కాంగ్రెస్‌ ను నమ్మవద్దంటూ సూచించారు. మరికొందరు మతాల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తారని జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. మరోసారి గులాబీ పార్టీని ఆశీర్వదించాలంటూ కేసీఆర్‌ కోరారు. జన్మభూమిని మించిన స్వర్గం లేదని.. సిద్ధిపేట గడ్డ తనను నాయకుడ్ని చేసిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

మంగళవారం ఆయన సిద్ధిపేటలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ, సిద్ధిపేట తనను తెలంగాణకు ముఖ్యమంత్రికి చేసిందని, సిద్ధిపేట రుణం జన్మలో ఏమిచ్చినా తీర్చుకోలేనన్నారు. ‘’సిద్ధిపేటతో ఎంతో అనుబంధం నాకు ఉంది. సిద్ధిపేటలో నేను తిరగని పల్లె, ప్రాంతం లేదు. ‘’చింతమడకలో నేను చిన్నవాణ్ణిగా ఉన్నప్పుడు మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఓ ముదిరాజ్‌ తల్లి నాకు పాలు పట్టింది’’ అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సీఎం కేసీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ‘’సిద్ధిపేట మంచినీళ్ల పథకం రాష్ట్రానికే ఆదర్శం. సిద్ధిపేటను హరీష్‌రావు ఎన్నో రెట్లు అభివృద్ధి చేశారు. సిద్ధిపేట అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. తెలంగాణలోనే సిద్ధిపేట వజ్రం తునుకలా తయారవుతోంది. ఆరు అడుగుల బుల్లెట్‌ హరీష్‌రావు సిద్ధిపేటకు అప్పగించా’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ రోజు సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు, మీ దివెనలతో సిద్దిపేటకి సేవ చేసే అవకాశం దక్కిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. మరొక్కసారి సీఎం కేసీఆర్‌ ఆశీర్వదించి నాకు అవకాశం ఇచ్చారు. నాకు శ్వాస ఉన్నంత కాలం, జన్మ ఉన్నంత వరకు సీఎం కేసీఆర్‌కి, సిద్దిపేట జనాలకే నా జీవితం అంకితం చేస్తాను. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కట్టించిన తక్కువే. నా చివరి శ్వాస ఉన్నంతవరకు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మీకు సేవ చేస్తాను’’ అంటూ హరీష్‌రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఇది ఎన్నికల ప్రచార సభలా లేదని, మన కలను నిజం చేసిన సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞత సభలా అనిపిస్తుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట దశాబ్దాల కలను నిజం చేసిన నాయకుడు కేసీఆర్‌. ఆనాటి సీఎం ఎన్టీఆర్‌కు సిద్దిపేట జిల్లా కావాలని కేసీఆర్‌ వినతి పత్రం ఇచ్చారు. ఇప్పుడు ఆయనే సిద్దిపేటను జిల్లా చేశారు. సిద్దిపేటకి రైలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. సిద్ధిపేటకి కాళేశ్వరం నీళ్లు వస్తాయంటే ప్రతి పక్షాలు ఎగతాళి చేశాయి. మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి సిద్దిపేటకి నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ దే. తెలంగాణకి సీఎంగా ఉన్న ఆయన వ్యవసాయం చేస్తున్నారు. ఆయన ఓ రైతు బిడ్డ కాబట్టే.. రైతుల బాధలు ఆయనకు తెలుసు’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు. ‘సిద్దిపేటకు భారీగా తరలివచ్చిన ఆత్మీయులైన సిద్దిపేట అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెల్లకు హృదయపూర్వక నమస్కారాలు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ. ఈ మాట అన్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించిన స్వర్గం లేదు. సిద్దిపేట పేరు విన్నా.. సిద్దిపేట భూమికి వచ్చినా.. సిద్దిపేట నా మనసులో కలిగే భావన ఇది. ఈ సిద్దిపేట గడ్డ నన్ను సాదింది. చదువు చెప్పింది. నాకు రాజకీయ జన్మనిచ్చింది. నన్ను నాయకున్ని చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా గడ్డ అని గర్వంగా మనవి చేసుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా యావత్‌ దేశమే ఆశ్చర్యపడేలా.. అనేక రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నా అంటే ఈ గడ్డ నుంచి నాకు దొరికిన రక్తం, మాంసం, బుద్ధి, బలం ఈ గడ్డ పుణ్యమే. నన్ను ఇంతవాన్ని చేసిన మాతృభూమి, కన్నతల్లికి మీ అందరి సాక్షిగా శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నా’ అన్నారు. ‘నన్ను ప్రతిసారి విజేతగా నిలబెట్టిన ఈ గడ్డ రుణం ఈ జన్మలో ఏమిచ్చినా తీర్చుకోలేనని మనవి చేస్తున్నా. ఈ సభలో నాతో కలిసి పని చేసిన మిత్రులు, సహచరులు వందలాది మంది ఉన్నారు. అనేక జ్ఞాపకాలు, ఎంతో మంది ఆత్మీయులు ఉన్నారు. కొండంరాజ్‌పల్లి మాదన్న ఎక్కడ ఉన్నడో.. మా నవాబ్‌ సాబ్‌ ఎక్కడ ఉన్నాడో. నాకు డిపాజిట్‌ కట్టే తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడ ఉన్నడో. ఇలా అనేక మంది అనేక మంది ప్రతి గ్రామంలో వంద, మూడు వందల పేర్లు పెట్టి పిలిచేంత అభిమానం కలిగిన గడ్డ సిద్దిపేట గడ్డ. ఆ నాడు అంత అద్భుతమైన పద్ధతిలో ఈ గడ్డను ముందుకు తీసుకెళ్లేందుకు చాలా తిప్పలు పడ్డాం. ఒక సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటే.. దామోదర్‌రావు, ఎంపీకి రంగనాయక్‌ సాగర్‌ నుంచి హెలికాప్టర్‌ నుంచి చూపించాను. సిద్దిపేటలో మంచినీళ్ల కరువు వస్తే వార్డుకో ట్యాంకు పెట్టి.. మిత్రులను వెంటేసుకొని బయలుదేరాం. సాయంత్రం వరకు ప్రయత్నం చేసి వంద బోర్లు వేస్తే నీళ్లు రాలే. ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే బాధేస్తుంది. మంచినీళ్ల కోసం సిద్దిపేట పడ్డ తిప్పలు. లోయర్‌ మానేరు నుంచి నీళ్లు తెచ్చుకొని జలజాతర చేసుకున్నాం. ఈ రోజు మిషన్‌ భగరీథ తెలంగాణ మొత్తం అమలవుతుందంటే.. సిద్దిపేట మంచినీళ్ల పథకమే దానికి పునాది. ఇక్కడి అనుభవమే అక్కడిదాకా.. బ్రహ్మాండంగా పని చేసిందని అన్నారు. రైతు సోదరులను హెచ్చరిస్తున్నా. మూడు సంవత్సరాలు రాత్రింబవళ్లు కష్టపడి ధరణి పోర్టల్‌ తీసుకొచ్చాం. రైతుల భూములు క్షేమంగా ఉండాలి. కౌలుకు ఇచ్చినంత మాత్రాన ఇంకోకరి పరం కావొద్దు అని ధరణిని తీసుకొచ్చాం. రిజిస్ట్రేషన్లు పావుగంటలో అయిపోతున్నాయి. ధరణి వల్ల 98 శాతం మంది రైతులకు మేలు జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ భుజం మీద గొడ్డలి పెట్టుకుని రెడీగా ఉంది. రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ కూడా ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో విసిరేస్తారట. మళ్లీ వీఆర్‌వోలు, గిర్దావర్‌లు వాని భూమి వీనికి రాసి, వాని భూమి ఇంకోకరికి రాసి, మళ్లీ రైతులను కోర్టుల చుట్టు తిప్పే పరిస్థితి వస్తుంది. మీ మీద వీఆర్వో, గిర్డారవ్‌, డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ సెక్రటరీ, సీసీఎల్‌ఏ, రెవెన్యూ మంత్రి ఉండేవారు. వీరిలో ఒకరికి కోపమొచ్చినా రైతు భూమి ఆగమయ్యేది. కానీ ఇవాళ ఆ అధికారం తీసేసి రైతులకే అధికారం ఇచ్చాం. మీ బొటన వేలి ప్రమేయం లేకుండా.. భూమి ఇతరులకు పోయే అవకాశం లేదు. మీ భూమి హక్కులు మీ బొటనవేలితోనే మారుతాయి. ఈ సిగ్గుమాలిన కాంగ్రెస్‌ మాటలు నమ్మకండి.. ఇవాళ ధరణి పుణ్యం వల్ల పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదం వచ్చి నెత్తిన పడుతది. మళ్లీ కథ మొదటికి వస్తది.. చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అనేక రంగాల్లో.. మనం నంబర్‌వన్‌గా ఉన్నాం అని కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు