Featuredజాతీయ వార్తలు

ముంచుకొస్తున్న 8వతేదీ

  • మహాసంక్షోభానికి తెరపడేనా
  • శివసేన ఎత్తులతో చిత్తవుతున్న బిజెపి
  • ప్రత్యామ్నాయాలపై ఎవరికి వారు చర్చలు

ముంబై

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్నది. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నది పక్కన పెడితే బిజెపి, శివసేనల మధ్య సఖ్యత పొసగడం లేదు. ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేసి, మెజార్టీ సాధించినా ముఖ్యమంత్రి పీఠం విషయంలో పట్టుదలకు పోవడంతో ప్రతిష్ఠంభన తొలగడం లేదు. ఈ రెండు పార్టీల వారు తమకే సిఎం పీఠం కావాలని భీష్మించడంతో పీటముడి పడింది. దీంతో గడువులోగా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందా లేదా అన్న అనుమా నాలు కలుగుతున్నాయి. మరోవైపు శిసేనను ముందు పెట్టి కాంగ్రెస్‌, ఎన్సీపిలు ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాయి. మొత్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజుల తరవాత కూడా వ్యవహారం కొలిక్కి రావడం లేదు. మరోవైపు తానే తదుపరి సిఎం అని ప్రస్తుత ముఖ్యమంత్రి ఫడ్ణవీస్‌ బలంగా చెబుతున్నారు. ఇదిలావుంటే వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు శివసేన ముఖ్య నేతలు సంజయ్‌ రౌత్‌, రాందాస్‌ కదం గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలువగా.. అటు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌తో భేటీ అయి రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు ఆయన తెలిపారు. గవర్నర్‌తో తమ భేటీ మర్యాదపూర్వకమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మెజారిటీ ఎవరికి ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునని రౌత్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అవకాశం ఇవ్వకుండా శివసేన ముందుకువస్తే.. ఆ పార్టీతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునన్న ఊహాగానాల నేపథ్యంలో శరద్‌ పవార్‌ సోనియాతో భేటీ అయ్యారు. సోనియా నివాసంలో వీరి భేటి జరిగింది. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనంటూ ఎన్సీపీ ఇప్పటికే సంకేతాలు పంపిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా ఢిల్లీలో అమిత్‌షాను కలసి తాజా పరిస్థితులను వివరించారు. శివసేన హ్యాండ్‌ ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన బీజేపీ అధినాయకత్వంతో చర్చించారని సమాచారం. సీఎం పదవి పంచే ప్రసక్తే లేదని, అయితే ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వం విషయంలో శివసేనకు డోర్లు తెరిచే ఉన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. మహారాష్ట్రలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని సంగతి తెలిసిందే. శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ వందకుపైగా స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ఆ పార్టీ మెజారిటీ మార్కుకు చాలా దూరం నిలిచిపోయింది. మరోవైపు 56 స్థానాలు గెలిచి కింగ్‌మేకర్‌గా అవతరించిన శివసేన సీఎం పీఠాన్ని సగకాలం తమకు పంచాల్సిందేనని పట్టుబడుతోంది. సీఎం పదవిని పంచేందుకు బీజేపీ ఏమాత్రం సిద్ధపడటం లేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చునని చెప్తున్నా.. అదీ ఎంతవరకు సాధ్యమనేది తేలడం లేదు. ఈ నెల 8వ తేదీ లోపు ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురాకపోతే.. మహారాష్ట్రలో గవర్నర్‌ పాలన విధించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గడువులోగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయకుంటే రాజ్యాంగ పరంగా సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close