80 సీట్లలోనూ ఒంటరిపోరు

0

ఉత్తర్‌ప్రదేశ్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌లో తాము 80 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ప్రకటించింది. సమాజ్‌ వాదీ పార్టీ-బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఆ రాష్ట్రంలో కలిసి పోటీ చేస్తామని శనివారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ యూపీలో తమ భవిష్యత్‌ కార్యాచరణపై వివరాలు తెలిపింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, యూపీ ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌ ఈ విషయంపై తమ పార్టీ నేతలతో కలిసి విూడియాతో మాట్లాడుతూ… ‘మేము యూపీలో 80 స్థానాల్లోనూ పోటీ చేస్తాం. ఇందుకోసం మేము పూర్తిగా సన్నద్ధమయ్యాం. 2009 లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ రాష్ట్రంలో సత్తా చాటింది. ఇప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేసి, మరోసారి అత్యధిక సీట్లు సాధిస్తాం’ అని ప్రకటించారు.ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఇతర ఏ పార్టీతోనైనా పొత్తులు పెట్టుకుంటుందా? అన్న విషయంపై ఆజాద్‌ను ప్రశ్నించగా.. ‘ఎస్పీ-బీఎస్పీతో పొత్తును మేమేం ఉద్దేశపూర్వకంగా వదులుకోలేదు. ప్రజలకి ఈ విషయం తెలుసు. భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు మేము అన్ని పార్టీలను కలుపుకొనే పోటీ చేస్తామని ఇంతకు ముందు చెప్పాము. కానీ, మాతో కలవమని మేము ఎవ్వరినీ ఒత్తిడి చేయలేం. యూపీలో మాతో పొత్తు అంశానికి వారు (ఎస్పీ-బీఎస్పీ) ముగింపు పలికారు. దీంతో మేము మా సొంత శక్తిని నమ్ముకునే భాజపాపై పోరాడతాం’ అని వ్యాఖ్యానించారు. యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్‌తో పాటు పలువురు నేతలతో లోక్‌సభ ఎన్నికలపై ఆజాద్‌ ఇటీవల చర్చలు జరిపారు. కాగా, ఆ రాష్ట్రంలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా ఎస్పీ, బీఎస్పీ 38 స్థానాల చొప్పున పోటీ చేయనున్నాయి. మిగతా స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here