– సుజనా కంపెనీల నిర్వాహకం
– ఈడీ దాడులు.. 27న హాజరు కావాలని సమన్లు
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్): తెదేపా నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని సూచించింది. హైదరాబాద్, దిల్లీలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో శనివారం పెద్ద ఎత్తున సోదాలు చేసిన ఈడీ అధికారులు ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీచేశారు. సుజనా ఆధీనంలోని 120 డొల్ల కంపెనీలు ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. సుజనా గ్రూప్ కంపెనీలు బ్యాంకులకు రూ.5,700 కోట్లు ఎగవేశాయని తెలిపింది. సుజనా చౌదరికి చెందిన ఆరు ఖరీదైన కార్లను ఈడీ జప్తు చేసింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ తర్వాత మరో భారీ కుంభకోణంగా దీనిని భావిస్తున్నారు. డొల్ల కంపెనీల పేరుతో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి భారీ అక్రమాలకు తెరలేపాడని ఇడి గుర్తించింది. దీంతో సుజనా చౌదరి అక్రమాలపై ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఫేక్ డాక్యుమెంట్లతో వేల కోట్ల రూపాయల రుణం తీసుకొని సుజనా చౌదరి మూడు బ్యాంకులను నిండా ముంచినట్టు వెల్లడయింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ చెన్నై పేరుతో మూడు బ్యాంకులకు సుజనా చౌదరి టోపీ
పెట్టాడు. సుజనా గ్రూప్ సంస్థపై రూ.5700 కోట్ల కుంభకోణం కేసును నమోదు చేసింది. మనీలాండరింగ్ చట్టాల ప్రకారం ఈడీ విచారణ ప్రారంభించింది. ఇదివరకు ఓసారి అక్టోబర్ 8నే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని సుజనా చౌదరి నివాసం, కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహించింది. తాజాగా మూడు బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా గ్రూప్‌పై ఈడీ దాడులు నిర్వహించింది. ఆయన కార్యాలయాల నుంచి కీలక పత్రాలు, రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది. సుజనా చౌదరి షెల్ కంపెనీలకు సంబంధించిన 126 రబ్బర్ స్టాంపులను హైదరాబాద్‌లోని పంజాగుట్ట కార్యాలయం నుంచి ఈడీ స్వాధీనం చేసుకుంది. సుజనా గ్రూప్‌నకు సంబంధించిన అన్ని కంపెనీలకు చైర్మన్‌గా సుజనాచౌదరే ఉన్నాడని కంపెనీల డైరెక్టర్లు వెల్లడించారు. అయితే తమ డైరెక్టర్లకు లుకౌట్ నోటీసులు జారీ చేశారన్న అంశంపై సుజనా గ్రూప్ స్పందించింది. నోటీసులు జారీ చేశారన్నది కేవలం దుష్పచ్రారమేనని, ఆ ఆరోపణల్ని ఖండిస్తున్నట్టు తెలిపింది. పదేళ్ల నాటి ఓ శోధనలో భాగంగా చెన్నై నుంచి ఈడీ అధికారులు వచ్చారని, వారికి అవసరమైన సమాచారం అందించినట్టు సుజనా గ్రూప్ స్పష్టం చేసింది. విూడియా పట్ల దురుసు ప్రవర్తన ఆరోపణలు కూడా అవాస్తమేనని తెలిపింది. తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు చేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తు న్నట్టు సుజనా గ్రూప్ పేర్కొంది.