Featuredరాజకీయ వార్తలు

3,600 కోట్ల డబ్బు తరలి ‘పోయింది’

3,600 కోట్ల డబ్బు తరలి ‘పోయింది’
★ నియోజకవర్గానికి 10 కోట్లు?
★ 48 లక్షల జీరో ఖాతాలపై కన్ను
★ నిఘా నీడలో గుట్టుగా చేరిన సొత్తు
(రమ్యా చౌదరి, ఆదాబ్ హైదరాబాద్)

ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతుందని అందరికీ స్పష్టంగా తెలుసు. అయినా లేని నిద్ర నటిస్తారు. చేరాల్సిన చోటుకు సుమారుగా 3,600 కోట్ల ధనం గుట్టుగా చేరింది. థూ.థూ.. మంత్రంగా నిబంధనలు అమలు. మమ అనే విధంగా కేసులు. ఈ కేసులు చూసి సామాన్యులు ముక్కున వేలేసుకుంటుంటే… ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో చేరాల్సిన సొమ్ము చేరింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బ్యాంకులు 5332 ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఏటీఎంలు 4605 ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకులున్నాయి. ఈ బ్యాంకు లావాదేవీల మాటున నడిచిన ఘరానా పక్కా కుంభకోణం ఇది. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి కనీసం 10 కోట్లు చేరిందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అంతా ‘సెట్ రైట్’ అయిన తరువాత నిద్ర లేచిన సంబంధిత శాఖలు సామాన్యుల సొత్తు వైపు ఓర చూపుగా చూస్తూ.. రంకెలు వేస్తారు. రేపటి ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేయకుండా ఆపే దమ్ము.. ధైర్యం ఈ శాఖలకు ఉందా… చూద్దాం.

ఇవీ నిబంధనలు అట..!:
ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టే ప్రక్రియలో భాగంగా అనుమానిత లావాదేవీలపై దృష్టి పెట్టాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈ విషయమై బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉన్నఫలంగా ఖాతాల్లో నగదు జమకావటం, మునుపెన్నడూ ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాల్లో ఈ మధ్య ఎక్కువగా లావాదేవీలు నిర్వహించటం, జీరో ఖాతాల విషయమై సూక్ష్మ పరిశీలన చేయాలని ఆదేశించారు.

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఈసీ నిబంధనల ప్రకారం పరిమిత ఖర్చు చేయాలి. ఒకసారి నామినేషన్‌ ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత జరిపే ప్రతి లావాదేవీ, ఖర్చు ఎన్నికల వ్యయంగా పరిగణిస్తారు. కానీ, ఈ సమయంలో అభ్యర్థులు తమ పేర్ల మీద కాకుండా బినామీల పేర్లతో ఎక్కువ లావాదేవీలు చేస్తుంటారు. ఇప్పటికే ఆశావహులు ఎన్నికల ఖర్చులకు అవసరమైన డబ్బును సమకూర్చుకునే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో ఈసీ కూడా అప్రమత్తమై ధన ప్రవాహాన్ని అరికట్టే విషయంలో చర్యలు చేపట్టింది.
పరిమితి దాటితే పరిశీలన
ఆదాయపన్ను చట్టానికి లోబడి రూ.49,999 వరకు జరిపే లావాదేవీలకు పాన్‌కార్డు అవసరం ఉండదు. రూ.50 వేల నుంచి జరిపే ప్రతి లావాదేవీపైన ఖాతాదారుడి పాన్‌కార్డు సమర్పించటం తప్పనిసరి. ఇలాంటి లావాదేవీలను బ్యాంకర్లు ఇకమీదట క్షుణ్ణంగా పరిశీలన చేయనున్నారు.

వాస్తవానికి కరెంట్‌ ఖాతాలు ఉన్నవారు, వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు, బంకులు, హోటళ్లు, మద్యం దుకాణాల నిర్వాహకులు నిత్యం రూ.లక్షల్లో లావాదేవీలు జరుపుతారు. ఇలా నిత్యం లావాదేవీలు జరుపుతున్న వారిని పక్కనపెడితే.. జీరో ఖాతాల్లో ఉన్నఫలంగా నగదు జమ అయితే వీటిపై దృష్టి పెట్టనున్నారు. కనీసం రూ.2 లక్షల నుంచి ఆపై డబ్బు జమ అయిన వెంటనే పరిశీలన చేయవచ్చని తెలుస్తోంది.

48 లక్షల డమ్మీ ఎకౌంట్లు:
తెలంగాణ జిల్లాల్లో కలిపి దాదాపు 48 లక్షల ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు జరుగట్లేదు. గత రెండు, మూడేళ్లుగా జీరో ఖాతాలుగానే ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ఈ సమయంలో ఉన్నఫలంగా రూ.లక్షల్లో నగదు జమ అయినా, పెద్దఎత్తున లావాదేవీలు జరిగినా అనుమానిత ఖాతాలుగా పరిగణించాల్సి ఉంటుంది.
ఇప్పటికే అప్రమత్తం
ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా నగదు లావాదేవీలు చేయటం తగ్గింది. ప్రతి పైసాకు లెక్క ఉండటంతో పాటు ఈసీ దృష్టి సారించటంతో బ్యాంకులకు సంబంధం లేకుండా లావాదేవీలు జరుపుతున్నారు.
ఐటీ అధికారుల ఆరా
మరోవైపు పెద్దఎత్తున జరుగుతున్న అనుమానిత ఖాతాల లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఉభయ జిల్లాల్లో వీరు దృష్టి పెట్టనున్నారు. ఏమాత్రం అనుమానం ఉన్నా, సమాచారం అందినా సత్వరమే రంగంలోకి దిగనున్నారు.
త్వరలో చెక్‌పోస్టులు
ధన ప్రవాహాన్ని నియంత్రించటంలో భాగంగా పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. అన్ని ఠాణాల వారీగా త్వరలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయమై అన్ని జిల్లాల ఠాణాల ఎస్‌హెచ్‌వోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచినట్లు గుర్తించినా, వాహనాల్లో నగదుని తరలించినట్లు సమాచారం ఉన్నా తక్షణమే అప్రమత్తం కావాలని సూచించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి కట్టడి చేయాలని ఆదేశించారు. గత ఎన్నికల సమయంలో నగర శివారులో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద పెద్దఎత్తున డబ్బు కూడా పట్టుబడిన దాఖలాలున్నాయి. ఈసారి కూడా మరింత పక్కాగా చెక్‌పోస్టు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

అధికారులు అభ్యర్థుల ఖాతాలపై కన్నేసి ఉంచారు. అనుమానిత లావాదేవీలపై దృష్టిని కేంద్రీకరించారు. ఉన్న ఫలంగా ఖాతాల్లో నగదు జమ కావడం వంటి వాటిని పరిశీలిస్తున్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈసీ నిబంధనల మేరకు పరిమిత ఖర్చు చేయాలి. ఒకసారి నామినేషన్‌ ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత జరిపే లావాదేవీలు, ఖర్చు ఎన్నికల వ్యయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో అభ్యర్థులు తమ పేర్లమీద కాకుండా బినామీపేర్లతో ఎక్కువ లావాదేవీలు చేస్తుంటారు. ఇప్పటికే ఆశావహులు ఎన్నికల ఖర్చులకు అవసరమైన డబ్బులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిఘా బృందాలు ఓ కంట కనిపెట్టేలా అడుగులు ముందుకు వేస్తున్నాయి. అభ్యర్థుల ప్రచార తీరు తెన్నులు, డబ్బు, మద్యం పంపిణీ, శాంతి భద్రతల పర్యవేక్షణ, ప్రచార ఖర్చు ఎన్నికల ఉల్లంఘలన తదితరవన్నీ గమనిస్తున్నాయి.

అభ్యర్థి ఖర్చు రూ. 28 లక్షలే..:
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చల విడిగా ఖర్చ చేయడానికి వీల్లేదు. ఒక్కో అభ్యర్థి రూ.28 లక్షలే ఖర్చు చేయాలి. అంతకు మించి ఖర్చు చేస్తే.. ఎన్నికల రూల్స్‌ ఒప్పుకోవు. నిర్ధేశించిన మొత్తానికి కంటే ఎక్కువ ఖర్చు చేసే అభ్యర్థుల ఖాతాపై ఈసీ ఓ కన్నేసింది. భారీ మొత్తంలో డబ్బు రవాణకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది.

‘ఎన్నికల వ్యయ పరిశీలన’ వ్యవస్థ..:
ఎన్నికల కోసం ప్రత్యేకంగా ‘ఎన్నికల వ్యయపరిశీలన’ వ్యవస్థను అమలు చేస్తోంది. ఎన్నికల వ్యయం కోసం ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. రోజు వారీ ఖతాను నిర్వహించాలి. ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు ప్లయింగ్‌ స్కాడ్స్, స్టాటిక్‌ టీములు, వీడీయో సర్వైలైన్‌ టీములు పని చేస్తున్నాయి. బేగంపేట, శంషాబాద్‌ విమానాశ్రయంలో ‘ఎయిర్‌ ఇంటలీజన్స్‌’ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల వ్యయంపై నిరంతర నిఘా కోసం కంట్రోల్‌ రూం, ఫిర్యాదుల పర్వవేక్షణ జరుగుతోంది. అనుమానాస్పద స్థితిలో నగదు ఉపసంహరణ జరిగే ఖాతాలను పరిశీలిస్తున్నారు.

జీరో ఖాతాలపై కన్ను…:
జీరో ఖాతాల్లో ఉన్న ఫలంగా నగదు జమ అయితే వీటిపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. కనీసం రూ. 2 లక్షల నుంచి ఆపై డబ్బు జమ అయిన వెంటనే పరిశీలన చేయవచ్చని తెలుస్తోంది. అన్ని బ్యాంకుల్లోనూ జీరో ఖాతాలు ఎన్ని ఉన్నాయి? ఎవరి ఖాతాల్లో ఎంత డబ్బు జమవుతుందనే వివరాలను ఎప్పటికప్పుడు ఈసీ పరిశీలిస్తుంది.

పరిమితి దాటితే..?:
ఆదాయపన్ను చట్టానికి లోబడి రూ. 49,999 వరకు జరిపే లావాదేవీలకు పాన్‌ కార్డు అవసరం ఉండదు. రూ. 50 వేలకు మించి జరిపే ప్రతి లావాదేవీలపైపా పాన్‌కార్డు తప్పనిసరి. రూ. 50 వేలు దాటితే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినవో అధికారులకు లెక్కలు చూపించాలి. లేకపోతే ఆ నగదుకు సంబంధించిన సరైన ధ్రువ పత్రాలు చూపించాలి. అప్పటి వరకు నగదు అధికారుల వద్దే ఉంటుంది. నగదు కాకుండా బంగారం, మద్యం తదితరవన్నీ నిర్ణీత నిబంధనల ప్రకారం తీసుకెళ్లాల్సి ఉంటుంది.

పట్టుబడిన సొత్తు వివరాలు..:

ఆదిలాబాద్‌ జిల్లా, జైనథ్‌ మండలం, పిప్పరివాడ టోల్‌ప్లాజా వద్ద రూ.10 కోట్లు, హైదరాబాద్‌, అబిడ్స్‌లోని బొగ్గులకుంటలో అతుల్ అనే వ్యాపారి వద్ద నుంచి రూ.2.54 కోట్లు,
సోమవారం రాత్రి మూడు చోట్ల నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా రూ.74.82లక్షల నగదు, సాయినాథ్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 60 లక్షలు, జూబ్లీహిల్స్‌లో రామచంద్రరావు అనే వ్యక్తి దగ్గర రూ.4.85 లక్షల నగదు, బ్రిటిష్ తివారి అనే వ్యక్తి వద్ద రూ.9.97లక్షల నగదు పట్టుబడింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని 27 లక్షల నగదు పట్టుబడింది. సొమ్ము ఆదిబట్ల గ్రామ ఉపసర్పంచ్‌ పల్లె గోపాల్‌ గౌడ్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. అయితే, గోపాల్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుచరుడు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Box Item:

కాసులతో వెళుతున్నారా..
కాస్త జాగ్రత్త
★ ఆధారాలు లేకుంటే అంతే సంగతులు
★ ఎన్నికల కోడ్‌ దృష్ట్యా తప్పని ఇబ్బంది

సొంత డబ్బయినా లెక్క చెప్పాల్సిందే. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుతో సామాన్యులకు ఇబ్బందులు అనివార్యమే. నా సొమ్మే కదా నాకేం అనుకుంటే అధికారుల చుట్టూ తిరగాల్సిందే. ఎవరి డబ్బును ఎక్కడికైనా తీసుకెళ్లే స్వేచ్ఛ ప్రతి ఒక్కరి ఉన్నా కోడ్‌ కూతతో అప్రమత్తం కావాల్సిన తరుణమిది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎన్నికల అధికారులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మరిన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నగదుతో వెళ్లేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని ఎన్నికల విభాగ అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేకుంటే జప్తు చేయడం తథ్యం. ఆధారాలు లేకుంటే అంతే సంగతులు.
విడతల వారీగా తనిఖీ బృందాలు
తనిఖీ బృందాలు అత్యంత పకడ్బందీగా విధులు నిర్వహించనున్నాయి. నాలుగు విభాగాలుగా తనిఖీ బృందాలుండగా ఒక్కో బృందం 24 గంటలు పనిచేయనుండగా మూడు షిప్టులుగా అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు చొప్పున తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన నాయబ్‌ తహసీల్దార్‌, పోలీస్‌ విభాగం నుంచి ఏఏస్సై, కానిస్టేబుల్‌ ఉంటారు.
శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడం రాజకీయ పార్టీలు ప్రచారంలో ముమ్మర వ్యూహరచనతో వెళుతున్నాయి.  నియోజకవర్గాల వారీగా ఎన్నికల అధికారులుండగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ బృందాలు, స్టాటిక్‌ సర్వలైన్‌ టీం, వీడియో వ్యూయింగ్‌ టీంలు, అకౌంటింగ్‌ టీంలుండగా వారి వారి పరిధిలో విధులను నిర్ణయించారు. నియోజకవర్గానికి మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాటి వద్ద రెవెన్యూ, పోలీస్‌ శాఖ అధికారులు, సిబ్బంది ఉంటారు. ఆధారాలు లేకుండా రూ.50వేల కంటే ఎక్కువ మొత్తంలో తీసుకెళితే స్వాధీనం చేసుకుంటారు. ఆదాయ పన్ను శాఖకు జప్తు చేస్తారు. అక్కడి నుంచి నగదును పొందాలంటే కొంచెం కష్టం. ఆధారాలు, వివరణ సరిగా లేకపోతే 30శాతం పన్ను కింద తీసుకుని మిగతాది ఇస్తారు. ఈ నిబంధనలు తెలియక చాలామంది పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్తూ చెక్‌పోస్టుల వద్ద దొరుకుతున్నారు. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్‌ 69-ఎ ప్రకారం ఏ వ్యక్తి అయినా తన వద్ద ఉన్న డబ్బు, బంగారం, ఆభరణాలు ఇతర విలువైన వస్తువులుంటే వాటికి ఆధారం చూపించాలి. సరైన వివరణ ఇవ్వాలని అధికారులు స్పష్టంగా వివరించారు.
తస్మాత్‌ జాగ్రత్త
* రూ.50వేలు దాటితే ఆధారాలు అవసరం. సెల్ఫ్‌చెక్‌ ద్వారా అయితే ఆ చెక్‌ నకలు కాపీ, డబ్బులు విత్‌డ్రా చేస్తే బ్యాంకు అధికారి ఇచ్చిన ఓచర్‌ స్లిప్‌, పాసుబుక్‌ నకలు కాపీ, ఏటీఎం నుంచి తీసుకుంటే మిషన్‌ ద్వారా వచ్చిన స్లిప్‌ వెంట ఉంచుకోవాలి. అదేవిధంగా బ్యాంకులో డిపాజిట్‌ చేయడానికి తీసుకెళ్తున్నట్లుగా వ్యక్తిగత డిక్లరేషన్‌, బ్యాంకు ఖాతా పుస్తకం నకలు కాపీ ఉండాలి.
* ఆసుపత్రికి బిల్లు కట్టడానికి ఎక్కువ మొత్తం తీసుకెళ్తుంటారు. ఆ సమయంలో చికిత్సకు ఇంత మొత్తం ఖర్చు అవుతుందని తెలిపే బిల్లు, అది కాకపోతే ఎస్టిమేషన్‌ కాపీ చూపించాలి.
* అవసర నిమిత్తం రూ.లక్షల్లో అప్పుగా తీసుకుంటారు. వాటిని తీసుకెళ్తున్నపుడు అప్పు ఇచ్చిన వ్యక్తి రాయించుకున్న ప్రామిసరీ నోటు నకలు వెంట తీసుకెళ్లాలి.
* ప్రస్తుతం ఖరీఫ్‌ పంట కొనుగోళ్లు జరుగుతున్నాయి. విపణిలో పంట ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. నగదు తీసుకెళ్లే సమయంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అమ్మకం పట్టీ దగ్గర ఉంచుకోవాలి.
* ఏ రోజుకారోజు చేయాల్సిన కలెక్షన్‌ పద్దుల పట్టిక, బాకీ ఉన్న మొత్తం, ఆ రోజు ఇచ్చిన వారి సంతకం ఉండాలి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close