ముగ్గురూ ముగ్గురే.. తోడుదొంగలే

0

– బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలపై రాహుల్‌ ఫైర్‌

– తెలంగాణలో ఎలక్షన్‌ జైత్రయాత్ర సక్సెస్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దేశాన్ని విభజిస్తూ బీజేపీ పాలిస్తుంటే టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. మహాత్మా గాంధీ, జవహార్‌లాల్‌ నెహ్రూ లాంటి నేతలు జాతి, మతం, ప్రాంతం, లింగ భేదాలు లేకుండా అందరినీ కలుపుకుని స్వాతంత్య్రం కోసం పోరాడగా.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ప్రాంతం, మతం, భాష, కులం అంటూ విధ్వేషాలు రెచ్చగొడుతుందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. నగరంలోని చార్మినార్‌ వద్ద రాజీవ్‌ సద్భావనా యాత్రను ప్రారంభించిన అనంతరం రాహుల్‌ మాట్లాడారు. నోట్లరద్దును మించిన పిచ్చిపని మరొకటి లేదని ఆర్థిక నిపుణులు చెప్పారని గుర్తుచేశారు. తమ వారి వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకోవడానికి మోదీ నోట్లరద్దును వాడుకున్నారని విమర్శించారు. అదే నోట్ల రద్దుతో దేశ ప్రజల్ని ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిల్చోబెట్టారని మండిపడ్డారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. కేవలం కొందరు వ్యక్తులకే ప్రధాని మోదీ సేవకుడని.. అనిల్‌ అంబానీకి పనివాడంటూ ఎద్దేవా చేశారు. ‘ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడే భారత ప్రధాని దొంగ అని చెప్పారు. మోదీ సలహా వల్లే అంబానీ కంపెనీకి కాంట్రాక్ట్‌ దక్కింది. హెచ్‌ఏఎల్‌ కంపెనీని తప్పించి అంబానీకి కాంట్రాక్ట్‌ కట్టబెట్టారు. హెచ్‌ఏఎల్‌ 70 ఏళ్లుగా యుద్ధ విమానాలు తయారు చేస్తోంది. రాఫెల్‌ ఒప్పందం వెనుక 30 వేల కోట్ల కుంభకోణం దాగి ఉంది. పార్లమెంట్‌లో బీజేపీకి మద్దతు తెలిపేది కేసీఆర్‌ ఒక్కరే. వీటికి తోడు ఎంఐఎం కలుస్తుంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు తోడుదొంగలు. మతం, కులం, ప్రాంతం అంటూ ప్రజల మధ్య దూరాన్ని పెంచుతున్న మోదీకి, బీజేపీకి మద్దతు ఎందుకిస్తున్నారని’ ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ అధినేతలను రాహుల్‌ ప్రశ్నించారు. ‘స్వాతంత్య్రం అనంతరం రాజ్యాంగం అమలులోకి వచ్చింది. శాంతి, ప్రేమ, అప్యాయతలతో మెలగాలని రాజ్యాంగం సూచిస్తోంది. హిందూస్తాన్‌గా భారత్‌ను పిలుస్తున్నారు. కానీ రెండు విషయాలు దేశంలో కొనసాగుతున్నాయి. దేశం మొత్తాన్ని మతం, కులం అనే భేదం లేకుండా ఏకం చేయాలని కాంగ్రెస్‌ యత్నిస్తోంది. కానీ కొందరు విభజించు, పాలించు అనే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. కొందరు నీ కులం ఏంటి, మతం ఏంటని అడిగే పరిస్థితి తెచ్చారు. నేడు దేశంలో మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయడుతున్నారని’ మోదీ పాలనను రాహుల్‌ దుయ్యబట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here