కొలువుదీరనున్న 15వ అసెంబ్లీ

0
  • నేటినుండి ఏపీ సమావేశాలు
  • సభలను హుందాగా నిర్వహిస్తాం
  • తొలుత జగన్‌, తర్వాత చంద్రబాబు ప్రమాణం
  • ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

అమరావతి :

నేటినుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 11గంటల 5 నిమిషాలకు 15వ అసెంబ్లీ కొలువదీరనుంది. మొదటి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు స్వాగతం, ప్రొటెం స్పీకర్‌కు అభినందనలు తెలపనున్నారు. ఆ తర్వాతి రోజు అంటే 13న కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం ఉండనుంది. అలాగే 13నే స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. ఇక 14న ఉభయ సభల సంయుక్త సమావేశం జరగనుండగా, అదే రోజు గవర్నర్‌ ప్రసంగం ఉండనుంది. ఇక 14నుంచే శానసమండలి సమావేశాలు జరగనున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్వసాధారణంగా నిర్వహించే తొలి సమావేశాలు జరగనున్నాయి. కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ వెంకట చినప్పలనాయుడు ప్రమాణం చేయించనున్నారు. మొదట ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆ తర్వాత టీడీఎల్పీ నేత చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. 13న స్పీకర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. తర్వాతి రోజు అంటే 14న సమావేశంకానున్న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ నర్సింహన్‌ ప్రసంగించనున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా బుధవారం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, తమ ఆధ్వర్యంలో జరిగే సమావేశాలను హూందాగా నిర్వహిస్తామని ప్రభుత్వ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఎన్నికల మేనిఫెస్టోను అమలుచేసే దిశగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తొలి కేబినెట్‌ భేటీలోనే పలు నిర్ణయాలు తీసుకున్నారని ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి ప్రశంసించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి సమావేశమవుతాయని చెప్పారు. తొలుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారని వెల్లడించారు. గురువారం స్పీకర్‌ గా తమ్మినేని సీతారాంను ఎన్నుకుంటామన్నారు. ఈ నెల 14న ఉభయ సభలను ఉద్దేశించి గర్నవర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. సభను తాము ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిర్వహిస్తామని శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం, స్పీకర్‌ లా కాకుండా హుందాగా వ్యవహరిస్తామని హావిూ ఇచ్చారు. ప్రతిపక్షాన్ని కూడా గౌరవించి సభలో అవకాశం ఇస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులైన తమకు ఛాంబర్‌ కూడా ఇవ్వకుండా అవమానించిందని శ్రీకాంత్‌ రెడ్డి గుర్తుచేశారు. కానీ తాము మాత్రం అందరికీ సరైన ప్రాధాన్యత కల్పిస్తామని తేల్చిచెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here