Featuredజాతీయ వార్తలు

నగరంలో 144 సెక్షన్‌

  • బాబ్రీ మసీదు ఘటనకు 2ఏళ్లు
  • భారీ భద్రతలో హైదరాబాద్‌
  • శాంతిభద్రతలను భగ్నం చేస్తే కఠిన శిక్షలు
  • సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌

6 డిసెంబర్‌ 1992.. భారత సామాజిక, రాజకీయ ముఖ చిత్రం మార్చిన రోజు.. అయోధ్యలోని బాబ్రీ కూల్చివేత జరిగిన రోజు. మతపరంగా చూసినా 1992 బాబ్రీ ఘటన తర్వాత, దేశంలో మతం పేరుతో హింస జరిగింది. బాబ్రీ కూల్చివేత తర్వాత జరిగిన మత ఘర్షణల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఏటా డిసెంబర్‌ 6వ తేదీ వస్తోందంటే, ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉంది. సామాజికంగా చీలిక తెచ్చిన ఈ ఘటన రాజకీయంగానూ కొత్త శక్తులు ఊపందుకోవటానికి తావిచ్చింది. అయితే ఇటీవల అయోధ్య కేసులో సంచలనాత్మక తీర్పు వెలువడిన తరుణంలో.. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజు (1992 డిసెంబరు 6) దగ్గరపడడంతో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో కూడా కొన్ని గ్రూపులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం అందడంతో పాత నేరస్తులపై నిఘా పెంచారు హైదరాబాద్‌ పోలీసులు. సిటీ అంతా భద్రత కట్టుదిట్టం చేశారు. రెండ్రోజుల పాటు 144 సెక్షన్‌ విధించాలని సిటీ పోలీసులు నిర్ణయించారు. హైదరాబాద్‌లో డిసెంబరు 5వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ వెల్లడించారు. బాబ్రీ మసీదును కూల్చివేసిన ఘటనకు శుక్రవారం నాటితో 27 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత, రామమందిరం నిర్మాణం.. వంటి అంశాల్లో ఈ సారి డిసెంబర్‌ 6వ తేదీ.. ప్రత్యేకత సంతరించుకుంది. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద భూమి రామ్‌ లల్లా విరాజ్‌ మాన్‌ కు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, దీన్ని సవాలు చేస్తూ జమాతె ఉలేమా-ఇ-హింద్‌ రివ్యూ పిటీషన్‌ దాఖలు చేయడం వంటి సంఘటనలు తోడు కావడంతో ఇదివరకు ఎప్పుడూ లేని ప్రత్యేకత ఈ సారి డిసెంబర్‌ 6వ తేదీకి ఏర్పడింది. ముస్లిం సామాజిక వర్గం అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చే రోజు శుక్రవారం. శుక్రవారం పూట వారు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తుంటారు. అదే రోజు బ్లాక్‌ డే రావడం కూడా 144 సెక్షన్‌ ను విధించడానికి ఓ కారణమైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ పాతబస్తీలోని మక్కా మసీదు సహా పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల తరువాత 144 సెక్షన్‌ను ఎత్తేస్తామని, ఈ మధ్యకాలంలో ఎవరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తమకు ఇంటెలిజెన్స్‌ అధికారుల నుంచి పక్కా సమాచారం అందిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని 144 సెక్షన్‌ ను విధించడంతో పాటు.. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతలను భగ్నం చేయడానికి ప్రయత్నించే ఏ ఒక్కర్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

బాబ్రీ మసీదుని కూల్చిన వారందరినీ జైలుకి పంపండి : ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చిన వారందరినీ జైలుకు పంపాలని అన్నారు. మసీదు కూల్చివేత ఘటనపై వెంటనే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజుగా చెప్పారు. ఆ రోజును బ్లాక్‌ డే గా పాటించనున్న నేపథ్యంలో మెహిదీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో అక్బరుద్దీన్‌ ఈ కామెంట్స్‌ చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదు పునర్‌ నిర్మాణం కోరుతూ డిసెంబర్‌ 6న ప్రార్థనలు.. ప్రజాస్వామ్య, శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలిపాలని ముస్లింలకు అక్బరుద్దీన్‌ పిలుపునిచ్చారు. అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు నిర్ణయాన్ని అక్బరుద్దీన్‌ స్వాగతించారు. అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం మరో చోట ఇస్తామన్న 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమి కూడా తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు నవంబర్‌ 9న చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమి హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని రామజన్మ భూమిగా గుర్తిస్తూ అక్కడ రామాలయం నిర్మించాలని చెప్పింది. కాగా, ఈ తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సవాల్‌ చేయాలని నిర్ణయించింది. తీర్పును పున: సమీక్షించాలని కోరనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్‌ ను దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. డిసెంబర్‌ మొదటి వారంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్‌ దాఖలు చేయనున్నట్లు వెల్లడించింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close