100శాతం వీవీప్యాట్లు లెక్కించాలి

0

  • వీవీప్యాట్ల లెక్కింపునకు వెనకడుగేల?
  • విపక్షాల విమర్శలకు ఈసీ రియాక్షన్‌ ఏంటి..?
  • ఈసీతో ముగిసిన విపక్ష నేతల సమావేశం

కేంద్ర ఎన్నికల సంఘంతో 21 విపక్ష పార్టీల నాయకుల భేటీ ముగిసింది. దాదాపు గంటపాటు ఈసీతో విపక్ష నేతలు చర్చించారు. ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో చర్చించిన ఎన్డీయేతర పార్టీల నేతల బృందం ఆ తర్వాత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను కలిసింది. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్‌ స్లిప్పులు, ఈవీఎంల లెక్కింపులో తేడావస్తే నియోజకవర్గంలోని మొత్తం స్లిప్పులు లెక్కించాలని డిమాండ్‌ చేసినట్టు సమాచారం. సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీ సందర్భంగా 8 పేజీల మెమోరాండాన్ని నేతలు సీఈసీకి అందజేశారు. ఈ మెమోరాండంలో పలు అంశాలను కీలకంగా పొందుపరిచారు. ఏప్రిల్‌ 8న సుప్రీంకోర్టు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 5వీవీప్యాట్లు లెక్కించాలని ఇప్పటికే ఆదేశించిందని నేతలు గుర్తుచేశారు. చివరి రౌండ్‌ ఈవీఎంల లెక్కింపు పూర్తికాకుండానే వీవీప్యాట్లు లెక్కించాలని డిమాండ్‌ చేశారు. లెక్కింపు ముగిసే వరకు ఈవీఎంలు, వీవీప్యాట్లు కౌంటింగ్‌ కేంద్రంలోనే ఉంచాలని కోరినట్టు తెలుస్తోంది. 100శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని తాము ఈసీని కోరినట్లు విపక్ష నేతలు తెలిపారు. ప్రతిపక్షాల విజ్ణప్తులను ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. 5 వివి ప్యాట్‌ స్లిప్పులను మాత్రమే లెక్కించడం సరికాదని కాంగ్రెస్‌ నేత ఆజాద్‌ అన్నారు. దాదాపు నెలన్నరగా ఈ విషయాలను తాము లేవనెత్తుతున్నామని, ఎందుకు బలంగా దీనిపై స్పందించలేదని తాము ఈసీని అడిగామని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ సింగ్వీ తెలిపారు. బుధవారం మరోసారి తమతో సమావేశమవుతామని ఈసీ హావిూ ఇచ్చిందని ఆయన తెలిపారు. వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో సరైన మార్గదర్శకాలను రిటర్నింగ్‌ అధికారులు, కౌంటింగ్‌ అధికారులకు ఇవ్వకపోవడాన్ని విపక్ష నేతలు సీరియస్‌గా ప్రస్తావించినట్టు సమాచారం. ఈవీఎంలను ట్యాంపర్‌ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారని, వీవీప్యాట్లు లెక్కించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెనకడుగు వేయడానికి కారణాలేంటని నిలదీసినట్టు సమాచారం. వీవీప్యాట్ల కౌంటింగ్‌లో ఎందుకు ఇప్పటివరకు నియమనిబంధనల్ని రూపొందించలేదని ప్రశ్నించాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఐదు వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో ఈసీ ఎందుకు వెనకాడుతోందని నిలదీసినట్టు సమాచారం.

మాజీ సీఈసీ ఖురేషి కూడా తమ అభ్యంతరాలను ఆమోదించారని, గత కొన్ని రోజులుగా తాము ఈసీని కలిసి వీవీప్యాట్‌ విషయం విజ్ణప్తి చేస్తున్నామని, సుప్రీంకోర్టుకు కూడా వెళ్లామని, ఐదు వీవీప్యాట్‌ లు మెదట్లోనే లెక్కించాలని, ఏదైనా ఇబ్బంది తలెత్తితే అసెంబ్లీ సెగ్మెంట్‌ లోని మొత్తం వీవీప్యాట్‌ స్లిప్‌ లను కౌంట్‌ చేయాలని, ఎలక్షన్‌ కమిషన్‌ కు దీనిపై ఏంటి సమస్య అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మాజీ సీఈసీ ఖురేషి కూడా తమ అభ్యంతరాలను ఆమోదించారని బాబు తెలిపారు. మంగళవారం మాజీ రాష్ట్రపతి కూడా ఎలక్షన్‌ కమిషన్‌ పారదర్శకత పాటించాలని, భారతీయ ఓటర్లలో విశ్వాసం పెంచాలని అన్నారని బాబు తెలిపారు. ప్రజల ఇచ్చిన తీర్పుని గౌరవించాలని తాము కోరుతున్నామని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పు మార్చబడకూడదని ఆయన అన్నారు. బాధ్యతగల రాజకీయ పార్టీలుగా కంటిన్యూగా తాము పోరాడుతున్నామని, ఎలక్షన్‌ కమిషన్‌...ఒక బ్లడ్‌ శాంపిల్‌ టెస్ట్‌ సరిపోతుందని చెప్పిందని, అయితే ఆ బ్లడ్‌ శాంపిల్‌ మొత్తం శరీరమంతా పొల్యూషన్‌ ఉందని చూపిస్తుందని, ఇప్పుడు తాము బాడీ స్కానింగ్‌ కు వెళ్లాలని, అదే తాము ఈసీని కోరుతున్నామని ఆయన తెలిపారు.మరోసారి ప్రతిపక్ష నాయకులందరం చర్చించి ఏం చేయాలనే దానిపై నిర్ణయిస్తామని బాబు తెలిపారు. తాము లేవనెత్తిన సమస్యలు చిన్నవి కావని, ఈసీ వెంటనే పరిష్కారం చూపకుంటే, సమస్య మరింత పెద్దది అవుతుందని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని, విపక్షాలు లేవనెత్తిన ఏ అంశాన్ని కూడా పట్టించుకోలేదంటూ నిలదీసిన ఎన్డీయేతర పార్టీలు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ముందు నిరసన వ్యక్తంచేశారు. అయితే ఎన్డీయేతర పార్టీలు లేవనెత్తిన అంశాలపై రేపు చర్చించనున్నట్లు ఈసీ హావిూ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసీ అఫీషియల్‌ రియాక్షన్‌ తర్వాతే విపక్షాలు భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఏ పార్టీకి ఓటేసినా ఒకే పార్టీకి పడుతుందని చెప్పాం: ఆజాద్‌

గంటన్నర పాటు సమావేశమై ఈసీతో చర్చించినట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ తెలిపారు. ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ”ఈవీఎంలలో సమస్యలు ఉన్నాయని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఈవీఎంల్లో లోపాలున్నాయని.. ఏ పార్టీకి ఓటు వేసినా ఒకే పార్టీకి పడుతుందని వివరించాం. ఈసీ వద్ద మేం ప్రధానంగా రెండు మూడు అంశాలు ప్రస్తావించాం. ఒక శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఐదు వీవీప్యాట్‌ స్లిప్పుల్ని యాదృచ్చికంగా లెక్కించాలని సుప్రీం కోర్టు సూచించింది.అయితే, మొదట ఈవీఎంల లెక్కింపు చేపట్టిన తర్వాత వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కిస్తామని ఈసీ కొత్త వాదన తెరపైకి తెచ్చింది. అందుకే 22 పార్టీలు ఒప్పుకోలేదు. అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 వీవీప్యాట్‌ స్లిప్పులు ముందుగా లెక్కించాలని డిమాండ్‌ చేశాం.వాటిలో తేడా వస్తే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వీవీప్యాట్‌ స్లిప్పులన్నీ లెక్కించాలి. తర్వాత చేసినా ఉపయోగం ఉండదు” అన్నారు.

100శాతం స్లిప్పులు లెక్కించాలనేదే మా డిమాండ్‌: సింఘ్వీ

గత నెలన్నరగా లేవనెత్తిన అంశాలనే మళ్లీ ఈసీకి చెప్పామని, తాము చేసిన ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించినట్టు కాంగ్రెస్‌కు చెందిన మరో నేత అభిషేక్‌ మను సింఘ్వీ అచెప్పారు. సుమారు గంటపాటు తాము చెప్పిన విషయాలను ఈసీ విన్నారన్నారు. 100శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలనేదే తమ ప్రధాన డిమాండ్‌ అని ఆయన వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here