– రైతుబంధుపథకం కింద ఎకరాకు 10వేలు

0
  • నేరుగా అకౌంట్‌లో జమా..
  • రాష్ట్రంలో 1.43 కోట్ల ఎకరాల భూమి
  • పథకం పర్యవేక్షణకు కమిటీలు
  • ఉత్తర్వులు ఇచ్చిన వ్యవసాయ శాఖ కార్యదర్శి

తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పెంచిన రైతుబందుపథకం మొత్తాన్ని అమలుచేసేందుకు రంగం సిద్దం చేసింది. గతంలో ఎకరాకు 8వేలుగా ఉన్న మొత్తాన్ని అపవేలకు పెంచుతూ ఇచ్చిన ఆదేశాలమేరకు రైతుబంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.6900 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిధులు విడుదలకు సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచుతూ గతంలో ఇచ్చిన హావిూకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఒక పంటకు రూ.5వేలు అందించనున్నారు. త్వరలో వర్షాకాల సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సాయాన్ని రైతులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ఈ రోజు నిధులు మంజూరు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్‌ ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ నెల 7, 8 తేదీల్లో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల పరోక్ష ఎన్నిక జరిగిన అనంతరం రైతుబంధు సాయాన్ని పంపిణీచేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మొత్తాన్ని విడుదల చేసే తేదీలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది.

ఖరీఫ్‌, రబీ పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైతుబంధు అమలు మార్గదర్శకాలను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి విడుదలచేశారు. గతేడాది సీజన్‌కు ఎకరానికి రూ.4 వేలు ఇవ్వగా, ఈ వానకాలం నుంచి దానిని రూ.5 వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హావిూఇచ్చారు. అందుకోసం రెండు సీజన్లకు కలిపి బడ్జెట్లో ఇప్పటికే రూ.12 వేల కోట్లు కేటాయించారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం ఈ వానకాలం నుంచి పెంచిన సొమ్మును ప్రతి రైతుకు అందజేస్తారు. ఆర్బీఐకి చెందిన ఈ-కుబేర్‌ ద్వారా ప్రతి రైతు ఖాతాలోకి వారికున్న పట్టా భూమి ప్రకారం పెట్టుబడి సాయం జమచేస్తామని పార్థసారథి తెలిపారు. పట్టాదార్‌ పాస్‌పుస్తకం ఉన్న రైతులు, ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టా ఉన్న వారందరికీ ప్రభుత్వం రైతుబంధు సొమ్ము అందజేస్తుంది. తమకు పెట్టుబడి సాయం వద్దనుకునే రైతులెవ రైనా ఉంటే.. గివ్‌ ఇట్‌ అప్‌ ఫారాన్ని మండల వ్యవసాయ విస్తరణాధికారికి ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అలా మిగిలిన పెట్టుబడి సొమ్మును తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితికి అందజేస్తారు. గివ్‌ ఇట్‌ అప్‌పై రైతుల్లో విరివిగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. రైతులకు పంటసాయం అందించేందుకు ఉద్దేశించిన రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 మే10న కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో ప్రారంభించారు. సీజన్‌ ప్రారంభానికి ముందు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగు కూలీ ఖర్చులకోసం అన్నదాతలకు ఈ సాయం ఉపయోగపడాలన్నదే సర్కారు ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా 1.43 కోట్ల ఎకరాల వ్యవసాయయోగ్యమైన భూమి ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. 58.33 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల్ని అందజేసింది. రాష్ట్రంలో వానకాలంలో సాధారణ సాగు 1.08 కోట్ల ఎకరాలైతే, యాసంగిలో 31.92 లక్షల ఎకరాలు ఉంటున్నది.

2018-19 సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.4 వేలు చొప్పున వానకాలంలో 51.50 లక్షల మంది రైతులకు రూ.5,260.94 కోట్లు, యాసంగిలో 49.03 లక్షల మంది రైతులకు రూ.5,244.26 కోట్లు అందజేశారు. రాష్ట్రంలో పంట పెట్టుబడి పథకం వల్ల 90.5 శాతంగా ఉన్న పేద రైతులు లబ్ధి పొందారు.

పథకం పర్యవేక్షణకు కమిటీలు

ఈ ఏడాది రైతుబంధును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం.. రాష్ట్ర, జిల్లాస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్రకమిటీలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా, కమిషనర్‌ కన్వీనర్‌గా, మరో ముగ్గురు సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ పర్యవేక్షణలో జిల్లా వ్యవసాయాధికారి ఈ పథకాన్ని అమలుచేస్తారు. ఫిర్యాదులను స్వీకరించే కమిటీలను కూడా సర్కారు ఏర్పాటుచేసింది. మండల, డివిజన్‌, జిల్లాస్థాయిలో ఫిర్యాదుల కమిటీలను కలెక్టర్‌ ఏర్పాటుచేస్తారు. రాష్ట్రస్థాయిలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటవుతుంది. ఫిర్యాదులను నెలరోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ-కుబేర్‌ ద్వారా రైతులకు అందిన సాయంపై ఆడి ట్‌ కూడా ఉంటుంది. ఆర్బీఐ, నాబార్డ్‌, కాగ్‌ నిబంధనల ప్రకారం ఆడిట్‌ జరుగుతుంది. కాగ్‌ లేదా ఆర్బీఐకి చెందిన ఆడిటర్లు ఆడిట్‌ నిర్వహించే అవకాశం ఉన్నదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here