Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

హుజూర్‌నగర్‌.. ఎవరికి సొంతం

హస్తం అల్లకల్లోలం..

  • కాంగ్రెస్‌ కలహం కారు కలిసొచ్చేనా..
  • ఆచితూచి అడుగులు వేస్తోన్న బీజేపీ

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సొంత నియోజక వర్గం హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక తేదీ ఖరారైంది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ స్థానం ఖాళీగా ఉండటంతో.. శనివారం ఎన్నికల కమిషన్‌ ఈ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్‌ 21న ఎన్నిక జరుగుతుంది. మూడ్రోజుల్లోనే అంటే, 24న ఫలితాలను వెల్లడిస్తామని సీఈవో రజత్‌ కుమార్‌ షెడ్యూల్‌ ని ప్రకటించారు. ఈ నెల 23 నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ తెరాస నుంచి సైదిరెడ్డిని అభ్యర్థిగా మరోసారి ఎంపిక చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విూద స్వల్ప ఓట్ల తేడాలో ఆయన ఓడిపోయారు. ఈసారి కూడా సైదిరెడ్డికే అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్‌. ఈ ఉప ఎన్నికల బాధ్యతల్ని మంత్రి హరీష్‌ రావుకి అప్పగిస్తారని మొదట్నుంచీ అందరూ అనుకున్నా? మరో మంత్రి జగదీష్‌ కి ఈ వ్యవహారాలను సీఎం అప్పగించినట్టు సమాచారం. అవసరమైతే మరికొందరు మంత్రులు, చుట్టుపక్కల నియోజక వర్గాల ఎమ్మెల్యేలు ఆయనకి సహాయం చేయాల్సి ఉంటుందని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఈ స్థానం ఎవరికి చిక్కుతుంది. హస్తానికి ఇది నియోజకవర్గం కంచుకోట లాంటింది. మరి ఈ కంచుకోటను కారు పార్టీ బద్దలు కోడుతుందా..? లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈసీ షెడ్యూల్‌ విడుదలకు ముందే కేసీఆర్‌ తన పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో ప్రతిపక్షాలకు సవాల్‌గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డిని టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్‌ ప్రకటించారు. అయితే తొలుత ఈ స్థానం నుంచి నిజామాబాద్‌ మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత బరిలోకి దిగనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అధినాయకుడు కేసీఆర్‌ మాత్రం అభ్యర్థి ప్రకటనలో జాప్యం చేయకుండా సైదిరెడ్డిని ప్రకటించారు. అయితే గత మూడు పర్యాయాలుగా ఇక్కడ టీఆర్‌ఎస్‌ గెలవలేదు. దీంతో ఈ సారి ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. అయితే గతంలో 2009, 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతుంటే.. ఇదే స్థానం నుంచి టీపీసీసీ రథసారథి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాత్రం గెలుస్తూ హ్యాట్రిక్‌ సాధించారు. అయితే అనివార్య కారణాల వల్ల నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలవడంతో.. అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌ నగర్‌ స్థానంలో మొత్తం 16 మంది పోటీచేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి 92,996 ఓట్లు రాగా.. రెండో స్థానంలో టీఆర్‌ఎస్‌ నిలిచింది. టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దిగిన శానంపూడి సైదిరెడ్డికి 85,530 ఓట్లు వచ్చాయి. అయితే కేవలం 7466 ఓట్ల తేడాతోనే ఓటమిపాలయ్యారు. ఇక స్వతంత్య్ర అభ్యర్థి రఘుమారెడ్డి 4,955 ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. ఇక సీపీఎం పార్టీకి 2,121 ఓట్లు రాగా, బీజేపీకి కేవలం 1,555 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇక 2014, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. 2014 ఎన్నికల్లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ కు 69879 ఓట్లు రాగా టీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగిన శంకరమ్మకు 45,955 ఓట్లు వచ్చాయి. దీంతో 23వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో ఉత్తమ్‌ గెలుపొందారు. అంతేకాదు 2009 ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ ఓటమిపాలైంది. అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి 80,835 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన జగదీష్‌ రెడ్డి (ప్రస్తుత మంత్రి) కి 51,641 ఓట్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్‌ సతీమణి పద్మావతి పేరు దాదాపు ఖరారు కావడంతో.. పోటీ ¬రా¬రిగా ఉండనుంది. అయితే అధికార పార్టీ ఈ సారి ప్రతిష్టాత్మకంగా హుజూర్‌ నగర్‌ ఎన్నికను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ సారి ఉత్తమ్‌ కంచు కోటను బద్దలు కొట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు కూడా లేకపోవడంతో.. హుజూర్‌ నగర్‌ గెలుపును మంత్రుల చేతిలో పెట్టబోతున్నట్లు సమాచారం. అందుకోసం ప్రతి మండలానికి ఓ మంత్రిని ఇంచార్జ్‌గా బాధ్యతలు ఇస్తే.. హుజూర్‌ నగర్‌ గెలుపు ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌లో ఉన్న వర్గ బేధాలను అవకాశంగా మార్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడితే.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయన్న ఆలోచనతో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. మరి హుజూర్‌ నగర్‌ ప్రజల మనసులో ఏం ఉందో.. కారును పరిగెత్తిస్తారా.. లేక హస్తానికి షాకిస్తారా.. అన్నది మరో నెల రోజుల్లో తేలుతుంది.

కాంగ్రెస్‌లో కలహాలే తెరాసకు బలమౌతుందా..?

కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్‌ సతీమణి పద్మావతి బరిలోకి దిగుతున్నట్టు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటన అధికారికంగా ఇంకా వెలువడలేదు. పద్మావతి అభ్యర్థిత్వంపై ఎంపీ రేవంత్‌ రెడ్డి విభేదించారు. ఆ పంచాయితీ మరో పక్క అలానే ఉంది. అయితే, ఉత్తమ్‌ కి మద్దతుగా జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిలు జిల్లాలో ఏకమయ్యారు. రేవంత్‌ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని హైకమాండ్‌ కి కూడా చెప్పినట్టు సమాచారం. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి అభిప్రాయాన్ని కాదని పద్మావతిని కొనసాగిస్తారో, ఈ విషయంలో రేవంత్‌ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారో ఇంకా తేలాల్సి ఉంది. కాంగ్రెస్‌ లో నెలకొన్న ఈ కలహాలే ఇప్పుడు తెరాసకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ లో ఈ లొల్లి విూదనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ లో సైదిరెడ్డితో చర్చించినట్టు సమాచారం. వెంటనే, ప్రచారం ప్రారంభించాలనీ, కాంగ్రెస్‌ పార్టీలోని పరిస్థితిని ప్రజలకు వివరించాలని సూచించినట్టు చెబుతున్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి కాబట్టి, వారి ప్రచారం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా సాగే అవకాశం ఉండదనీ, ఈ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవాలని ఇతర నేతలకు కూడా సూచించారట! మొత్తానికి, కాంగ్రెస్‌ ఇంటి పోరును హైలెట్‌ చేసే ప్రయత్నంలో తెరాస ఉందనేది అర్థమౌతోంది. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ అర్థం చేసుకుంటుందా, లేదంటే అంతర్గత కుమ్ములాటలతోనే కాలయాపన చేస్తుందా అనేది చూడాలి.

ఆచితూచి అడుగులు వేస్తోన్న బీజేపీ

తెలంగాణాలో ఆధిక్యతను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న బీజేపీ కూడా తమ అభ్యర్ధి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. గత డిసెంబర్‌ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్ధానాలకు పోటీచేసినా ఒకే ఒక్క స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఆతర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్దానాల్లో విజయం సాధించి అధికార టీఆర్‌ఎస్‌,ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలకు షాకిచ్చింది. తాజాగా జరుగుతున్న హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో కూడా తమ అభ్యర్ధిని పోటీకి దించి తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించగా బీజేపీ మాత్రం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో గతం లో ఇదే స్దానం నుంచి పోటీచేసిన భాగ్య రెడ్డి, వృత్తి రీత్యా వైద్యుడైన కోట రామారావుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అదే సమయంలో మైక్‌ టీవీ అధినేత అప్పి రెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నారు. అయితే అప్పిరెడ్డికి బీజేపీలో సభ్యత్వం లేకపోవడం మైనస్‌గా మారింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్‌ ఇచ్చే విషయంలో కూడా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close