Featuredవార్తలు

సిటీ స‌మ‌న్వ‌య స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు 
 గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని కంటోన్మెంట్ ప‌రిధి వెలుప‌ల నిర్ణీత ప్రాంతంలో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు నిర్మించేవారు త‌ప్ప‌నిస‌రిగా కంటోన్మెంట్ నుండి నిరభ్యంత‌ర ప‌త్రం (ఎన్‌.ఓ.సి) తీసుకున్న అనంత‌ర‌మే భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులను మంజూరుచేయాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. శ‌నివారం నాడు సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో సిటీ స‌మ‌న్వ‌య స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్‌, సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వి.సి.స‌జ్జనార్‌,  తెలంగాణ పారిశ్రామిక మౌలిక స‌దుపాయాల సంస్థ ఎండి వెంక‌ట‌న‌ర్సింహారెడ్డి, సి.పి.డి.సి.ఎల్ ఎండి ర‌ఘుమారెడ్డి, హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల జాయింట్ క‌లెక్ట‌ర్లు ర‌వి, హ‌రీష్ త‌దిత‌ర విభాగాల ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలో వివిధ శాఖ‌ల ద్వారా చేప‌డుతున్న మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ఇత‌ర అభివృద్ది కార్య‌క్ర‌మాల విష‌యంలో మ‌రింత స‌మ‌న్వ‌యంతో ప‌నుల‌ను స‌కాలంలో పూర్తిచేయాల‌ని నిర్ణ‌యించారు. కంటోన్మెంట్‌లో ఆర్మీకి సంబంధించిన ఎన్నో సున్నిత, భ‌ద్ర‌తాప‌ర‌మైన అంశాలు ఉన్నందున కంటోన్మెంట్ స‌రిహ‌ద్దుల వెంట బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తులు జారీచేసే స‌మ‌యంలో ఆర్మీ నుండి ఎన్‌.ఓ.సి తీసుకోవ‌డంలేద‌ని, త‌ద్వారా భ‌ద్ర‌త ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని ఆర్మీ అధికారులు ఈ స‌మావేశంలో లేవ‌నెత్తారు. దీంతో నిబంధ‌న‌ల మేర‌కు ఇక నుండి కంటోన్మెంట్ స‌రిహ‌ద్దుల్లో భారీ నిర్మాణాల‌కు కంటోన్మెంట్ అధికారుల నుండి ఎన్‌.ఓ.సి జ‌త‌ప‌ర్చిన అనంత‌ర‌మే అనుమతుల‌ను జారీచేయాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ టౌన్‌ప్లానింగ్ అధికారుల‌కు తెలిపారు. హైటెక్ సిటీ వ‌ద్ద చేప‌డుతున్న‌ నాలుగు లైన్ల రైల్వే అండ‌ర్ బ్రిడ్జి నిర్మాణానికి ఆటంకంగా ఉన్న జ‌ల‌మండ‌లి పైప్‌లైన్లు తొల‌గించడంతో పాటు ఆ ప్రాంతంలో నీటి నిల్వ‌ల‌ను కూడా తొల‌గించాల‌ని రైల్వే అధికారులు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌ను కోరారు. దీంతో రైల్వే అండ‌ర్ బ్రిడ్జి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న పైప్‌లైన్‌ను తొల‌గించ‌డానికి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌ల‌మండ‌లి అధికారుల‌ను దాన‌కిషోర్ ఆదేశించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాల సంద‌ర్భంగా నీటి నిల్వ‌ల (వాట‌ర్ లాగింగ్‌) కేంద్రాల‌ను గుర్తించామ‌ని, ఈ వాట‌ర్ లాగింగ్ కేంద్రాల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించ‌డంతో పాటు న‌గ‌ర‌వాసుల‌కు ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి న‌గ‌రంలోని ప్ర‌తి రెండు స‌ర్కిళ్ల‌కు ఒక సీనియ‌ర్ అధికారిని ప‌ర్య‌వేక్ష‌క అధికారులుగా నియ‌మించామ‌ని దాన‌కిషోర్ పేర్కొన్నారు. మాన్సూన్ మానిట‌రింగ్ అధికారిగా పిలిచే ఈ అధికారులు త‌మ‌కు కేటాయించిన స‌ర్కిళ్ల‌లో వాట‌ర్ లాగింగ్ ఇత‌ర వ‌ర్షానికి సంబంధించిన స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల‌ను గుర్తించ‌డం, వాటిని పూర్తిగా తొల‌గించేందుకు సంబంధిత క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. న‌గ‌రంలో అత్య‌ధికంగా ట్రాఫిక్ సంబంధిత అంశాలే ఎక్కువ‌గా సిటీ స‌మ‌న్వ‌య స‌మావేశంలో వ‌స్తున్నందున ఇక నుండి ప్ర‌తి 15రోజుల‌కు ఒక సారి ట్రాఫిక్‌, జీహెచ్ఎంసీ త‌దిత‌ర సంబంధిత శాఖ‌ల అధికారులు ప్ర‌త్యేకంగా స‌మీక్ష స‌మావేశాలను నిర్వ‌హించుకోవాల‌ని క‌మిష‌న‌ర్ సూచించారు. న‌గ‌రంలో వివిధ అభివృద్ది ప‌నుల‌కు అనుమ‌తి మంజూరు చేసేందుకుగాను హైద‌రాబాద్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ భారీ మొత్తంలో ప‌రిహారాన్ని అందించాల‌ని కోరుతుంద‌ని, ఈ అంశాన్ని మ‌రోసారి ప‌రిశీలించాల్సిందిగా ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలో వ‌ర్షాకాల విప‌త్తులను ఎదుర్కునేందుకు జీహెచ్ఎంసీ రూపొందించిన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి స‌మావేశంలో వివ‌రించారు. ఈ స‌మావేశంలో జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి, ట్రాఫిక్ పోలీస్‌, సి.పి.డి.సి.ఎల్, కంటోన్మెంట్‌, రోడ్డు భ‌వ‌నాలు, హైద‌రాబాద్ మెట్రో రైలు త‌దిత‌ర శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close