Featuredజాతీయ వార్తలు

శివసేనకు ‘చే’యూత

  • సర్కార్‌ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులు
  • మద్దతు ఇచ్చేందుకు సోనియా నిర్ణయం

ముంబై

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు శివసేన వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే సేనకు మద్దతునిచ్చేందుకు ఎన్సీపీ అంగీకరించగా.. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

శివసేన ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతునివ్వాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతోమహారాష్ట్ర రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది.కాంగ్రెస్‌ పార్టీ శివసేనకు మద్దతు తెలిపడంతో పాటు బయట నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సోనియా గాంధీ అంగీకరించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీతో భేటీ అయ్యి శివసేనకు మద్దతు అంశంపై చర్చించారు. ప్రభుత్వానికి బయటనుంచి మద్దతివ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) శివసేనకు మద్దతు ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో శివసేన- ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయింది. అంతకుముందు సోనియాగాంధీ నివాసంలో పార్టీ అగ్రనాయకులు భేటీ అయి.. మహారాష్ట్ర పరిణామాలు, శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతునిచ్చే అంశంపై చర్చించారు. సోనియా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఏకే ఆంథోని, అహ్మద్‌ పటేల్‌ వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ భేటీ జరుతుండగానే శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే సోనియాగాంధీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. శివసేన ప్రభుత్వానికి మద్దతునివ్వాల్సిందిగా ఈ సందర్భంగా సోనియాను ఠాక్రే కోరారు. అయితే, సేనతో చేతులు కలిపే విషయంలో కాంగ్రెస్‌ అధినాయకత్వం అంత సుముఖంగా లేకపోయినా.. మహారాష్ట్ర పీసీసీ ఒత్తిడికి తలొగ్గి.. సేనకు మద్దతునిచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు గవర్నర్‌ ఆహ్వానం మేరకు శివసేన నేతలు ఆదిత్య ఠాక్రే, ఏక్‌నాథ్‌ షిండే గవర్నర్‌ను కలిసి వారి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ఇక, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమిపై బీజేపీ చిటపటలాడుతోంది. ఒకప్పుడు బాబా సాహెబ్‌ సేనగా ఉన్న శివసేన ఇప్పుడు సోనియా సేనగా మారిపోయిందంటూ బీజేపీ నేత మినాక్షి లేఖి ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఎమ్మెల్యేలతోనూ మాట్లాడిన సోనియా

సోమవారం దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీలోనే శివసేనతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వంలో చేరాలా? లేదంటే బయటి నుంచే మద్దతు ఇవ్వాలా? అనే అంశంపై సోనియా గాంధీ నేతృత్వంలో నేతలు కీలక మంతనాలు చేశారు. ఇదే విషయంపై జైపూర్లోని రిసార్ట్స్‌లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలతోనూ సోనియా గాంధీ మాట్లాడారు. వారంతా ఇందుకు అంగీకరించారు.

మహా రాజకీయాల్లో ఎన్ని మలుపులో..!

మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర శాసనసభకు అక్టోబర్‌ 21న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భాజపా, శివసేన కలిసి ‘మహాయుతి’ కూటమిగా ప్రజల్లోకి వెళ్లాయి. అలాగే, కాంగ్రెస్‌ – ఎన్సీపీ కూడా కూటమిగానే బరిలోకి దిగాయి. అక్టోబర్‌ 24న వెల్లడైన ఫలితాల్లో భాజపా 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 స్థానాలు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్ను (145 స్థానాలు) ఏ పార్టీ కూడా సాధించలేకపోయింది. భాజపా, శివసేన కూటమిగా ఎన్నికల బరిలో దిగినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాత్రం ఇరు పార్టీల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరాఠా రాజకీయాల్లో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. సీఎం పదవీ కాలం చెరిసగం పంచుకోవడంపై తలెత్తిన వివాదంపై దాదాపు మూడు వారాలుగా ఈ రెండు కాషాయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోగా.. నేతల మధ్య మాటామాటా పెరగడంతో మరింత దూరం పెరిగింది. ఆరెస్సెస్‌ రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. దీంతో భాజపా అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటుచేయలేకపోయింది. గవర్నర్ను కలిసిన భాజపా నేతలు ఇదే విషయాన్ని స్పష్టంచేయడంతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ఆహ్వానించారు. దీంతో సైద్ధాంతికంగా సారూప్యత లేకపోయినప్పటికీ శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ల మద్దతును కోరింది. అనేక మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయం సోమవారం రోజున ఈ మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో ఎట్టకేలకు ‘మహా’ ప్రతిష్టంభనకు తాత్కాలికంగా తెరపడినట్టయింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close