వానమ్మ.. వానమ్మ.. వానమ్మ.. ఒక్కసారన్న వచ్చిపోవే..

48గంటల్లో రాయలసీమకు.. తెలంగాణకు జూన్ 20న రుతుపవనాల రాక..!
కొన్ని రోజులుగా మురిపిస్తున్న నైరుతి రుతుపవనాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా కదులుతున్నాయి. అసలే ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించిన రుతుపవనాల గమనానికి ‘వాయు’ తుఫాన్ తోడు కావడంతో విస్తరణకు అడ్డంకిగా మారింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు జూన్ 20వ తేదీన ప్రవేశించే అవకాశాలున్నాయని భారతదేశ వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. అదే విధంగా ఏపీ రాష్ట్రంలో జూన్ 18వ తేదీన ప్రవేశించే ఛాన్స్ ఉందని తెలిపింది. వాయు తుపాన్ కారణంగా రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం జరుగుతోందని.. జూన్ 13న తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించాల్సి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రుతుపవనాల కదిలికలను బట్టి జూన్ 18వ తేదీన తెలంగాణకు విస్తరిస్తాయన్నారు. జూన్ 18వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండలు విపరీతంగా ఉండనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 2014, 16లలో మాత్రం చాలా ఆలస్యంగా జూన్ 19, 20వ తేదీల్లో రాష్ట్రాన్ని తాకాయి. అయినప్పటికీ 2016లో వర్షపాతం పై ఏ మాత్రం ప్రభావం పడలేదు. ఆ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదయింది.
48గంటల్లో రాయలసీమకు రుతుపవనాలు
ఉక్కపోతతో, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపిచింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు 48 గంటల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత వర్షాలు కురుస్తాయని, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని చెప్పింది. రుతుపవనాలు తొలుత రాయలసీమలో ప్రవేశిస్తాయని, 24 గంటల్లో ఉత్తర కోస్తాకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం కేరళను దాటి కర్నాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. 48 గంటల్లోగా రాయలసీమలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. సోమవారం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో రాయలసీమ, కోస్తాంధ్రల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోవిూటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయని.. కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని చెప్పింది. రానున్న 3,4 రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో 4 రోజుల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రుతుపవనాల ప్రభావంతో జూన్ 19 నుంచి 24 వరకూ రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడొచ్చని అంటున్నారు. కోస్తాంధ్రలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. వాతావరణంలో తేమ శాతం గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం.