స్టేట్ న్యూస్

మోగనున్న ‘ధర్మగంట’

  • ఇద్దరు మాజీమంత్రులు
  • 7గురు ఎమ్మెల్యేలు
  • 10వేల ఎకరాల రికార్డుల తారుమారు
  • 16వేల సర్వే నెంబర్లు గల్లంతు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

గతంలో నాయకులు రాజకీయాల ద్వారా ‘సేవ’ చేయడానికి వచ్చేవారు. నేటి నాయకులు ‘షేవ్‌’ చేయడానికి వస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తారు. తెగబడతారు. తాము ఉన్న పార్టీలో పస తగ్గిందని తెలియగానే పక్క పార్టీలోకి జంప్‌. విశాఖ కేంద్రంగా జరిగిన భూకుంభకోణంలో నాటి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గంటా శ్రీనివాస్‌ ల పేర్లు బయటకు వస్తున్నాయి. వీరితో పాటు మరో ఏడుగురి శాసనసభ్యుల పేర్లు, బంధుగణాల ‘నామాలు’ వెలుగులోకి వస్తున్నాయి. ‘నేరం ఒకరిది – శిక్ష మరొకరిది’ చందాన నాయకులు చేసిన నేరాలకు అధికారులు నేరగాళ్ళుగా మారనున్నారు. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న సంచలన పరిశోధన కథనం.

వాన్‌ పిక్‌ టు వైజాగ్‌:

వాన్‌ పిక్‌ భూ కేటాయింపుల్లో నాటి రోడ్లు భవనాల శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావును ఏ-5వ ముద్దాయిగా సిబిఐ ఛార్జిషీటులో పేర్కొంది. ఆ తర్వాత మళ్ళీ వైజాగ్‌ భూకుంభకోణంలో మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తనయుడు మనోహర్‌ నాయుడుపై ఇప్పటికే లెక్కకు మిక్కిలి ఫిర్యాదులు ఉన్నాయి.

ఎంతకు తెగించారు:

విశాఖ గ్రావిూణ మండలంలోని రెవెన్యూ రికార్డుల్లో 2015-2017 మధ్యకాలంలో 18 ఎంట్రీలను గుర్తించారు. ఇవి ట్యాంపరింగ్‌ అయ్యాయి. విశాఖ జిల్లా వ్యాప్తంగా 40 మండలాల నుంచి 2,875 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 1995 నుంచి జరిగిన భూ బాగోతాలకు సంబంధించినవి కూడా ఉన్నాయు. 763 కేసుల్లో రెవెన్యూ, ప్రభుత్వ బడా అధికారులు ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా మేలు చేశారు. ఇంకా 618 కేసుల్లో ప్రభుత్వ అధికారుల ప్రమేయం, సహకారంతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు చెరపట్టినవి కూడా ఉన్నాయి. ఇవికాకుండా మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితుల భూములపై ఇతరులకు (భూకబ్జా దారులకు) ఇచ్చిన నిరభ్యంతర పత్రాలకు సంబంధించిన (ఎన్‌ఓసీ) కేసులు 68 ఉన్నాయి. 181 ఫిర్యాదులపై అనేక అంశాలు ఉన్నాయి. భారీగా ప్రభుత్వ భూములను చెరబట్టారు. అడ్డగోలుగా మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధుల భూములకు ఎన్‌ఓసీలు ఇచ్చారు. ఈ కేటగిరీలోకి రాని భూములను కూడా ఈ పద్దుకింద చేర్చి రెవెన్యూ రికార్డులను తారుమారుచేసి ఎన్‌ఓసీలు ఇచ్చారు. ప్రభుత్వ భూములను కూడా ప్రైవేటు భూములుగా చూపిస్తూ రికార్డులు తారుమారు చేయడం, రక్షణలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేటు కింద చూపించి పరాధీనం చేయడం, ప్రభుత్వ భూముల కబ్జా చేయడం, వాటికి బడా అధికారులు సహకరించడం జరిగింది.

తాత్కాలిక విశ్రాంతి:

వైజాగ్‌ కేంద్రంగా వేల కోట్ల రూపాయలు విలువైన భూ దందా జరిగింది. ఇవ్వాల్సిన ఆధారాలన్నీ పేర్లతో, సర్వే నెంబర్లతో, ఎకరాలు.. సెంటు భూమితో సహా కొలిచి మరీ ఇచ్చాం. కొత్తగా ఏర్పాటైన ‘సిట్‌’కి కూడా ఈ కథనాలు ముందుగా అందించ్చాం. మా ‘ఆదాబ్‌’ లక్ష్యం ఒకటే.. నష్టపోయిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం జరగాలి. జరిగి తీరాల్సిందే.! అన్యాయాలు, అక్రమాలపై అలుపెరుగని ‘ఆదాబ్‌’ పోరాటంలో ఈ భూకుంభకోణ కథనాలు ఓ మజిలీ. చరిత్రలో ఓ పేజీ. నేరస్తుల పాలిట లిఖించిన మరణశాసనం.

అంకితం:

తెలుగు జర్నలిజంలో తొలి పరిశోధన పాత్రికేయులు, ప్రముఖ సంఘ సంస్కర్త, కందుకూరి వీరేశలింగం పంతులుగారికి ఈ కథనాలు అంకితం. మేరా భారత్‌ మహాన్‌. జైహింద్‌.

భాజపాలో ‘గంట’..?:

గంటా శ్రీనివాసరావు స్వతహాగా సౌమ్యుడు. అధికారంలో ఉన్నప్పుడు ఎంత వేగంగా ఉంటాడో… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే త్వరగా అధికారం ఉన్నవైపు వెళతాడు. తాజాగా ‘భాజాపా’ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మాజీమంత్రి చుట్టూ ఉన్న భూ గందరగోళం ఇలా ఉంది.

ముదుపాక టు భీమిలి:

విశాఖ ముదపాక భూములను కబ్జాలు చేసి ఆక్రమించుకున్నారు. ముదపాకలో ‘ల్యాండ్‌ పూలింగ్‌’ పేరుతో భారీగా అసైన్డ్‌ భూములను కొట్టేశారు. నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు దగ్గరుండి భూములన్నింటినీ కబ్జా చేయించారని, ఆయన బంధువు భాస్కరరావు తనకు సంబంధం లేని భూములను తన పేరిట రిజిస్టర్‌ చేసుకొని పేదల కాలనీలో భూములను బ్యాంకుల్లో కుదవపెట్టి లోన్లు తీసుకున్నారని ‘సిట్‌’కు ఫిర్యాదు అందింది. గంటా శ్రీనివాసరావు వర్గంగా ఉన్న భీమిలికి చెందిన నేతలు పెద్దఎత్తున అక్రమ భూ సేకరణ చేశారని, అందుకే నాటి ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని అప్పట్లో పెద్దఎత్తున చర్చ సాగింది. నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు, నాటి ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ (అనకాలపల్లి), బండారు సత్యనారాయణ మూర్తి (పెందుర్తి), పంచకర్ల రమేష్‌ బాబు(యలమంచిలి), వెలగపూడి రామకృష్ణబాబు (విశాఖ తూర్పు)ల పేర్లు ఈ కుంభకోణంలో అంటకాగుతున్నాయి.

అతకని తుఫాన్‌ కట్టుకథ..:

2014లో సంభవించిన ‘హుద్‌ హూద్‌’ తుపానులో రికార్డులు కొట్టుకు పోయాయంటూ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. చివరకు వేల ఎకరాల కుంభకోణాన్ని? మధురవాడలోని 178, కొమ్మాదిలోని 92 ఎకరాలకు సంబంధించిన 25 రికార్డులు మాత్రమే టాంపరింగ్‌ అయినట్లు అధికారులు ప్రకటించడం విశేషం.

ఈ లెక్కలు పక్కా:

నాటి విశాఖజిల్లా కలెక్టర్‌ లెక్కల ప్రకారమే జిల్లాలో 10,000 ఎకరాలకు పైగా భూమి లెక్కలు తారుమారయ్యాయి. అంటే దాదాపు పాతిక వేల కోట్ల విలువ చేసే భూమి మాయం అయింది అసలు విశాఖ జిల్లాలో ఉన్న 3022 గ్రామాల్లో 2లక్షల ఎఫ్‌.ఎం.బి సర్వే నెంబర్లలో 16,000 నెంబర్లు గల్లంతయ్యాయి. దీనిలో సుమారు లక్ష ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్టు చర్చ జరిగింది. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో దాన్ని 10,000 ఎకరాలుగా మాత్రమే చిత్రించే ప్రయత్నం చేసారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close