Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలు

మీ వర్గం ఓట్లకు మార్గం చూపిస్తాం..

(పరమాత్మ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఎన్నికల వేళ ఎవరి లెక్కలు వారివి. ఎలాగైనా నెగ్గాలనే ఆరాటం.. విజయం కోసం పోరాటం.. తమకు అనుకూలమైన ఏ అంశాన్నీ వదలడం లేదు అభ్యర్థులు. పైకి లౌకికవాదం ముసుగులో ‘కులం’ వర్థిల్లుతోంది. ఒక్క ఓటైనా ఒడిసిపట్టి తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇంతటి ప్రతిష్ఠాత్మక ఎన్నికల బరిలో నాయకుల ఆశలను సొమ్ము చేసుకునేందుకు అర్ధరాత్రి లీడర్లు రంగంలోకి దిగుతున్నారు. వారెవరని ఆశ్చర్యం కలుగుతుందా?

ఇదిగో రిజిస్ట్రేషన్‌..:

కొందరు నేతలు తమ బస్తీ, కాలనీ, సామాజికవర్గాల పేరిట సంఘాలను రిజిస్ట్రేషన్‌ చేయించే పనిలో ఉన్నారు. ఇంకొందరు ఇప్పటికే ఆపని కానిచ్చారు. దీనికోసం తమ వర్గానికి చెందిన ఉద్యోగులు, వ్యాపారుల నుంచి సభ్యత్వ రుసుము పేరిట భారీగానే డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఇవిగో సేవలు..:

పదోతరగతి పూర్తయ్యే పిల్లలకు ఇంటర్‌ ఫీజులు తామే చెల్లిస్తామంటూ మరికొందరు ఉదారంగా హావిూలిస్తున్నారు. రాత్రికి రాత్రే సంఘాన్ని ఏర్పాటు చేయించి ఎంచక్కా నాలుగైదు ఫ్లెక్సీలు, వీలైతే అయిదారు బ్యానర్లతో రంగంలోకి దిగుతూ కొన్ని బృందాలు సందడి చేస్తున్నాయి. అందినకాడికి దండుకుని జేబులు నింపుకునేందుకు చోటామోటా సభలు, సమావేశాలు ఏర్పాటుచేసి హల్చల్‌ చేస్తున్నాయి. ‘ఇదిగో మా బలం.. వీరంతా మా సామాజికవర్గం. మేం ఎంత చెబితే అంత’ అంటూ రాజకీయ పార్టీల వద్ద రాయ’బేరా’లు సాగించే పనిలో పడ్డారు. అక్కడ కాదంటే మరో పార్టీ.. ఇలా అన్ని పార్టీల గట్లు తమవే అనేంత భరోసాతో చాపకింద నీరులా పనులు చక్కబెడుతూ వెళుతున్నారు. రాజకీయ పార్టీల కార్యాలయాలు.. బడానేతలు అందరూ గ్రేటర్లోనే ఉండటంతో రెడీమేడ్‌ సంఘ నాయకులు కూడా ఇక్కడే పాగా వేశారు.

కలుసుకుందాం.. రండి:

తమ కాలనీలు, బస్తీల్లో కాస్తాకూస్తో పలుకుబడి ఉన్న నేతలంతా చిన్నపాటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మనం.. మనం ఒక్కటీ. అంతా ఒకే మాట విూద ఉండాలంటూ ఐక్యతా పాఠాలు చెబుతున్నారు. పింఛన్లు, రేషన్కార్డులు ఇవన్నీ ఎన్నికలు కాగానే ఇస్తామంటూ మరీ ఆశలు రేకెత్తిస్తున్నారు. కొన్ని బస్తీల్లో అయితే మరో అడుగు ముందుకేసి సొంత రశీదు పుస్తకాల్లో ఓటర్ల పేర్లను రాసుకుని నకలు వారి చేతికి ఇచ్చి నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు బలాదూర్గా తిరిగిన యువకులు జట్లుగా మారి రెడీమేడ్‌ నేతల అనుచరులుగా వ్యవహరించడం విశేషం. జాబితాలో ఇంటిపేరు ఆధారంగా ఓటర్లను వేరు చేయటం, వారంతా ఏయే సామాజికవర్గాలకు చెందిన వారనే వివరాలు సేకరించడం వీరి బాధ్యత. అనంతరం ఒకే వర్గానికి చెందిన వారి జాబితాను తయారుచేసి.. అభ్యర్థుల ఎదుట ఉంచి బేరసారాలు సాగించటమే కొత్తగా పుట్టుకొచ్చిన నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఇటీవల ఖమ్మం పట్టణంలో కులసంఘం పేరుతో ఏకంగా నలుగురితో ఆఫీసు ప్రారంభించి… 88మంది.హాజరైపట్లు పత్రికాప్రకటనలు విడుదల చేశారు.

అంతా మన చేతుల్లో పనే: ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల సర్కస్‌ ఫీట్లు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇంతకుమించి హంగూ ఆర్భాటం చేస్తూ తాము తలచుకుంటే గెలుపోటములను తారుమారు చేస్తామంటూ మరీ రాజకీయ పార్టీల వద్ద కొందరు హడావుడి చేయడం విశేషం. రెండ్రోజుల క్రితం నగర శివార్లలో శాసనసభకు పోటీపడుతున్న అభ్యర్థి వద్దకు 40 మంది ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని ఆర్భాటంగా వెళ్లారు. ఫలానా కాలనీలో తమ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారంటూ మాటల్లోకి దిగారు. దశాబ్దాల క్రితమే వలస వచ్చిన వారందరి ఓట్లను ఏకపక్షంగా పోల్‌ చేయించే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. ప్రచారంలో తిరగకుండా.. కేవలం పోలింగ్రోజు మాత్రం బూత్ల వద్ద ఉండి చక్రం తిప్పుతామంటూ హడావుడి చేశారు. అప్పటికే సదరు సంఘ నేతలతో ఆ అభ్యర్థికి పరిచయం ఉండటంతో వాస్తవాలు వాకబుచేశారు. దీంతో ఆ ముఠా రెడీమేడ్‌ నాయకులుగా బట్టబయలైంది. ఎన్నికల సమయం కావడంతో పోలీసుల వరకూ వెళితే ప్రమాదమని రెండువైపులా సైలెంట్‌ అయినట్లు సమాచారం.

విద్యార్థుల జాబితా సిద్ధం చేసి: ఇది మరో నియోజక వర్గంలో సంగతి. కొందరు చోటా నేతలు తమ సామాజిక వర్గం ఓట్లను ఆశగా చూపి అభ్యర్థుల వద్ద సొమ్ము చేసుకో వాలని పథకం వేశారు. గత విద్యాసంవత్సరం పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన తమ ‘వర్గ’ విద్యార్థుల జాబితా సిద్ధంచేశారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు.. ఎలాగూ ప్రసార మాధ్యమాలు ఉంటాయి కాబట్టి నాయకులు వస్తారనే ఉద్దేశంతో సమావేశానికి సిద్ధమ య్యారు. ఇంత లో అదే వర్గంలోని మరో నాయకుడికి విషయం తెలిసింది. అసలు నేతలం తామంటూ గొడవకు దిగటంతో సమాచారం పెద్దల వరకూ చేరినట్లు తెలిసింది. ఇప్పటివ రకు బస్తీలు, కాలనీల్లో శాసనసభ్యులు, మంత్రులు వచ్చిన పుడు హడావుడి చేసేవారంతా ఎన్నికల ఘట్టంలో ముందు నిలిచేందుకు తమ సామాజికవర్గ కార్డును చూపుతూ చలా మణి అవుతున్నారు. ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న, ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల వద్దకు చేరి.. మా వాళ్ల ఓట్లన్నీ మా చేతుల్లో ఉన్నాయంటూ ‘అతి’ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

కార్తీక భోజనాలు: ఇక ఇది మరో ఎత్తుగడ. ఇప్పటికే కార్తీకమాసంలో వనభోజనాల పేరిట (వనంలో కాదు.. పట్ణణానికి కూతవేటు దూరం) కులాల వారీగా అనేక ముసుగులలో భోజనాలు ఏర్పాట్లు… ఆ కార్యక్రమంలో ఆ ‘కుల పెద్దలు’ రావడం జరుతోంది. సహజంగా కార్తీకమాసంలో భక్తులు శాఖాహారం పాటిస్తారు. ఈ ఎన్నికల్లో అదనంగా మాంసం లేనిదే ఎన్ని’కుల’ నాయకులు రాలేమని తేల్చారు. ఈ కార్తీక’మాసం’లో మసలా రుచులు ఉండబోతున్నాయి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close