Featuredరాజకీయ వార్తలు

మహాకూటమిలో మల్లగుల్లాలు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకున్నా విపక్షాలు మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. కాంగ్రెస్‌, టీజేఎస్‌, టీటీడీపీ కూటమి సీట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. జంట నగరాలు, చుట్టూ ఉన్న 35 అసెంబ్లీ స్థానాలే పొత్తుల్లో పీటముడికి కారణమని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీకి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నివేదించారు. మొత్తం 119 స్థానాలకు గాను 35 అసెంబ్లీ స్థానాల్లో తమకే ఎక్కువ బలముందని టీడీపీ, టీజేఎస్‌లు చెబుతున్నాయి. ఈ స్థానాల్లో తమ పార్టీ కూడా బలంగానే ఉందని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యులైన ఏకే ఆంటోనీ, గులాంనబీ ఆజాద్‌లకు ఉత్తమ్‌ వెల్లడించారు. అక్కడ తమకూ బలం ఉందని… అలాంటప్పుడు వదులుకోకూడదని ఆయన సూచించినట్లు సమాచారం. టీటీడీపి, సిపిఐ, టిజెఎస్‌కు ఇచ్చే సీట్లపై ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా ఢిల్లీలో ఏఐసిసి కోర్‌ కమిటీ సభ్యులు గులాం నబీ ఆజాద్‌, ఏకె ఆంటోనీ, వాయలార్‌ రవిలతో చర్చించారు. కూటమిలో పొత్తులపై ఏకాభిప్రాయం కుదరడం లేదంటూ వస్తున్న వార్తలపై చర్చించారు. తాము 40 నుంచి 45 సీట్లతో తొలి జాబితా విడుదల చేయాలని అనుకుంటున్నట్లు కుంతియా, ఉత్తమ్‌ కోర్‌ కమిటీ సభ్యులకు తెలియచేశారు. 35 సీట్ల వ్యవహారంతో జాబితా వెల్లడిలో జాప్యం జరుగుతోందని అంటున్నారు. ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న సీట్లను టీడీపి కోరుతోందని, అదే విధంగా ఉద్యమాలు బలంగా సాగిన, ఉద్యోగులు ఎక్కువగా ఉన్న సీట్లను టిజెఎస్‌ కోరుకుంటోందని ఉత్తమ్‌ వివరించారు. అక్టోబర్‌ నెలాఖరుకల్లా సీట్ల సర్దుబాటు కొలిక్కి రానుంది. ఇదిలా ఉంటే రాహుల్‌ తెలంగాణ పర్యటన ఎన్నికల ప్రచారంలో భాగమే అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెబుతున్నారు. త్వరలో సోనియాగాంధీ తెలంగాణకు రానున్నారు. మహాకూటమి పొత్తులో టికెట్లు లభించని కాంగ్రెస్‌ నేతలకు పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా పార్టీ పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. గతంలో టీడీపీ గెలుచుకున్న ఎమ్మెల్యే స్థానాలపై ప్రత్యేక ద అష్టి పెట్టారు. అక్కడ టీఆర్‌ఎస్‌కు పోటీ బాగా ఉంటుందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌యేతర, బీజేపీయేతర రాజకీయ కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తోంది. తాజాగా టీజేఎస్‌ చీఫ్‌ కోదండరామ్‌తో కాంగ్రెస్‌ పార్టీ నేతలు భేటీ అయ్యారు. కోదండరాం కనీసం 12 సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం 8 సీట్లు ఇస్తామని చెబుతోంది. ఈ విషయమై రెండు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు తుది దశకు చేరుకోనుంది. తొలుత టీజేఎస్‌ నేతలు కనీసం తమకు 16 సీట్లు కావాలని కోరారు. తర్వాత 12 సీట్లకు ఏమాత్రం తగ్గొద్దని నిర్ణయించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ నేతలు మాత్రం 8 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. అలాగే టీజెఎస్‌-కాంగ్రెస్‌ నేతలు నియోజకవర్గాల వారీగా పొత్తులపై చర్చించారు. ఈ వేదికలో కాంగ్రెస్‌ పార్టీతో పాటు సీపీఐ, టీజేఎస్‌, టీడీపీలు భాగస్వామ్యులుగా ఉన్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయమై కాంగ్రెస్‌ పార్టీ తీరుపై టీజేఎస్‌ కొంత అసంత అప్తిని వ్యక్తం చేసింది. దీంతో టీజేఎస్‌ తో సీట్ల సర్ధుబాటు కోసం కాంగ్రెస్‌ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 12 సీట్ల విషయంలో టీజేఎస్‌ నేతలు ఒక స్పష్టతతో ఉన్నారు. టీజెఎస్‌ మలక్‌ పేట, జూబ్లీహిల్స్‌, మహబూబ్‌నగర్‌, ముథోల్‌, జడ్చర్ల, మిర్యాలగూడ, వరంగల్‌ ఈస్ట్‌, మల్కాజిగిరి, పెద్దపల్లి, ఆశ్వరావుపేట, నాంపల్లి, రామగుండం, అంబర్‌ పేట, ఖైరతాబాద్‌, మహాబూబాబాద్‌ స్థానాలను కోరుతోంది. అయితే మిర్యాలగూడ నుండి సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్‌ రెడ్డి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ తరుణంలో ఈ సీటును కాంగ్రెస్‌ వదులుకోకపోవచ్చని అంటున్నారు. కుటుంబంలో ఒక్క టిక్కెట్టు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ప్రకటిస్తే ఈ సీటును వదులుకొనేందుకు జానారెడ్డి సిద్దంగా ఉన్నారు. ఇది కాకుండా కాంగ్రెస్‌ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాలను కూడ టీజేఎస్‌ అడుగుతుండడంతో కాస్త ప్రతిష్టంభన కనిపిస్తోంది. ఈ స్థానాలను ఆ పార్టీ ఇస్తోందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే సర్దుబాట్ల విషయంలో పట్టు విడుపులు తప్పవని టీజేఎస్‌ భావిస్తోంది. మొత్తం మీద 12 సీట్లకే నేతలు ఫిక్స్‌ అయ్యారు.

ఈసారి ముషీరాబాద్‌ సీటును టీడీపీకి ఇవ్వండి..

ఇదిలా ఉండగా టీడీపీ ఆవిర్భవించిన నాటి నుంచి ముషీరాబాద్‌లో ఒకే ఒక్కసారి పార్టీ పోటీ చేసింది. 1983 నుంచి 2014 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వివిధ పార్టీలతో పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు నియోజకవర్గం సీటును కేటాయించాల్సి వస్తోంది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ తదితర పార్టీలు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లోనైనా టీడీపీకి ముషీరాబాద్‌ సీటు కేటాయిస్తారా లేదా అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. సీటు కోసం పార్టీ అగ్రనేతలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణను కలిసి విజ్ఞప్తి చేశారు.ముషీరాబాద్‌ నియోజకవర్గంలో తెలుగుదేశానికి బలమైన కేడర్‌ ఉన్నప్పటికీ 1983 నుంచి 2014 వరకు వివిధ పార్టీలతో సీట్ల సర్దుబాటులో నియోజకవర్గం పార్టీ నేతలకు అగ్ర నాయకులు ‘సారీ’తో సరిపెడుతున్నారు. 1983లో శ్రీపతిరాజేశ్వర్‌రావు ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నాయిని నర్సింహారెడ్డిపై విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటులో జనతాపార్టీ నుంచి మరో సారి నాయిని నర్సింహారెడ్డికి ముషీరాబాద్‌ టికెట్‌ కేటాయించడంతో ఆయన విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో పార్టీల పొత్తుల్లో నాయిని పోటీ చేయగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డి విజయం సాధించారు. 1994లో ఏర్పడిన మహాకూటమిలో నాయినికి టికెట్‌ కేటాయించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీకి టికెట్‌ కేటాయించడంతో డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విజయం సాధించారు. 2004లో సీట్ల సర్ధుబాట్లలో మరోసారి డా.కె.లక్ష్మణ్‌కు టికెట్‌ కేటాయించడంతో అప్పటి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డి గెలిచి మంత్రి అయ్యారు.2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ, సీపీఎం, సీపీఐ పొత్తు ఉండగా అందులో వీరయ్యకు టికెట్‌ కేటాయించడంతో పరాజయం పాలయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడినప్పటికీ ముషీరాబాద్‌ టీడీపీ బీ ఫామ్‌ను ఎమ్మెన్‌ శ్రీనివాసరావుకు అందజేశారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీ ఫామ్‌ను విరమించుకోవాలని సూచించడంతో నాయినికి ఎమ్మెన్‌ మద్దతు పలికారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి టి.మణెమ్మ విజయం సాధించారు. 2014లో బీజేపీ, టీడీపీ సీట్ల సర్దుబాటులో బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కె.లక్ష్మణ్‌కు సీటు కేటాయించడంతో 28 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇలా ప్రతి సారీ ఎన్నికల్లో వివిధ పార్టీలతో పొత్తులు ఉండడంతో నియోజకవర్గం టీడీపీ నాయకులకు టికెట్‌ దక్కకుండా అన్యాయం జరుగుతుందని నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు పేర్కొంటున్నారు. ఈ సారి ఖచ్చితంగా టీడీపీకి కేటాయించాలని పట్టుబడుతున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close