Featuredస్టేట్ న్యూస్

మళ్ళీ మొదలైన పోరు…

  • వెనక్కి తగ్గేదే లేదంటున్న కార్మికులు..
  • కఠినంగా వ్యవహరిస్తామన్న ప్రభుత్వం..
  • ఉదృతమవుతున్న ఉద్యమం..
  • అందరిని ఏకం చేస్తున్న యజమాన్యం..

కడుపుకాలి ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు… కడుపునింపకున్నా పర్వాలేదు కాని కనీస సదుపాయాలు కల్పించాలని ఆలుపెరగని పోరాటం చేస్తున్నారు.. ప్రత్యేక రాష్ట్రమప్పుడు నచ్చిన ఆర్టీసి కార్మికులు సమ్మె ఇప్పుడు సమస్యలపై ప్రశ్నిస్తే ఎందుకు తొక్కిపెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచేదీ లేదు, ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్‌.. ఇరువురి పట్టింపులు చిలికి చిలికి గాలివానగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తెకలంగాణలో మరోసారి సకలజనుల సమ్మెలాగా మరో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగేలా ఉంది. గత వారం, పదిరోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న సమ్మె ఎన్నిరోజులు కొనసాగుతుందో అర్ధమే కావడం లేదు. ఒక పక్క ప్రభుత్వం మెట్టు దిగేది లేదంటుంది, ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించేది లేదంటున్నారు. తెలంగాణలో ఉన్న అన్నివర్గాలను, అన్ని రాజకీయ పార్టీలను ఏకంచేసే దిశగా ఎవరికి వారుగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం కూడా కఠినంగా ఉండడంతో సమ్మె ఎక్కడికి దారితీస్తుందో అర్థం కావడం లేదు. ఆర్టీసీ సమ్మెకు ఎవ్వరి మద్దతు లేకుండా అందరిని దూరం చేస్తుంటే కార్మికులు మాత్రం అన్నివర్గాలను, సంఘాలను ఏకం చేస్తున్నారు.. ఆర్టీసీ కార్మికులను ఏకాకులుగా చేసేందుకు ప్రభుత్వం విభజించి పాలించాలనే సూత్రాన్ని ఇప్పుడు తెలంగాణలో ప్రయోగిస్తుంది. సమ్మె ఎన్నిరోజులు చేసినా స్పందించే సమస్యేలేదు, పట్టించుకునే అవసరమే లేదంటుంది. సమ్మెచేస్తున్న వారికి మద్దతుగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరిని దూరం చేసేందుకు ప్రయత్నం చేస్తుందే కాని వారి సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన చేయడం లేదు. ఇప్పుడు ఆర్టీసి కార్మికులకు ప్రతిపక్షాల మద్దతు కావాలి, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల దైర్యం కావాలి.. హక్కులకై పోరాటం చేస్తూ ఒంటరైపోతున్న ఆర్టీసి కార్మికులు అందరి మద్దతును కోరుతున్నారు.. కష్టాల కడలిలో ఉన్న ఆర్టీసికి అందరూ ఏకమై గళం కలుపుతేనే న్యాయం జరుగుతుందనే ఆలోచనతోనే ముందడుగు వేస్తున్నారు..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

ఆర్టీసిని ప్రవేట్‌పరం చేయోద్దు… అప్పుల కుంపటిగా ఉన్న ఆర్టీసిని ప్రభుత్వం గట్టెక్కించాలి.. కార్మికులు సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని నెలలు నుంచి కార్మికులు కోరుతూనే ఉన్నారు. వీరి సమస్యలు ఎంతగా చెప్పినా, ఎన్నిరోజులు వారి ఆవేదనను వినిపించినా ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న దాఖలాలే లేవు. ఎంత చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నెల, రెండు రోజుల ముందే ఆర్టీసి కార్మికలు సమ్మె నోటీస్‌ ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించి, ఆర్టీసిని అప్పులభారం నుంచి కాపాడాలని సంబంధిత శాఖకు అప్పగించారు. ఐనా సరియైనా సమాచారం రాకపోవడంతో దసరా పర్వదినానికి రెండు, మూడు రోజుల నుంచి ఆర్టీసి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చి అప్పటి నుంచి సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. వేలాది మంది కార్మికులు కడుపుకాలి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం మాత్రం తమకేమి సంబంధం చేస్తున్నట్లుగానే వ్యవహరిస్తోంది. ఆర్టీసీ సమ్మెకు మిగతా ఉద్యోగసంఘాలైనా టిఎన్జీవో, ఎన్జీవో సంఘాలు దసరా ముగిశాక మద్దతు పలికి పెన్‌డౌన్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందరూ కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పదునైనా వ్యూహాలతో ముందుకు పోతున్న తరుణంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఉద్యోగసంఘాలను ప్రగతి భవన్‌కు పిలిపించి ఉద్యోగులు సమస్యలను పరిష్కరించడం కోసం, వారి ఐక్యత కోసం తాము కృషిచేస్తానని మరీ మరీ చెప్పారు. ఉద్యోగ సంఘాలను పిలిపించడం వెనక భారీ స్కెచ్‌ ఉందనే సమాచారం ఉంది. ఉద్యోగసంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిసినప్పటినుంచి ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలా, వద్దా అనే మీమాంసలోనే ఉద్యోగసంఘాల నాయకులు ఉన్నారు. అంతోకొంత తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్నపార్టీలు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై ప్రధాన దృష్టిసారించేసరికి వీరికి పూర్తి మద్దతు కరువయ్యింది. ప్రధాన సంఘాలు, ప్రధాన పార్టీలు మద్దతు లేక ఆర్టీసీ కార్మికులు ఒంటరివాళ్లపోతున్నారు…

ఆర్టీసీ కార్మికులకు అందరి మద్దతు కావాలి…

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి తీవ్రంగానే స్పందించారు. వారిని చర్చలకు పిలిచేది లేదు. వారితో సంప్రదింపులు లేవు అంటున్నారు. ఎన్నిరోజులు సమ్మె చేస్తారో, చేసుకోవాలని, ఆర్టీసి బస్సులను అడ్డుకున్న, ప్రయాణీకులను ఇబ్బంది పెట్టినా ఊరుకునే సమస్యే లేదంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సమ్మె చిలికిచిలికి గాలివానగా మారే అవకాశంగా మారుతోంది. ఒక పక్క ఆర్టీసీ కార్మికులు సమస్యలు పరిష్కరించేవరకు మెట్టు దిగేది లేదంటున్నారు. మరో పక్క ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులు మాట వినడం లేదని, ఆర్టీసీని అన్నిరకాలుగా అదుకుంటామని చెప్పినా కూడా పట్టించుకోక అమలు కాని హమీలను కోరుతున్నారని వారితో చర్చలు సమస్యేలేదని అంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలపాలనుకుంటున్న ప్రతివారితో తెరవెను నుంచి చర్చలు జరిపి సమ్మెకు ఎవ్వరూ సపోర్టు చేయకుండా చేస్తున్నారని తెలుస్తోంది..

కార్మికులు మాత్రం వెనక్కి తగ్గేదీ లేదంటున్నారు..

ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినా తాము మాత్రం వెనక్కి తగ్గే సమస్యే లేదంటున్నారు ఆర్టీసీ కార్మికులు. తమ సమస్యలపై ప్రశ్నిస్తూ పోరాటం చేస్తుంటే ప్రభుత్వం కావాలనే అణిచివేత ధోరణి అవలంభిస్తుందని అంటున్నారు. అందుకే తెలంగాణలోని అన్ని పార్టీల మద్దతు, అన్నివర్గాల మద్దతు కోసం ప్రతి నాయకుడిని కలిసి మద్దతు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ముందు జరిగినా సకల జనుల సమ్మెలాగా సమ్మెను మరింత ఉదృతం చేసేలా కసరత్తులు చేస్తున్నారు. ఒక చేయి కలుస్తే చప్పట్లు ఏలా మోగుతాయని రెండు కలిస్తేనే శబ్దం వస్తోందనే ధోరణిలో ముందుకు సాగుతున్నారు. ఆ శబ్దంతో ప్రభంజనం సృష్టించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆలోచనతోనే ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ప్రజల తరపున పోరాటం చేస్తామని చెపుతున్న ప్రతిపక్ష నాయకులు, ప్రజల గొంతుకనే మా గొంతు అనే ప్రజాసంఘాలు ఆర్టీసి కార్మికుల ఉద్యమానికి వారి అండ ఇప్పుడు ఎంతో అవసరం.. వారందరిని ఏకం చేసి తెలంగాణలో భారీ ఎత్తున సమ్మెకు అందరూ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది…

నేడే ఖమ్మం జిల్లా బంద్‌

ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ సోమవారం ఖమ్మం జిల్లా బంద్‌ కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్‌ పిలుపుకు విపక్షాలు మద్దతు తెలిపాయి. ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెడ్డి హైదరాబాద్‌ డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. శ్రీనివాస్‌ రెడ్డి మృతితో కార్మికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వ వైఖరి వల్లే కార్మికుడు చనిపోయాడని మండిపడ్డారు. శ్రీనివాస్‌ రెడ్డి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిణామాలతోనే ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని కార్మికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌ 12న ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబసభ్యులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే 90 శాతానికి పైగా శరీరం కాలిపోయింది. మెరుగైన చికిత్స నిశ్రీనివాస్‌ రెడ్డి మృతికి ప్రభుత్వమే కారణం అని కార్మికులు అంటున్నారు. ఖమ్మం జిల్లాలో కార్మికులు ఆందోళన చేపట్టినా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అడ్డుకోవడం సరికాదని కార్మికులు అంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close