FeaturedInterviewsజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువిద్యస్టేట్ న్యూస్

మరో ఎటాక్ కు రంగం సిద్దం… ఆపరేషన్-2 ఆంధ్రజ్యోతి

◆ కేబుల్ కట్.. ‘సాంకేతిక’ సమస్య అట
◆ మొదటి అంకం పూర్తి
◆ తెరపైకి భూ, ప్రకటనల విషయాలు
◆ ఆర్థిక మూలాలపై చూపు
◆ ముందే చెప్పిన ఆదాబ్

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)
మీడియా ఎప్పుడూ ప్రజాపక్షమే. ప్రభుత్వానికి ప్రతిపక్షమే..అదే ప్రజాస్వామ్యం. ఫోర్త్ ఎస్టేట్ అంటే విశాలమైన ఎస్టేట్ కాదు. ధర్మం నాలుగు పాదాలతో నడవాలని పెద్దలు చెపితే… అందుకు ప్రతీకగా నాలుగవ స్థంభంగా నిలబడేది… నిగ్గదీసేది.. నిజాయితీగా ప్రశ్నించేదే ఫోర్త్ ఎస్టేట్ జర్నలిజం. ఇప్పుడు తెలుగు మీడియా రాబోయే నాలుగు ఏళ్ళులో ఎదుర్కోబోతున్న ప్రతిక్షణం సంక్లిష్టమే. కత్తిమీద సామే. (అది రాసే.. చూపే వాళ్ళకు మాత్రమే). రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షం నామ మాత్రమే. అధికారపక్షం చేతుల్లో స్వంత మీడియాలు. ఆర్థిక లోటు లేదు. ఇక ఈ తరుణంలో ప్రతిపక్ష బాధ్యత నిర్వహించాల్సింది.. ఫ్రింట్, ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలే..! ఇందులో ప్రధానంగా ‘కమ్మ’ని సామాజిక వర్గానికి చెందిన మీడియాపై అధికార పెద్దల కన్నెర్ర. అందులో యాదృచ్చికంగా మూడు.. ‘ఆర్’లే కావడం విశేషం. ఒకరు ఈనాడు రామోజీరావు, మరొకరు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇంకొకరు టివి9 రవిప్రకాష్. ఇందులో తొలి వికెట్ టివి9 రవిప్రకాష్ తో ఇక సమస్య లేదు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరూ కస్సు బుస్సులు ఆడేది రెండు ప్రధాన మీడియాలపైనే. అందులో ప్రధానంగా రామోజీరావుకు కేంద్రంలో ఉన్న పరపతి తెలియంది కాదు. అందుకే ఆయన గురించి ఆలోచన చేసే సహాసం చేయరు. ఇక మిగిలింది ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ. ఆయననే టార్గెట్ చేయాలనే పథకాలన్నీ పక్కాగా పూర్తయ్యాయని….
“జూన్ 3, 2019న ‘ఆపరేషన్ కమ్భని మీడియా
టార్గెట్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ” పేరుతో ‘ఆదాబ్ హైదరాబాద్’ సంచలన కథనం పాఠకుల ముందుంచింది. ఆదే ఇప్పుడు జరుగుతుంది. జరగబోయేది కూడా ముందే చెపుతున్నాం. ఇక చదవండి…

ఇక ఆ ఇద్దరిలో…?:
బలమైన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరిలో ఒకరు రామోజీరావు కాగా., మరొకరు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగిన రామోజీరావును రాష్ట్ర ప్రభుత్వాలు ‘టచ్’ చేసే ధైర్యం లేదు. ఉండదు. ఆయన లీగల్ గా అంత పక్కాగా ఉంటారు. దానికి తోడు రామోజీరావు పెద్దకుమారుడు కిరణ్ సతీమణి శైలజ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతీల మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఇవి తెంచుకోవడానికి ఇరు కుటుంబాలు, ఆ కుటుంబ వ్యవస్థలు కూడా ఇష్టపడవు. అటు కేంద్రంలోనూ, ఇటు భారీ పారిశ్రామిక వేత్తలతో రామోజీరావు బలమైన సంబధాలు ఉన్నాయి. అందుకే ‘వేయి నాగళ్ళ’ తెలంగాణ కథ కంచికి చేరిన విషయం ‘జగ’ద్వితం. గతంలో జగన్ పత్రిక ‘సాక్షి’ ‘మార్గదర్శి’ వ్యవహారంలో రామోజీని వీలైనంత డామాజీ చేసింది. ఆ తరువాత చంద్రబాబును ‘టార్గెట్’ చేస్తున్న సందర్భంలో ‘రాజగురువు, గురువింద గింజ’ అంటూ రామోజీరావు గురించి పుంఖాను పుంఖాలుగా కథనాలు ఇచ్చింది. అయితే ఓ కరుణాకర్ రెడ్డి ఇంట ‘శుభకార్యం’ సందర్భంగా జగన్ ‘వెళ్ళి రామోజీరావును కలిశారు. విషయం తేలికపడింది. కానీ సమస్య సమసి పోలేదని తెలుస్తోంది.

ఆంధ్రజ్యోతి కేబుల్ ‘కట్’:
పట్టువీడని జగమొండి, అవసరమైతే తన జర్నలిస్టులు తప్పు చేసినా ఒప్పుకోని నైజం ఆయనది. ముక్కుసూటిగా వెళ్ళే సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి దిన, వార పత్రికలు నడుస్తున్నాయి. ఒకానొక సందర్భంలో కేసీఆర్ తో ‘సై’ ఆటకు సైతం దిగింది. ‘కలానికి సంకెళ్లు’ అంటూ తెరాస వార్తలకు లోగో పెట్టి కొత్త పంథాకు తెరతీసింది. (అదే ఈనాడు అయితే ఆ వార్తలను నిర్వీరం చేసి .. కనిపించని దెబ్బ కొట్టేది). తర్వాత కాలంలో పరిస్థితులు చెక్కబడ్డాయి. ఇంతలో ‘కాంగీదేశం’ దోస్తీ… కారణంగా తెలంగాణ ఎడిషన్ లో తన ప్రజా స్టాండ్ మార్చింది. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో జగన్ టార్గెట్ గా వార్తలు ఎక్కుపెట్టింది. అయితే ఫలితాలతో అంచనాలు తప్పాయి. ఊహించని విధంగా తన స్టాండ్ మార్చింది. అయినా పాత ధోరణులపై తెలుగు సిఎంలు ‘గరం మసాలా’ తో ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఆంధ్రజ్యోతి, తెలుగు రాష్ట్రాల అధిపతులు ‘దాడి-ఎదురుదాడి’ సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రజ్యోతి ఏబీఎన్, మరో ఛానల్
ప్రసారాలను కేబుల్ ఆపరేటర్ల స్థాయిలో నొక్కేశారు. ఈ విషయంలో అక్కడి జర్నలిస్ట్ సంఘాలు అంశాల వారీగా ఆందోళనలు చేశారు. ఇది ఓ సాంకేతికంగా సమస్యగా చెప్పి ఎమ్మెస్ ఓలు తప్పుకునే రంగం సిద్దమైంది. ఇది ఆపరేషన్-1గా చెప్పుకోవచ్చు.

నెక్ట్స్.. ప్రకటనల ఉచ్చు –
తిరగతోడేది ఇవే…(నా.!):
గత అయిదేళ్లలో ఆంధ్రజ్యోతికి నాటి తెలుగుదేశం ప్రభుత్వం సుమారు రూ.700 కోట్ల ప్రకటనలు మంజూరు చేసిందని ఆరోపణలు. ఇది లెక్కల ప్రకారం ఉంటుంది కాబట్టి పెద్దగా సాక్ష్యాధారాలు సేకరించే పని లేదు. ఇది కాకుండా మరో విషయంపై తాజా ప్రభుత్వం ఆరా తీసే పనిలో ఉంది.

భూ విషయాలు..:
ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి చెందిన ఆమోదా పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కు రాష్ట్ర ప్రభుత్వం విలువైన భూమిని కేటాయించింది. విశాఖపట్నం శివారు పరదేశిపాలెంలో రూ.15 కోట్ల విలువైన ఒకటిన్నర ఎకరాల భూమిని కేవలం రూ.50 లక్షలకే ఇచ్చేసింది.

అసలేం జరిగింది:
ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు 1986లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విశాఖపట్నం శివారు పరదేశిపాలెం గ్రామ పరిధిలో సర్వే నం.191, 168లలో ఎకరా రూ.10 వేల ధరకే 1.50 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, జాతీయ రహదారి విస్తరణ కోసం ఇందులో ఎకరా భూమిని వెనక్కి తీసుకుంది. మిగిలిన 50 సెంట్ల భూమి అప్పటి నుంచి ఆంధ్రజ్యోతి సంస్థ అధీనంలోనే ఉంది. జాతీయ రహదారి విస్తరణ కోసం తీసుకున్న ఎకరా భూమికి ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి అధీనంలో ఉన్న 50 సెంట్ల భూమికి గాను సదరు సంస్థ నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయలేదు. జాతీయ రహదారి విస్తరణ కోసం స్వాధీనం చేసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలని, పైగా 1986లో తమకు కేటాయించిన విధంగానే ఎకరా రూ.10 వేల చొప్పునే కేటాయించాలంటూ ఆంధ్రజ్యోతి యాజమాన్యం నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని జీఓ 571 ప్రకారం పాత ధరకు కేటాయించాలని ఆమోదా పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విశాఖ జిల్లా కలెక్టర్‌ను కోరింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం అదే ప్రాంతంలో ఎకరా 50 సెంట్ల భూమిని గుర్తించాలని అధికారులను ఆదేశించింది. గత కలెక్టర్‌ యువరాజ్‌ ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉందని, ఇక్కడ మార్కెట్‌ విలువ ఎకరా రూ.7.26 కోట్లుగా నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. గతేడాది ఆగస్టు 10న, అక్టోబర్‌ 4న ప్రస్తుత జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ రివైజ్డ్‌ నివేదిక పంపించారు. ఆ నివేదికలోనూ ఎకరా ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.7.26 కోట్లు ఉందని, ఆ ధరకే కేటాయించాల్సిందిగా ప్రతిపాదనలను పంపారు. అనంతరం పరదేశీపాలెంలో సర్వే నంబర్‌ 191/10 నుంచి 191/14లో అందుబాటులో ఉన్న ఎకరా 50 సెంట్ల భూమిని ఆమోదా పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కరికాల వళవన్‌ బుధవారం జీవో ఎంఎస్‌.25ను జారీ చేశారు.

50 సెంట్ల భూమిని పాత ధర కింద ఎకరా రూ.10 వేల చొప్పున ఇవ్వడానికి, ప్రత్యామ్నాయంగా ఇస్తున్న ఎకరా భూమిని ఎకరా రూ.50 లక్షల చొప్పున కేటాయించాలని సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే 50 సెంట్ల విలువ కేవలం రూ.5 వేలేనన్న మాట. మూడేళ్లలో భూమిని ఉపయోగించాలని, ఆ భూమిలో వాటర్‌ బాడీస్‌ (చెరువులు, గెడ్డలు)రూపు మార్చకూడదని స్పష్టం చేశారు. సంబంధిత అవసరాలకే వినియోగించాలని, వివరాలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని పేర్కొన్నారు. ఇదే ఆంధ్రజ్యోతి ఆపరేషన్-2గా ముందే చెపుతున్నాం. జర్నలిస్టులూ, సంఘాలూ జర ముందే వ్యూహాలు సిద్దం చేసుకోండి.

ప్రతి ఏడాది మార్చి 31వ తేదీకల్లా ఈ భూమి వినియోగంపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. లేకుంటే భూమిని వెనక్కి తీసుకునే అధికారాన్ని కలెక్టర్‌కు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పరదేశిపాలెంలో ఎకరా రూ.10 కోట్లపైనే పలుకుతోంది. ఈ లెక్కన రూ.15 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.50,05000కు కట్టబెట్టారనే విషయంపై లోతుగా ఆలోచన జరుగుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close