మరోమారు నోటీసులు

0

స్పీకర్‌కు,12మంది ఎమ్మెల్యేలకు

  • సిఎల్పీ విలీనంపై భట్టి, ఉత్తమ్‌ల పిటిషన్‌పై హైకోర్టు
  • ఇప్పుడు ఎవరిని చీరి చింతకు కట్టాలన్న వంశీచంద్‌ రెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ స్పీకర్‌తో పాటు, కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌, పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై సమాధానం చెప్పాలని తెలిపింది. ఇప్పటికే ఓ మారు దీనిపై నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై సమాధానం ఇచ్చేందుకు వీరు సిద్దం అవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌పై ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆరోపణలను ఖండిస్తున్నామని, రాజకీయ ఫిరాయింపులను కేసీఆర్‌ ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్‌ నేత వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం ఉండాలన్నారు. కాంగ్రెస్‌ బి.ఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, ప్రజా మద్దతు, దమ్ము ఉంటే ఎన్నికలకు సిద్ధపడాలని వంశీచంద్‌రెడ్డి సవాల్‌ విసిరారు. పార్టీలు మారేవారిని చీరి చింతకు కట్టాలే అని నీతులు మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడంపై ఎందుకు స్పందించడం లేదని వంశీచందర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన రాజకీయ వ్యభిచారులు కాంగ్రెస్‌ నాయకత్వంపై చేసిన ఆరోపణల్ని ఖండిస్తున్నామన్నారు. ఇదే నాయకత్వం వీళ్లకు బీఫామ్‌ ఇచ్చిన విషయాన్ని గమనించాలని అన్నారు. దమ్ముంటే ఆ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. రాజకీయ ఫిరాయింపులు వ్యభిచారమేనన్న కేసీఆర్‌ ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలతో రాజకీయ వ్యబిచారం చేయిస్తున్నారని విమర్శించారు. రాజకీయ వ్యబిచారం చేసే వారిని చేయించే వారిని ఏమనాలని అన్నారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ నేతలు.. మరి 6 సిట్టింగ్‌ ఎంపీ స్థానాల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా.. స్వయంగా సీఎం కూతురు కూడా ఓడిపోయింది. అంటే మీకు ప్రజా మద్దత లేనట్లే కదా అని అన్నారు. నియోజక వర్గ అభివృద్ధి కోసమే ఫిరాయించామని ఎమ్మెల్యేలు అంటున్నారు. పార్టీ మారక పోతే నియోజకవర్గ అభివృద్ధి చేయనని సీఎం అన్నారా అని ప్రశ్నించారు.

భట్టి,ఉత్తమ్‌లపై చిరుమర్తి ఫైర్‌

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌పై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తమ్‌, భట్టి విక్రమార్క ఇద్దరూ తెలంగాణ ద్రోహులు అని నిప్పులు చెరిగారు. ఇప్పుడు దీక్షలు చేస్తున్న ఈ నేతలు.. తెలంగాణ కోసం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నుంచి డబ్బులు తెచ్చుకొని ఉత్తమ్‌, భట్టి పంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉత్తమ్‌, భట్టి విక్రమార్కపై విరుచుకుపడ్డారు. దళిత ఎమ్మెల్యేలను గౌరవించే సంస్కారం భట్టికి లేదన్నారు. కాంగ్రెస్‌లో ఉత్తమ్‌, భట్టి ముఖ్యమంత్రుల్లా ఫీల్‌ అవుతున్నారని విమర్శించారు. తాము అమ్ముడు పోయామని రుజువు చేస్తే తక్షణమే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. లేకపోతే ఉత్తమ్‌, భట్టి తమ పదవులకు రాజీనామా చేస్తారా? సవాల్‌ విసిరారు. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపు అంశంలో హైకోర్టు నోటీసులు జారీ చేయడంపై స్పందించారు. తమకు ఎలాంటి కోర్టు నోటీసులు అందలేదని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here