భారత్‌తో చర్చలకు పాకిస్తాన్ మంత్రి ‘షా’ లేఖ

0

భారత్‌తో అన్ని ముఖ్యమయిన అంశాలపై చర్చలు జరపాలని కోరుకుంటున్నట్టు పాకిస్తాన్ తెలిపింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు రాసిన లేఖలో ఈ విషయం పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్ ఈ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు కృషి చేయాలనే అంశానికి కట్టుబడి ఉందని కూడా ఆయన ఆ లేఖలో తెలిపారు. భారత విదేశాంగ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జైశంకర్‌ను అభినందిస్తూ ఖురేషి ఈ లేఖ రాశారు. మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి అయిన జైశంకర్ మే 30వ తేదీన భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ‘పాకిస్తాన్ అన్ని ముఖ్యమయిన అంశాలపై భారత్‌తో చర్చలు జరపాలని కోరుకుంటోంది. ఈ రీజియన్‌లో శాంతి పునరుద్ధరణ కోసం కృషి చేయాలనే అంశానికి కూడా కట్టుబడి ఉంది’ అని ఖురేషి.. జైశంకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారని దౌత్య వర్గాలను ఉటంకిస్తూ ‘డాన్’ వార్తాపత్రిక తెలిపింది. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి జరిపి, 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. భారత యుద్ధ విమానాలు ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో గల జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరాలపై దాడి చేయడం, మరుసటి రోజు పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత్‌పై గగనతల దాడికి విఫలయత్నం చేయడంతో ఇరు దేశాలు దాదాపు యుద్ధం అంచుల్లోకి వెళ్లాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడి, నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించడానికి రంగం సిద్ధమయిన తరుణంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మే 26వ తేదీన ఆయనకు ఫోన్ చేసి, ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాల కోసం భారత్‌తో కలిసి పని చేయాలని పాకిస్తాన్ కోరుకుంటోందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here