భాజపా పాలిత రాష్ట్రాలకే మోడీ ప్రాధాన్యం

0

వయనాడ్‌: ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలకంటే భాజపా పాలిత రాష్ట్రాలకే మోడీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం కేరళలో ఉన్న ఆయన ఆదివారం కొయ్‌కోడ్‌లో భారీ రోడ్‌ షో నిర్వహించారు. కేరళ ప్రజలు విభిన్న రాజకీయ సిద్ధాంతాలను ఆదరించే గొప్ప మనస్తత్వం కలవారని ప్రశంసించారు. ”ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌కు ఎంత ప్రధాన్యం ఇస్తారో కేరళకు అంతే ఇవ్వరు. ఆయన ఇక్కడకు వచ్చి కేరళ, వారణాసి రెండు సమానమే అని చెప్పారు. కానీ, నాకు తెలుసు..సీపీఎం పాలిస్తున్న ఈ రాష్ట్రాన్ని అన్నింటితో సమానంగా ఆయన చూడరు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల కంటే భాజపా పాలిత రాష్ట్రాలకే మోడీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు” అని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. భాజపా సిద్ధాంతకర్త అయిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చేతిలో కేరళను రిమోట్‌ కంట్రోల్‌గా మారకుండా పోరాడతామని వ్యాఖ్యానించారు. కేరళ పాలన నాగ్‌పూర్‌ కేంద్రంగా జరగనిచ్చే ప్రసక్తే లేదన్నారు. తమ రాష్ట్రాన్ని కేరళ ప్రజలే పాలించుకుంటారన్నారు. ఆరెస్సెస్‌ సిద్ధాంతాలు విశ్వసించినవారినే మోడీ భారతీయులుగా పరిగణిస్తారని ఆరోపించారు.

వయనాడ్‌ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరితోనైనా కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని రాహుల్‌ తెలిపారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన వామపక్ష కూటమికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వయనాడ్‌ ప్రజల సంక్షేమం కోసం సీపీఎం కూడా కలిసి రావాలని కోరారు. దేశమంతటా వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ కేరళలో మాత్రం ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రజలకు కృతజ్ఞతలు తెలపడానికి రాహుల్‌ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో వయనాడ్‌ లోక్‌సభ స్థానంలో రాహుల్‌ 4.31లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here