బీజేపీ 15ఏళ్లలో చేయలేని పని..24 గంటల్లో చేసేశాం

0

అటల్‌నగర్‌: 2019 ఎన్నికల్లో తాము అధికారం లోకి వస్తే దేశంలో పేదరికమే ఉండబోదని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చెప్పారు. సోమవారం ఛత్తీస్‌ గఢ్‌ లోని అటల్‌ నగర్‌ లో ‘రైతు సమ్మేళన్‌’కు వెళ్లిన ఆయన అన్నదాతలకు రుణ మాఫీ చెక్కులు అందించారు. ఆ తర్వాత మాట్లాడుతూ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ సారి కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే పేదలకు కనీస ఆదాయం గ్యారెంటీ అంటూ ఎన్నికల హావిూ ప్రకటించారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ తీసుకురాని కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన హావిూ ఇచ్చారు. గతంలో తాము మహాత్మా గాంధీ గ్రావిూణ ఉపాధి హావిూ పథకంతో కనీసం 100 రోజుల పని గ్యారెంటీగా కల్పించేలా చర్యలు తీసుకున్నామని గుర్త చేశారు. ఈ సారి పేదలందరికీ కనీస ఆదాయం ఉండే పథకం తెస్తామని చెప్పారు. ఈ పథకంతో దేశంలో ఆకలి బాధలు ఉండవని, పేదలనే మాటే ఉండదని అన్నారు. దీని కోసం కాంగ్రెస్‌ ఇప్పటికే చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. బీజేపీ వాళ్ల దగ్గర రుణమాఫీకి డబ్బులు లేవన్నారని, వాళ్లు పదిహేనేళ్లగా చేయలేని పనిని తాము 24 గంటల్లో చేసి చూపించామని చెప్పారు. హరిత విప్లవం తెచ్చాం. దేశంలో హరిత విప్లవం తెచ్చి, ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్‌ పార్టీనేనని రాహుల్‌ చెప్పారు. ప్రపంచంలో అమెరికా, జపాన్‌.. ఇలా ఎక్కడైనా భారత్‌ లో రైతులు పండించిన పంటలు తింటున్నారని అన్నారు. లక్షల మంది ప్రజలు పేదరికంలో మగ్గుతుంటే నవ భారత నిర్మాణం సాధ్యం కాదన్నారు. అందుకే ప్రతి పేదోడికీ మినిమం ఇన్‌ కం గ్యారెంటీ పథకం తెస్తున్నామని, ఇందులో భాగంగా నేరుగా పేదల అకౌంట్‌ లో డబ్బులు వేస్తామని చెప్పారు. ఇది మా విజన్‌.. మా హావిూ అని చెప్పారు.

భూసేకరణ బిల్లును బీజేపీ నీరుగార్చింది

రైతుల నుంచి కంపెనీలు, పరిశ్రమలు ఏవైనా భూమి సేకరిస్తే 4 రెట్లు ఎక్కువ పరిహారం ఇచ్చేలా భూసేకరణ బిల్లును కాంగ్రెస్‌ తెచ్చిందని రాహుల్‌ చెప్పారు. పదేళ్లలోపు తీసుకున్న భూమిని పరిశ్రమలు వాడకుంటే తిరిగి రైతులకు ఇచ్చేలా బిల్లులో పెట్టామన్నారు. కానీ దాన్ని బీజేపీ అధికారంలోకి రాగానే నీరు గార్చేసిందని అన్నారు.

రైతు రుణమాఫీకి వాళ్లు డబ్బులివ్వరంట

రైతు రుణమాఫీ చేయాలని కోరితే తమ వద్ద డబ్బులు లేవని బీజేపీ ప్రభుత్వాలు చెప్పాయని రాహుల్‌ మండిపడ్డారు. ఛత్తీస్‌ గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు రైతుల డిమాండ్‌ ను పట్టించుకోలేదని, ఇటీవల ఎన్నికల్లో తమ ప్రభుత్వం వచ్చాక రుణ మాఫీ చేసిందని తెలిపారు. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ 15 ఏళ్లలో చేయలేని పనిని తాము 24 గంటల్లో చేశామన్నారు. ఢిల్లీలో రైతులు ఆందోళన చేసినా ప్రధాని మోడీ కూడా రుణ మాఫీకి డబ్బు లేదన్నారన్నారు. అయితే దేశంలోని 15 మంది కుబేరులకు రుణమాఫీ చేయడానికే వారి వద్ద డబ్బు ఉంటుందని కామెంట్‌ చేశారు. ప్రజలకు ఉద్యోగాలిచ్చే ఆలోచన కూడా మోడీకి లేదని, రాఫెల్‌ డీల్‌ తో తన పారిశ్రామిక మిత్రుడికి మేలు చేయడంపైనే ఆయన ఆలోచన అని రాహుల్‌ ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here