Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ఫోటోగ్రఫీ ఒక సృజనాత్మక కళ’

ఫోటోగ్రఫీ ఒక సృజనాత్మక కళ’ అని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారంనాడు బేగంపేటలో గల ఐ.టి.సి. గ్రాండ్ కాకతీయ హోటల్ లో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ ఫ్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, కమీషనర్ అర్వింద్ కుమార్ లతో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, చాలా మంది ఫోటోగ్రాఫర్లు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోటోగ్రాఫర్లకు మెరుగైన వసతులు కల్పించడానికి మీడియా అకాడమీ ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఫోటోగ్రాఫర్లకు తగినంత ప్రోత్సాహాం లేదని వారిని ప్రోత్సహించే బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. ఫోటోగ్రాఫర్లకు అండగా ఉంటామని తెలిపారు. ఎంట్రీలలో అత్యధికంగా వచ్చిన ఫోటోలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉన్నాయని అన్నారు. అందులో ముఖ్యంగా తెలంగాణ పండుగలు బోనాలు, బతుకమ్మ, నగరాభివృద్ది ఫోటోలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. పాతకాలపు ఫోటోలకు తరగని ఆదరణ ఉంటుందని అన్నారు. 
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, వేయి పదాలు పలికించలేని భావాలను ఒక్క ఫోటో చెబుతుందని అన్నారు. ప్రతి ఫోటోకు ఒక జ్ఞాపకం ఉంటుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నిరాహార దీక్ష, మిలీనియం మార్చ్, శ్రీకాంతాచారి బలిదానం వంటి ఫోటోలు తెలంగాణ చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. జీవం ఉన్న ఫోటోలు పది కాలాలపాటు మదిలో గుర్తుండి పోతాయని తెలిపారు. ఫోటోగ్రాఫర్లను ఫోటో జర్నలిస్టుగా, వీడియో గ్రాఫర్లను వీడియో జర్నలిస్టుగా గుర్తిస్తామని అన్నారు. జర్నలిస్టులకు అందించే సౌకర్యాలు అన్ని ఫోటోగ్రాఫర్లకు అందిస్తామని అన్నారు. 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి మాట్లాడుతూ, ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ దీన్ దయాల్ తెలంగాణ జీవన చిత్రాన్ని, నిజాం పరిపాలన వైభవాన్ని తన కెమెరాతో అందంగా బంధీంచారని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని కోరారు. 
సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ, సమాచార శాఖ తరుఫున ఫోటోగ్రాఫర్లకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రస్థాయి ఫోటో పోటీలలో 104 మంది ఫోటో జర్నలిస్టులు తమ ఎంట్రీలను పంపగా 1124 ఫోటోలను పరిశీలించి అందులో 52 ఫోటోలను జ్యూరీ కమిటీ ఎంపిక చేసిందని ఆయన వివరించారు. బహుమతి పొందిన ఫోటోలను త్వరలో టేబుల్ బుక్ గా ప్రచురిస్తామని అన్నారు. 
ఈ పోటీలలో మొదటి బహుమతి ఆంధ్రజ్యోతి నల్లగొండ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్ కుమార్ కు రూ.25,000/-లు, రెండవ బహుమతి నమస్తే తెలంగాణ హైదరాబాద్ డిప్యూటీ ఫోటో జర్నలిస్టు రజనీకాంత్ కు రూ.20,000/-లు, మూడవ బహుమతి పొందిన ఖమ్మం చావా సంపత్ కుమార్ కు రూ.15,000/-ల చెక్కుతోపాటు ప్రశంసాపత్రం శాలువా మెమెంటోతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ ఫ్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, కమీషనర్ అర్వింద్ కుమార్ ల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. పోటీలలో గెలుపొందిన మిగతా ఫోటో గ్రాఫర్లకు కన్సోలేషన్ ప్రైజులు అందజేశారు. 
ఈ కార్యక్రమంలో సమాచార శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లె, చీఫ్ ఇన్మఫర్ మేషన్ ఇంజనీర్ కిశోర్ బాబు, మీడియా అకాడమీ కార్యదర్శి విజయ్ గోపాల్, సంయుక్త సంచాలకులు డి.ఎస్.జగన్, అధికారులు శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, యామిని, బిమల్ దేవ్, జ్యూరీ సభ్యులు రవీందర్ రెడ్డి, స్టీవెన్ సన్, నాగరాజు, ఫోటో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close