క్రైమ్ న్యూస్

ప్రణయ్‌ హత్యకేసులో కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌

సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసులో కాంగ్రెస్‌ నేత కరీం సహా ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రణయ్‌ భార్య అమృత తండ్రి మారుతీరావు, అతడి తమ్ముడు శ్రావణ్‌కుమార్‌, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీంతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రణయ్‌ను హత్య చేసిన నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతోనే ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాంగ్రెస్‌ నేత కరీం విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రణయ్‌ని హత్య చేసేందుకు మారుతీరావు రూ.10లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

 

ముందస్తు ప్రణాళికతోనే హత్య

మిర్యాలగూడ పట్టణంలో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ను చంపేందుకు ముందస్తుగా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తనకు ప్రాణాపాయం ఉందని ముందే గుర్తించిన ప్రణయ్‌ తన ఇంటి లోపల, బయట ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. అనుమానితుల కదలికలను ఎప్పటికపుడు ప్రణయ్‌ గుర్తిస్తుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు హత్యకు సుపారీ తీసుకున్న గ్యాంగ్‌ సభ్యులు నిరంతరం వారి కదలికలను పర్యవేక్షిస్తుండేవారు. ప్రణయ్‌ శుక్రవారం తన భార్య అమృతను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు కారులో బయటికి రాగానే వెంటనే ద్విచక్ర వాహనంపై నిందితుడు అనుసరించాడు. కారు బయలు దేరిన వెంటనే మూడు నిముషాల వ్యవధిలోనే నిందితుడు వారిని అనుసరించిన విషయం సీసీ కెమెరాలో రికార్డు కాగా దీన్ని ఎస్సై నాగరాజు శనివారం సేకరించారు. పట్టణంలోని సుష్మ ఆసుపత్రి సీసీ కెమెరాల్లో కూడా నిందితుడి కదలికలు నమోదు అయ్యాయి. వీటి ఆధారంగా పక్కాగా నిందితుడు ఆసుపత్రిలోకి ప్రవేశించి అక్కడే మాటు వేశాడు. ప్రణయ్‌ తన భార్య అమృత, తల్లి ప్రేమలతతో కలిసి కారు వద్దకు వస్తుండగానే వెనక నుంచి మాటువేసి కత్తితో నరికి హత్యచేశాడు. హత్య జరిగిన సమాచారం స్వయంగా అమృత తన తండ్రి మారుతీరావుకు ఫోన్‌లో సమాచారం ఇవ్వగానే ఆయన తన వాహనంలో అద్దంకి రహదారిపై వెళ్లాడు. ఈ విషయం మాడుగుల పల్లి టోల్‌గేట్‌ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయింది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close