Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

‘పల్నాటి పులి’కి అంతిమ నివాళి

కడసారి చూపుకై పోటెత్తిన అభిమానులు

  • అంతిమయాత్రలో పాల్గొన్న చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్‌
  • జనసంద్రంగా మారిన నరసరావుపేట
  • స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు

గుంటూరు

మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌కు తెదేపా కార్యకర్తలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం ఆత్మహత్యచేసుకొని అనుమానాస్పద స్థితిలో కోడెల మృతిచెందాడు. కాగా కోడెల హత్య ఏపీలోని వైకాపా, తెదేపా పార్టీల మధ్య రాజకీయ రంగు పులుముకుంది. పోస్టుమార్టం నిమిత్తం మంగళవారం గుంటూరుకు చేరుకున్న పార్దీవదేహానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, కోడెల అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులోని స్వర్గపురిలో ఆయన భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కోడెల ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన గుంటూరు రోడ్డులోని శ్మశానవాటికలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కోడెల అంతిమయాత్ర టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కోడెలను కడసారి చూసేందుకు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. పల్నాడు ప్రాంతంలోని పలు గ్రామాల నుంచి ఆయన అభిమానులు కోడెల నివాసానికి చేరుకొని అంతిమయాత్రలో పాల్గొన్నారు. పెద్దఎత్తున తరలివస్తున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కోట సెంటర్‌ జనసంద్రంగా మారింది. కోడెల అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోడెల నివాసానికి రెండు కిలోవిూటర్ల దూరంలోనే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. కోడెల శివప్రసాదరావుకు సంతాపం తెలుపుతూ నరసరావుపేట పట్టణంలోని దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. పట్టణంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో బంద్‌పాటించారు. ఇదిలా ఉంటే బుధవారం ఉదయం కోడెల నివాసం నుండి 11గంటల సమయంలో అంతిమయాత్ర ప్రారంభమైంది. అంతిమ యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఎమ్మెల్యే బాలకృష్ణ, అచ్చెంన్నాయుడు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. కోడెలను కడసారి చూసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు కోడెల సేవలను గుర్తు చేసుకుంటున్నారు. నరసరావుపేట అభివృద్ధి ఆయన చలవేనంటూ గుర్తుచేసుకుంటున్నారు. కోడెల లాంటి నాయకుడు మళ్లీ రాలేడంటూ నినాదాలు చేశారు. జై కోడెల.. జైజై కోడెల.. పలనాటి పులిబిడ్డ కోడెల అంటూ కార్యకర్తలు, అభిమానులు పెద్దపెట్టున అంతిమయాత్రలో నినాదాలు చేశారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ససేమిరా..

కోడెల పార్దివ దేహానికి గుంటూరు రోడ్డులోని శ్మశానవాటిక 'స్వర్గపురి'లో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రభుత్వ అధికారిక లాంఛనాలు అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు స్పష్టం చేశారు. 

మరోవైపు అధికారులు మాత్రం స్వర్గపురిలో ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ కుమార్‌, ఎస్పీ జయలక్ష్మి టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులతో చర్చించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశామని వివరించారు. అందుకు కోడెల కుటుంబీకులు ససేమిరా అన్నారు. టీడీపీ నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది.


Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close