నిగ్గదీసి అడుగుతున్న ఓటర్లు..

0

సలాం అంటున్నారు.. నమస్తే పెడుతున్నారు.. వంగి వంగి దండాలు పెడుతున్న మీ కపట ప్రేమలు.. అధికారం కోసం మీరుచేసే జిమ్మిక్కులు చెల్లవంటే చెల్లవు.. కనబడని అభివృద్దిని మాయ మాటలతో చూపించారు.. ప్రజలకోసమేమళ్లీ మేమున్నామంటూ బారులు తీరుతున్నారు.. కులం లేదు.. మతం లేదు.. బంధుత్వం అస్సలే లేదు.. మీరేంచేసారో, మా ప్రాంతానికి అభివృద్ది చూపించడంటూ అడుగడుగునా ప్రజలు నిగ్గదీసి నిలదీస్తున్నారు. నువ్వు మంత్రివైనా, ముఖ్యమంత్రివైనా మాకు సంబంధమే లేదంటున్నారు.. ఐఎంఐకు కంచుకోటగా మారిన పాతబస్తీలో ఆ పార్టీ అధినేతనే ఎందుకు వచ్చారని ఎదురుతిరిగారు.. పాతబస్తీలో మీరు చేసిన అభివృద్దిని చూపించడని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నిలదీసే సరికి, సమాధానం చెప్పలేక జారుకున్నారు ఆ పార్టీ అధినేత.. ప్రజలు మారుతున్నారు.. ప్రశ్నిస్తున్నారు.. ఇప్పుడుమారాల్సింది ప్రజలు కాదు నాయకులు… ఎవరూ ఊహించిన వ్యతిరేకత ఎదురయ్యేసరికి ఏం చెయ్యాలో పాలుపోక పలు పార్టీల నాయకులు సందిగ్దంలో పడుతున్నారు…

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అభివృద్ది అడుగుతున్నారు.. గ్రామాలను ఎన్నిసార్లు సందర్శించారు.. ఎన్నిసార్లు ప్రజలతో సమస్యలపై స్పందించారోచెప్పండని ప్రజలు నిలదీస్తున్నారు.. గుక్కెడు నీటి చుక్కకోసం కిలోమీటర్ల దూరం పోతున్నామని చెప్పిన పట్టించుకోని ఈ నాయకులు మళ్లీ కపట ప్రేమలు వల్లబోస్తూ ఓట్లడగడానికి వస్తున్నారని ప్రజలు ఎక్కడికక్కడ తిరస్కరిస్తున్నారు. ఐదు సంవత్సరాలకొకసారి మీకు ప్రజలు గుర్తుకు వస్తారు.. ఎందుకంటే ఓటు అనే ఆయుధం వారి దగ్గర ఉందనేఆ మాత్రం ప్రేమను కురిపిస్తున్నారు.. ఆ తర్వాత ప్రజల బాధలను పట్టించుకునే వారే కరువవుతున్నారు. ఓట్లు వేసిన జనాల సమస్యలన్నా, జనాల మాటలన్నా మీకు అంత చులకనగా కనబడుతోందని ప్రజలు అడిగేసరికి నాయకులు నోరెళ్ల పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ధికమంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. వేసవికాలం వస్తే జమ్మికుంట నియోజకవర్గం కేంద్రంలో నీటికోసం పడుతున్న బాధలు వర్ణానాతీతమని అప్పుడు ఎంత చెప్పినా, అధికారులు కార్యాలయాల చుట్టూ, నాయకుల ఇంటిచుట్టూ తిరిగి తిరిగి, చెప్పి చెప్పి మాకే విసుగు వచ్చింది కాని మా గోడును ఒక్కరంటే ఒక్కరూ కూడా పట్టించుకోలేదు. తమ సమస్యలు గుర్తుకురాని మంత్రివర్యులకు మళ్లీ ఓట్లు పండగ రాగానే ప్రజలు గుర్తుకువచ్చారా అంటూ అక్కడి మహిళలలు ఖాళీ బిందెలతో ఈటెల రాజేందర్‌ను ప్రశ్నించి, ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు. చేసేదేమి లేక మంత్రిగారు అక్కడినుంచి చిత్తగించారు. సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కెటిఆర్‌ అక్కడ ఒక వర్గానికే మద్దతు తెలుపుతూ, ప్రజల సమస్యలను విస్మరిస్తున్నారనే ఆరోఫణలున్నాయి. ప్రజలతో సంబంధాలు నెరపకుండా, నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా తిరిగిన కెటిఆర్‌కు అక్కడ అసమ్మతి తారాస్థాయిలో ఉంది.

పాతబస్తీలో ఎంఐఎంకు వ్యతిరేకతే…

పాతబస్తీ ఎంఐఎంకు ంచుకోట.. ఏ పార్టీ నాయకుడు అక్కడ ప్రచారం చేయాలన్న, అక్కడ అడుగుపెట్టాలన్న అక్కడి ఓటర్లు అవకాశం కాదు కదా, వారిని స్వాగతించరు. అక్కడ ఒక్కటే పార్టీ ఎంఐఎం ఆ పార్టీ ఎన్నికల బరిలో ఎవ్వరిని నియమించినా అక్కడి వారి గెలుపు చాలా సులువు.. కాని రోజురోజుకు జరుగుతున్న మార్పులు, పరిణామాలుచూస్తుంటే ఎంఐఎం పాతబస్తీపై పట్టుకోల్పోతుందా అన్నట్టు ఉంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో మజ్లిస్‌ సైతంబరిలో దిగిన సంగతి తెలిసిందే. పాతబస్తీలో ఎంఐఎం పూర్తి మెజారిటితో అన్ని సీట్లు గెలుపు సాధిస్తారని తెరాసకు మద్దతు ప్రకటిస్తారనే ఆశ కెసిఆర్‌లో ఉంది. కాని ఎంఐఎం ఎన్నికల ప్రచారంలో మజ్లిస్‌ అభ్యర్థులకు పాతబస్తీలో ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మజ్లిస్‌ నాయకులతో కలిసి ప్రచారం చేస్తుండగా నిరసన సెగ తగిలింది. ఇప్పటివరకు మాకు ఏం చేశారు. మీకు ఎందుకు ఓటు వేయాలనే ప్రశ్నను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంఐఎం పార్టీ అభ్యర్థి జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌ వెంట అసదుద్దీన్‌ హైదరాబాద్‌ నాంపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. నాంపల్లిలోని మాన్‌గోడ్‌ బస్తీ, చార్‌ ఖందిల్‌ ప్రాంతాల ప్రజలు ఓవైసీని అడ్డుకున్నారు. తమ సమస్యలపై నిలదీశారు. అసదుద్దీన్‌ ప్రజలను సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినలేదు. నాలుగున్నరేండ్ల కిందట మీ పార్టీ అభ్యర్థిని చూశాం. మళ్లీ ఇప్పుడు చూస్తున్నాము. మా బస్తీల్లో మంచినీరు డ్రైనెజీ సమస్య తీవ్రంగా ఉంది. సమస్యల పరిష్కారానికి వాటర్‌ వర్క్స్‌ కార్యాలయం చుట్టూ తిరగాము. స్థానిక కార్పోరేటర్‌ను కలిసి పలుమార్లు వివరించినా మా సమస్యలను ఒక్కరంటే ఒక్కరూ పట్టించుకోలేదని వారు ప్రశ్నించారు.

పాతబస్తీలో ఎంఐఎం పార్టీకి తిరుగులేదని అందరూ

అనుకుంటారు. అక్కడి కూడా అభివృద్ది పడకేసిందని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ వారి గెలుపు ఎంత దూరమో అర్థంకాని పరిస్ధితి. మజ్లిస్‌ నాయకులు కూడా గెలిచిన తర్వాత బస్తీల వైపు చూడడం లేదనే ఆరోపణలున్నాయి. అందుకే మజ్లిస్‌ పార్టీకి అనిచూడకుండా ప్రశ్నలమీద ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మీ కల్లబల్లి మాటలు వినే స్థితిలో ఇప్పటి ప్రజలు లేరని, తమరి ఇక్కడినుంచి వెళ్లిపోతే మంచిదని చెప్పడంతో చేసేదేమి లేక అసదుద్దీన్‌ ఓవైసీతో పాటు ఆయన వెంట బరిలో ఉన్న అభ్యర్థులు వెనుదిరుగుతున్నారు. పాతబస్తీలో మజ్లిస్‌ పార్టీ ఇలాకా అనుకుంటున్న నాయకుల్లో ఇలాంటి పరాభవం ఎదురవుతున్న నేపథ్యంలో అసదుద్దీన్‌ అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. మూడు నియోజకవర్గాల్లో ఇలాంటి ప్రతిఘటనలు ఎదురవడంతో ఇద్దరు అభ్యర్థులను కార్యాలయానికి పిలిచి తీవ్రస్థాయిలో హెచ్చరించినట్టు తెలిసింది. ఎంతోకాలంగా మజ్లిస్‌ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నామని, ఇప్పటివరకు పార్టీపై ఏలాంటి మచ్చ లేకుండా నడుపుతున్నాను, ప్రజల సమస్యలపై ఏర్పాటు చేసిన పార్టీ ఇలా ప్రజలు దూరమవుతుంటే బాధగా ఉందని, ఇంకోసారి ఇలాంటి పిర్యాధులు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అసదుద్దీన్‌ ఓవైసీ తమ మజ్లిస్‌ అభ్యర్థులకు సూచించినట్లు తెలుస్తుంది. మీ వల్ల పార్టీ పేరు నాశనమవుతోంది, ఇంకా సారి అలా జరగకూడదు, జాగ్రత్తగా పనిచేసుకుంటూ ప్రజల్లో ఉండాలని మజ్లిస్‌ పార్టీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజులు మారుతున్న కొద్ది యువతరం పెరుగుతుండడం ఒకవైపుగా ఉంటే, మరోవైపు సామాజిక మాధ్యమాల వల్ల పూర్తి సమాచారం తెలుసుకొని ప్రశ్నిస్తున్నారని అభిప్రాంయ వ్యక్తమవుతోంది. ఓవైసీలపై పాతబస్తీలో అభిప్రాయం మారుతోందనేందుకు ఇదే తార్కాణం అని వారి రాజకీయ ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here