నా పేరెత్తడానికే భయపడేవాళ్ళా నన్ను ఓడించేది?

0

కొడంగల్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాబోయే 48 గంటల్లో కొడంగల్‌లో మరెన్నో అరాచకాలు స ష్టించేందుకు తెరాస కుట్ర చేస్తోందని, అందుకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ కూటమి అభ్యర్థి రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌ ప్రజల అండ ఉన్నంత వరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. కోస్గి సభలో తన పేరు ప్రస్తావించడానికి భయపడిన కేసీఆర్‌.. ఇంకా నన్నేం ఓడిస్తారని ప్రశ్నించారు. పోలీసుల అదుపు నుంచి విడుదలైన అనంతరం ఆయన కొడంగల్‌లో మాట్లాడు తూ ఈ వ్యాఖ్యాలు చేశారు. ”కొడంగల్‌ నియోజక వర్గంలో కేసీఆర్‌ అరాచకాలు, ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రలోభాలకు గురిచేసేందుకు రూ.100 నుంచి రూ.150 కోట్లతో ఇక్కడి ప్రజలపై కేసీఆర్‌ యుద్ధం ప్రకటించారు. 2009లో ఎంపీగా కేసీఆర్‌ గెలిచినప్పుడు ఇక్కడి ప్రజలే కీలక పాత్ర పోషించారు. ఎంపీగా ఐదేళ్లు, సీఎంగా నాలుగున్నరేళ్లు ఉన్న కేసీఆర్‌.. ఏనాడూ కొడంగల్‌ ప్రజల బాగోగులు పట్టించుకోలేదు. రాష్ట్ర సమస్యలను నేను బలంగా ప్రస్తావిస్తున్నందుకు.. ఇక్కడి ప్రజలను కొనాలని గత ఏడాదిగా కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది రూ.200 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఎలాగైనా కొడంగల్‌లో గెలిచేందుకు కుట్రలు, కుతంత్రాలు చేశారు. ప్రజలు వాటిని తిప్పికొట్టడంతో పోలీసులతో మండల స్థాయి నాయకుల ఇళ్లపై దాడులు చేయిం చారు. ఇంట్లో మహిళలు ఉన్నారని చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే ధర్నాలు చేశా” అని అన్నారు. ముగ్గురూ రండి తేల్చుకుందాం.. ”తెల్లవారుజామున మూడు, నాలుగు గంటల మధ్య నా బెడ్‌రూంలోకి వచ్చి దౌర్జన్యంగా పోలీసులు నన్ను తీసుకెళ్లారు. రాచరికం, నియంతల పాలనలో కూడా ఎవరూ ఇంతలా ఆధిపత్యం చెలాయించలేదు. ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేయడానికి ఎంతకైనా తెగిస్తారనడానికి ఇదే ఉదాహరణ. కొడంగల్‌లో గెలవాలంటే ప్రజలు మనసు గెలవాలే తప్ప ఇలా దాడులు చేసి, ఇక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి కాదు. ముందస్తులో నెగ్గడానికే ముందస్తు అరెస్టులకు పాల్పడుతున్నారు. హరీశ్‌రావు, కేటీఆర్‌ వచ్చినా చేతకాలేదు. అందుకే కేసీఆర్‌ రంగంలోకి దిగారు. ఇంకా ఎన్నికలకు 48 గంటల సమయం ఉంది. ముగ్గురూ రండి కొడంగల్‌ చౌరస్తాలో తేల్చుకుందాం” అని సవాల్‌ విసిరారు. ఓటుకు రూ.5వేలు ఇస్తున్నారు.. ”పోలింగ్‌ స్లిప్పుల పంపిణీ ముసుగులో ఓటుకు రూ.5వేలు ఇచ్చి ఇక్కడి ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి హరీశ్‌రావు ఆ పంపకాల పనిలో ఉన్నారు. ఇక్కడ స్లిప్పులు ఇస్తే హైదరాబాద్‌లో నగదు ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కోట్ల రూపాయలు దొరికినా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు. కోర్టుకు సమాధానం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే నన్ను విడిచిపెట్టారు. ఈ 48 గంటల్లో ఇంకా ఎన్నో అరాచకాలు చేయాలని తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏ క్షణంలోనైనా ఏ అరాచకమైనా జరగొచ్చు. విచక్షణ కోల్పోయిన తెరాస నాయకులు ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డానికి సిద్ధంగా ఉన్నట్లు నాకు సమాచారం ఉంది. కొడంగల్‌ ప్రజలు అండగా ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఏం చేయలేరు. కోస్గి సభలో నాపేరు ప్రస్తావించడానికి భయపడిన కేసీఆర్‌.. నన్ను కొడంగల్‌లో ఓడిస్తారా? సవాళ్లు చేస్తున్న కేటీఆర్‌ బహిరంగ చర్చకు రావాలి” అని రేవంత్‌ సవాల్‌ విసిరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here