నా ఓటు.. నా ఇష్టం…

My vote .. i like my ...

0

అంతుబట్టని ఓటర్ల ఆలోచన సరళి…

ఎవరూ చెప్పినా వింటాం…

ఓటరు.. ఎవరికి అంతు చిక్కడం లేదు… ఎవరికి అంతుబట్టడం లేదు.. ఎవరూ ఎవరికి ఓటు వేస్తారో కూడా ఊహించడానికి అవకాశమే లేకుండా పోతుంది… పది పార్టీల నాయకులు వందమంది వచ్చి అన్నా అని పలుకరిస్తే చాలు మా ఓటు మీకే అంటారు. పార్టీ అభ్యర్థులు వచ్చి అక్కా అని గుమ్మం ముందు నిలబడితే చాలు మిమ్మల గెలిపించే బాధ్యత మాదే అంటూ చిరునవ్వుతో స్వాగతం పలుకుతారు.. నాయకులందరికి మాట ఇచ్చి, అన్ని పార్టీల సభలకు, సమావేశాలకు హజరవుతారు. ఎన్నికలకు ఒక్కరోజు ముందు జరిగే తతంగంలో అందరూ మనవాళ్లంటూ, మనమంతా ఒక్కటంటూ ఎవరెమి ఇచ్చినా ఆనందంగా స్వీకరిస్తారు.. చివరకు ఎవరికి ఓటు వేస్తారో, పోలింగ్‌ బూత్‌ వెళ్లేవరకు కూడా ఎవరికి అంతుబట్టదు.. అందుకే అభ్యర్థులంతా మా వారే.. ఓటు మాత్రం మా ఇష్టమే అంటున్న ఓటర్లు బరిలో ఉన్న నాయకులతో పాటు, అభ్యర్థులకు వణుకు పుట్టిసున్నారు. అందరికి అన్ని పంచినా నాయకులు ఓటు మాత్రం ఎవరికి పడుతుందో తెలియక టెన్షన్‌ తట్టుకోలేకపోతున్నారు.. కాని ఓటర్లు మాత్రం ఎవరికి ఓటేస్తామో చెప్పేదే లేదంటున్నారు…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

ఓటరు రోజురోజుకు నాయకులకన్నా తెలివైనోడిలా మారిపోతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరెన్ని మాటలు చెప్పినా ఓపికగా వింటాడు. అమలు కాని హామీలు వరదలా ఎన్ని కురిపించినా ఆనందంగా తడిసి ముద్దైపోతాడు. ఎన్ని పార్టీలవారు ఎవరెన్ని డబ్బులిచ్చినా మారుమాట్లాడకుండా తీసుకుంటాడు. అంతా నా వాళ్లే, బరిలో ఉన్న అభ్యర్థులంతా తన వాళ్లేనంటూ తన భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికల్లో మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటాడు. ఎన్నికల పండుగ వచ్చిందంటే చాలు నాయకుల హడావుడీకి తగ్గట్టుగానే ఓటర్ల ఆలోచన సరళి కూడా మారిపోతుంది.. అధికారంలో ఉన్నప్పుడు గ్రామ సమస్యలు, అభివృద్దిపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకొని నాయకులు నేడు మొసలి కన్నీరుతో గ్రామాల బాట పడుతున్నారు.. ఐదు సంవత్సరాల నుంచి పలు గ్రామాలను, సమస్యలను పట్టింపులేని, పట్టించుకోలేని ఓటర్లంటే నాయకులకు ఎనలేని గౌరవం, ప్రేమ పొంగిపోతుంది. మీరు నా ఆత్మీయులంటూ ఒకరూ, మీరు నా సన్నిహితులు, హితులంటూ మరొకరు, కపట ప్రేమను కుండపోతుగా కురిపిస్తుంటూ ఓటర్లను మచ్చిక చేసుకొనే పనిలో బిజీగా మారిపోయారు. నాయకగణం నటించే పాత్రలకు అలవాటు పడిపోయిన ఓటర్లు కూడా వారి బాటలోనే నడుస్తున్నారు. ఎవరొచ్చి చెప్పినా, ఎవరూ ఎక్కడ సమావేశం, సదస్సు ఉందని సమాచారం ఇచ్చినా ఆనందంగా తలలూపుతే అందరి బహిరంగసభ సమావేశాలకు వేలాదిగా హజరవుతున్నారు. ఇదే జనం మరోకరి సమావేశానికి వెళుతున్నారు.. అందరూ మా వారే, నాయకులంతా మంచివారే అనే నానుడిని పక్కా ఫాలో అవుతున్నారు.

ఎక్కడ సమావేశం ఉన్న నాయకులు వాహనాలు, అందుకు సంబంధించిన సరంజామా ఏర్పాటు చేస్తే చాలు వాహనాలు నిండిపోతున్నాయి. గ్రామాల్లో చాలామందికి ఒక పార్టీ అంటూ ఏమి ఉండదు, ఒక వర్గం అంటూ ఉన్నప్పటికి ఎన్నికల ముందు అవేమీ పట్టించుకోరు. అందుకే ఏ నాయకుడు వెళ్లినా, ఎక్కడ పలుకరించినా అందరితోనూ అనురాగంగా, అప్యాయంగానే మాట్లాడుతూ స్వాగతం పలుకుతున్నారు.. బరిలో ఉన్న ప్రతి అభ్యర్థికి వీరు మనవాళ్లేననే ఆలోచన, ఆసక్తిని కలిగిస్తున్నారు. అందరూ మా వాళ్లే కాని ఓటు రోజు ముందు జరిగే పంపకాలలో పార్టీలు, నాయకులంతా సమానమేనని వాటాలు వసూలు చేస్తున్నారు… అందరి దగ్గర సమాన వాటాలు తీసుకుంటున్నా ఓటర్లు ఎవరికి పట్టం కడుతున్నారో ఫలితాలచ్చే వరకు అంతుబట్టని పరిస్థితే…

అందరూ ఇవ్వాల్సిందే..

అభిమానం ఏదో ఒక పార్టీపైననో, నాయకుడిపైననో ఉంటుంది. కాని బరిలో పదిమంది ఉన్నప్పుడు వారందరికి సమానంగానే స్వాగతం పలుకాలంటున్నారు ఓటర్లు. తెలంగాణలో జరిగిన మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, టిజెఎస్‌లు మహాకూటమిగా ఏర్పడి తెరాసను ఓడించాలని శతవిధాలా ప్రయత్నాలు చేశారు. వారికి తగ్గట్టుగానే టిఆర్‌ఎస్‌ కూడా అభ్యర్థులందరిని ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఓటర్లను ఆకర్షించేలా మంత్రాలను ప్రయోగించారు. కాని ఓటర్లు అందరిని ఆహ్వానించి, అందరికి భరోసా ఇచ్చి ఎవరికి ఓటు వేయాలో వారికి ఓటు వేస్తూ మిగతా పార్టీలకు చుక్కలు చూపించారు. కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ ఇరు పార్టీలు కోట్లు కుమ్మరించినా చివరకు టిఆర్‌ఎస్‌ పార్టీనే విజయం సాధించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు నువ్వా, నేనా అన్నరీతిలో కొనసాగుతున్నాయి. అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలకు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు జీవన్మరణ సమస్యగా భావిస్తూ పోరాడుతున్నాయి. అందుకే తెలుగువారు ఎక్కడున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతో ఉన్నారు. తెలంగాణలో మాదిరిగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ నెల పదకొండునే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనుండడంతో అక్కడ ఓటర్లతో పాటు అభ్యర్థులు కూడా అన్నిరకాలుగా సిద్దమైపోతున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ ఎంత డబ్బు ఇచ్చినా తీసుకుందామని ఓటర్లు రెడీగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరిచ్చినా, ఎంతిచ్చినా సరే మోహమాట పడకుండా తీసుకుంటామని రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు డిసైడ్‌ ఐపోయారని సమాచారం.

ఎన్నికల్లో పంచేది సొంతడబ్బులా….

ఎన్నికల్లో విచ్చలవిడిగా పంచుతున్నదీ వారి కష్టపడి సంపాదించిన డబ్బులు కాదని, ప్రజలనుంచి దోచిన డబ్బులే కదా, అందుకే తీసుకుందామంటూ గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. కాని ఎవరూ ఎంతిచ్చినా, కాళ్లు మొక్కి, గదువ పట్టుకున్నా తీసుకునేదీ తీసుకుందాం, ఓటు మాత్రం మన మనసులో ఉన్నవారికి, మనకు నచ్చినవారికి ఓటేద్దామని ఓటర్లు ఫిక్స్‌ అయిపోయారని అంటున్నారు. తమ సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో, తమకు ఎవరైతే ఐదు సంవత్సరాలు అందుబాటులో ఉంటారో వారికే ఓటేద్దామని ఓటర్ల నాడీగా తెలిసిపోతుంది. ఇలా ఓటర్లందరూ డబ్బులు తీసుకోవడానికి ఓకే అనుకుంటున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. అందుకే బరిలో ఉన్ననాయకులు, పార్టీలు డబ్బులు పంచేముందు ఈసారి అచితూచి వ్యవహరించాలని, తొందరపడి డబ్బును విచ్చలవిడిగా పంచుతే చివరకు గెలుపుతో పాటు డబ్బు కూడా పోతుందని ఆలోచనలో నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరూ మనవారో, ఎవరూ పరాయి పార్టీవారో ఆలోచించి పంపకాలు మొదలెట్టాలని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేసుకున్నారని తెలిసిపోతుంది. రోజురోజుకు మారిపోతున్న ఓటర్ల ఆలోచన సరళి బరిలో నిలుచున్న అధికారులకు భయాన్ని రెకెత్తిస్తుందని, అందుకే ఎన్నికల బరిలో నిలబడాలంటేనే వణుకు మొదలవుతుందంటున్నారు కొంతమంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు. ప్రజలకు డబ్బులివ్వడం అలవాటు చేశారని, ఇప్పుడు ఓటుకు నోటు ఇవ్వకుంటే ఓటు పడే పరిస్థితి లేదనే వాదన రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రజలకు అలవాటు చేసిందీ నాయకులు, ఇప్పుడు కాదంటూ నాయకుల మనుగడే సాగేలా లేదు. అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్న ఓటర్లు ఎవరికి విజయాన్ని అందిస్తారో, మరెవరికి పరాజయాన్ని అప్పగిస్తారో అర్థమే కావడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here